ఆస్ట్రేలియాలో హైదరాబాదీ ‘ఉగ్ర’రూపం – సిడ్నీ కాల్పుల టెర్రరిస్ట్ రాజధాని వాసుడే

Hyderabad link in Australia Attack
  • ఇక్కడి నుంచే పాస్‌పోర్ట్ తీసుకున్న టెర్రరిస్ట్
  • అంతర్జాతీయ మీడియాలో హోరెత్తిన నగరం
  • గతం నుంచే ఇక్కడ ఉగ్రవాదులకు సహకారం
  • పాస్‌పోర్ట్ అధికారుల తీరుపై విమర్శలు
  • దేశంలో టెర్రరిస్టు దాడుల్లో హైదరాబాదీలు

సహనం వందే, హైదరాబాద్:

ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలతో హైదరాబాద్‌ కు లింకులు పదే పదే వెలుగులోకి రావడం దేశ భద్రతకు పెను సవాల్‌గా మారింది. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన బీచ్ కాల్పుల దాడిలో 15 మందిని పొట్టనబెట్టుకున్న సాజిద్ అక్రమ్ అనే ఉగ్రవాదికి భారత పాస్‌పోర్ట్, అది కూడా హైదరాబాద్ నుంచి తీసుకున్నట్లు గుర్తించడం అనేక ప్రశ్నలకు దారితీసింది. సాజిద్ అక్రమ్ భారతీయ మూలాలు ఉన్నప్పటికీ, అతని రాడికలైజేషన్ అంతర్జాతీయ ఉగ్రవాదంతో ముడిపడి ఉంది.

హైదరాబాద్ పాస్‌పోర్ట్…
సిడ్నీలోని ప్రసిద్ధ బాండి బీచ్ వద్ద గత ఆదివారం హనుక్కా ఉత్సవం జరుగుతుండగా 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, అతని 24 ఏళ్ల కొడుకు నవీద్ అక్రమ్ విచక్షణారహితంగా కాల్పులు జరిపి 15 మందిని చంపారు. ఈ దాడి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. సాజిద్ భారత పాస్‌పోర్ట్‌ను ఉపయోగించాడు.

ఇంతటి ప్రమాదకర ఉగ్రవాదికి హైదరాబాద్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయం ఎలాంటి తనిఖీలు లేకుండా అంత సులువుగా పాస్‌పోర్ట్ ఎలా మంజూరు చేసిందనేది అంతుచిక్కని ప్రశ్న. కాల్పుల స్థలంలో అతని కారులో ఐడీలు, ఐసిస్ జెండాలు లభించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ ఘటనలో సాజిద్ మరణించగా, నవీద్ పోలీసుల కాల్పుల్లో గాయపడ్డాడు.

ఉగ్రవాద నెట్‌వర్క్‌ల కేంద్రం…
హైదరాబాద్ గత కొంతకాలంగా ఉగ్రవాద కార్యకలాపాలకు ఒక కీలక కేంద్రంగా మారుతోందనే భయాలు ఉన్నాయి. అనేక జాతీయ, అంతర్జాతీయ టెర్రరిస్ట్ గ్యాంగులకు ఇక్కడి నుంచి సహకారం లభించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ ఉగ్ర లింకులలో ప్రధానంగా వినిపించిన పేర్లు, సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

  • అబ్దుల్ నయీమ్ షేక్: 2002లో అబ్దుల్ నయీమ్ షేక్ అనే ఉగ్రవాది లష్కరే తోయిబా తరఫున హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాలలో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించాడు. అతను మహారాష్ట్రలో పట్టుబడ్డాడు.
  • ముంబై 26/11 లింక్: 2008 ముంబై దాడుల సమయంలో టెర్రరిస్ట్‌లకు సహకరించిన ఫహీమ్ అన్సారీ అనే వ్యక్తికి హైదరాబాద్‌లో లింకులు ఉన్నట్లు అనుమానించారు.
  • ఇండియన్ ముజాహిదీన్: 2007లో హైదరాబాద్‌లోని గోకుల్ చాట్, లుంబినీ పార్క్‌లలో జరిగిన జంట పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉంది. ఈ దాడులలో కీలక పాత్ర పోషించిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరి వంటి వారికి హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలింది.
  • ఐసిస్ సానుభూతిపరులు: 2016లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైదరాబాద్‌లో ఐసిస్‌కు మద్దతు ఇస్తున్న ఓ గ్యాంగ్‌ను ఛేదించింది. ఇందులో మహమ్మద్ ఇబ్రహీం యజ్దాని, హబీబ్ మొహమ్మద్ వంటి యువకులను అరెస్టు చేశారు. వీరు ఐసిస్ కోసం యువతను రిక్రూట్ చేయడం, దాడులకు ప్రణాళికలు రచించడం వంటివి చేశారు.
  • తీవ్రవాద శిబిరాలు: దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన ఉగ్రదాడులకు శిక్షణ పొందిన కొంతమంది యువకులు హైదరాబాద్‌కు చెందినవారే. జైషే మహమ్మద్ వంటి సంస్థలు ఇక్కడ రహస్యంగా తమ కార్యకలాపాలను నిర్వహించినట్లు గత దర్యాప్తుల్లో తేలింది.

భద్రతా వైఫల్యంపై విమర్శలు…
ఇప్పటికే ఉగ్రవాదానికి సంబంధించి పలుమార్లు వార్తల్లో నిలిచిన హైదరాబాద్ నుంచి మరో అంతర్జాతీయ టెర్రరిస్ట్‌కు పాస్‌పోర్ట్ లభించడం… గతంలో ఉగ్ర నెట్‌వర్క్‌లు ఇక్కడ పాగా వేయడం భద్రతా సంస్థల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. సాజిద్ అక్రమ్ 1998లో ఆస్ట్రేలియా వెళ్ళినా ఇప్పటికీ భారత పాస్‌పోర్ట్ కలిగి ఉండి అంతర్జాతీయంగా ఐసీస్ భావజాలంతో ప్రభావితమై కాల్పులకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ పోలీసులు సాజిద్‌కు ఇక్కడ నేర చరిత్ర లేదని చెప్పినా, అతని రాడికలైజేషన్ వెనుక ఉన్న అసలు కారణాలను, దేశంలో ఉన్న ఏవైనా స్లీపర్ సెల్స్ లింకులను కనుగొనాల్సిన అవసరం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *