- చెల్లెలికి ఆస్తి ఇవ్వనంటున్న మాజీ సీఎం
- అప్పిలేట్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు
- ఆస్తులన్నీ తన కష్టార్జితమే అని జగన్ వ్యాఖ్య
- చట్టాలు జగన్‌కు వర్తించవా అని విమర్శలు
సహనం వందే, హైదరాబాద్:
తన సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు ఆస్తుల్లో వాటా ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ససేమిరా అంటున్నాడు. రాజకీయంగా చెల్లెలు తనకు వ్యతిరేకంగా మారడంతో ఆమెకు ప్రేమతో ఇచ్చిన వాటాలను కూడా వెనక్కి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎన్నోసార్లు బహిరంగంగా ప్రకటించిన జగన్… ఇప్పుడు ఏకంగా చెన్నైలోని జాతీయ కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో పిటిషన్ దాఖలు చేశారు. ఇది కేవలం ఆస్తి వివాదం కాదని… రాజకీయ వైరమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. 2019 ఆగస్టు 31న సరస్వతి పవర్ లిమిటెడ్‌తోపాటు మరికొన్ని ఆస్తుల్లో వాటా ఇవ్వాలని తాను చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని జగన్ కోరుతున్నాడు. తన రాజకీయ ప్రత్యర్థిగా మారిన చెల్లెలికి ఒక్క రూపాయి కూడా దక్కకుండా చేయాలనే ప్రతీకార రాజకీయానికి ఇది పరాకాష్ట..

నా ఆస్తి, నా ఇష్టం…
జగన్ తన పిటిషన్‌లో తాను ప్రేమతో ఇచ్చిన ఆస్తులన్నీ తన కష్టార్జితమే అని… వాటిపై షర్మిలకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవని స్పష్టం చేయడం గమనార్హం. గతంలో ఈడీ కేసులు… ఆస్తుల జప్తు పూర్తయిన తర్వాత వాటాలు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పడం… ఇప్పుడు రాజకీయం మారగానే ఆస్తులన్నీ తనవే అని వాదించడం ఎంతవరకు సమంజసమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో తల్లి విజయమ్మ లేఖ ఆధారంగా సరస్వతి కంపెనీ బోర్డు ఏకపక్షంగా వాటాలు బదలాయించేలా తీర్మానం చేసిందని… దాన్ని తాను సవాల్ చేసి రద్దు చేయించానని జగన్ గుర్తుచేశాడు. చట్టాలు, కోర్టుల ద్వారా తన చెల్లెలికి ఆస్తులు దక్కకుండా అడ్డుకోవడానికి జగన్ సామదాన భేద దండోపాయాన్ని ఉపయోగిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చట్టాలు జగన్‌కు వర్తించవా?
జగన్ చర్యపై వైఎస్ షర్మిల అభిమానులతో పాటు ప్రతిపక్ష కూటమి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చట్టాల గురించి మాట్లాడే జగన్… తండ్రి ఆస్తిలో పిల్లలు అందరికీ సమాన హక్కులు ఉంటాయన్న ప్రాథమిక చట్టాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సొంత చెల్లెలికి న్యాయం చేయలేని జగన్… ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకెలా న్యాయం చేస్తాడని కూటమి నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. కుటుంబ సంబంధాలు, ఆస్తుల పంపకం వంటి వ్యక్తిగత అంశాల్లో కూడా రాజకీయ వైరాన్ని చొప్పించి కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శించడం జగన్ పాలన శైలికి అద్దం పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆస్తి పోరు అన్న చెల్లెలి మధ్య రాజకీయ వైరానికి నిదర్శనంగా నిలుస్తోంది.