- భారత పాక్ ఉమ్మడి వారసత్వంగా భావన
- భగవద్గీత, మహాభారతం పండితుల తయారీ
- ముస్లిం ప్రొఫెసర్లే సంస్కృతం అధ్యాపకులు
- ఉర్దూ పదాలు సంస్కృతం నుంచే వచ్చాయి
సహనం వందే, పాకిస్తాన్:
ఏడు దశాబ్దాల తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దేశ విభజన తర్వాత ఏకంగా ఏడు దశాబ్దాలకు అక్కడ మళ్లీ సంస్కృత మంత్రాలు వినిపిస్తున్నాయి. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (ఎల్ యూఎంఎస్) తొలిసారిగా సంస్కృత బోధనను పునరారంభించింది. ఇది కేవలం భాష కాదు ఇదొక సాంస్కృతిక వారధి అని అక్కడి ప్రొఫెసర్లు బల్లగుద్ది చెబుతున్నారు. భారత పాకిస్తాన్ ఉమ్మడి వారసత్వంలో సంస్కృతం కీలకమని… అందుకే పురాతన గ్రంథాలను మూల భాషల్లోనే చదవాలన్న ఉద్దేశంతో ఈ ప్రయోగం చేపట్టారు.

విపరీతమైన క్రేజ్
మొదట దీన్ని మూడు నెలల వీకెండ్ వర్క్‌షాప్‌గా మాత్రమే ప్రారంభించారు. కానీ దీనికి వచ్చిన స్పందన చూసి నిర్వాహకులే ఆశ్చర్యపోయారు. విద్యార్థులు, పరిశోధకులు, న్యాయవాదులు ఇలా ఎంతోమంది ఆసక్తి చూపడంతో ఇప్పుడు ఏకంగా నాలుగు క్రెడిట్ల పూర్తిస్థాయి యూనివర్సిటీ కోర్సుగా మార్చేశారు. ప్రస్తుతం గుర్మని సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అలీ ఉస్మాన్ కాస్మీ, సోషియాలజీ ప్రొఫెసర్ షాహిద్ రషీద్ ఆధ్వర్యంలో ఈ క్లాసులు జోరుగా సాగుతున్నాయి.
గీతా పండితుల తయారీ
ఈ చొరవ ఇలాగే కొనసాగితే రాబోయే పది పదిహేను ఏళ్లలో పాకిస్తాన్ గడ్డపై భగవద్గీత మహాభారతం పండితులు తయారవుతారని ప్రొఫెసర్ అలీ ఉస్మాన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య తక్కువగానే ఉన్నా భవిష్యత్తులో ఇది కచ్చితంగా పెరుగుతుందని నమ్ముతున్నారు. 2027 నాటికి దీన్ని పూర్తి స్థాయి వార్షిక కోర్సుగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
మన మట్టి భాష
సంస్కృతం అంటే ఏదో ఒక మతానికి చెందిన భాష కాదని ఇది తమ ప్రాంతానికి కూడా చెందినదని డాక్టర్ షాహిద్ రషీద్ స్పష్టం చేశారు. సంస్కృత వ్యాకరణకర్త పాణిని పుట్టింది ఇక్కడేనని… సింధు లోయ నాగరికత కాలంలో ఎన్నో గొప్ప రచనలు ఇక్కడే జరిగాయని గుర్తు చేశారు. అందుకే సంస్కృతాన్ని ఒక సాంస్కృతిక శిఖరంగా భావించి దాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు.
ఉర్దూ మూలాలు అక్కడే…
మనం రోజూ వాడే ఉర్దూ పదాలు సంస్కృతం నుంచే వచ్చాయని తెలుసుకున్న విద్యార్థులు అవాక్కవుతున్నారు. మొదట నేర్చుకోవడం కష్టంగా అనిపించినా ఆ తర్వాత ఆనందంగా చదువుతున్నారు. సంస్కృతం రాకపోతే ఆధునిక భాషల వెనుక ఉన్న అసలు అర్థం తెలియదని అక్కడి నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో పంజాబ్ యూనివర్సిటీ లైబ్రరీలో మూలనపడ్డ సంస్కృత తాళపత్రాలను వెలికితీసి వాటిని చదివే పండితులను తయారు చేయడమే ఈ కోర్సు అసలు లక్ష్యం.