- శాశ్వతంగా విదేశాలకు వెళుతున్న ఇండియన్లు
- గత పదేళ్లలో 20 లక్షల మంది పలాయనం
- అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలకే ప్రాధాన్యం
- అందులో ఐటీ, డాక్టర్లు, వ్యాపారవేత్తలే అధికం
- కఠినమైన పన్నులు… లంచాల బెడదే కారణం
- బ్యూరోక్రసీ బెడద… పోలీసు వ్యవస్థ భయం
- న్యాయ వ్యవస్థలో అంతులేని ఆలస్యం కూడా
- భారతదేశంపై నమ్మకం సడలుతోంది
- ప్రజలను తరిమేస్తున్న మన దేశ పాలన
సహనం వందే, న్యూఢిల్లీ:
భారతదేశంపై ప్రజలకు నమ్మకం సడలుతోంది. దేశంలోని పాలన, వ్యవస్థల పట్ల తీవ్రమైన నిరాశ, అసంతృప్తి పెరిగిపోతుంది. దీంతో అనేకమంది దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. దేశ పౌరసత్వాన్ని వదిలేసి విదేశాల్లో శాశ్వతంగా ఉండిపోతున్నారు. కోటీశ్వరులు మొదలు మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలు కూడా పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. నాణ్యమైన జీవనం కోసం వీరంతా విదేశీ బాట పడుతున్నారు.

పౌరసత్వాన్ని వదిలేసిన 20 లక్షల మంది…
గత ఐదేళ్ల కాలంలోనే ఏకంగా 9 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2011 నుంచి 2024 వరకు పౌరసత్వం వదులుకున్నవారి సంఖ్య 20 లక్షలకు పైగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. వీరంతా విదేశీ పౌరసత్వం తీసుకున్నారు. అంటే ఏటా సగటున లక్షన్నర మంది దేశం నుంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నారు. ఈ వలసల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతూ ఉండటం మరింత ఆందోళనకరం. ఒక్క 2023లోనే 2 లక్షల మంది భారత పౌరసత్వం వదిలేసి విదేశాలకు వెళ్లిపోయారు.
మేధోశక్తి దోపిడీ… ప్రభుత్వానికే పట్టదా?
దేశం నుంచి ఎక్కువ మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలకు వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఈ వలసల్లో ఐటీ నిపుణులు, డాక్టర్లు, ఇంజినీర్లు, వ్యాపారవేత్తలు వంటి మేధో వర్గాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

ఇక్కడ కష్టపడి చదువు పూర్తి చేసిన యువత ఉన్నత విద్య పేరుతో విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడుతున్నారు. అంటే మనం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి శిక్షణ ఇచ్చిన మేధో శక్తిని ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఎలాంటి శ్రమ లేకుండా దోచుకుంటున్నాయి. ఇక్కడ తయారు చేస్తుంటే అక్కడ పని చేస్తున్నారు. దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన యువతరం, నిపుణుల వలసలు ఇలాగే కొనసాగితే వికసిత భారత్ అనే నినాదం ఎవరి కోసం అన్న ప్రశ్న ఉదయిస్తోంది.
కఠిన పన్నులు… లంచాల బెడద
ఉన్నత వర్గం దేశాన్ని వీడిపోవడానికి ప్రధాన కారణం పన్నుల భారమే. ఆదాయం మీద 30 నుంచి 40 శాతం వరకు కఠినమైన పన్నులు కడుతున్నా రోడ్లు మాత్రం కనీసం బాగుపడట్లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం మెరుగుపడట్లేదు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందట్లేదు. దేశంలో కష్టపడి సంపాదించిన డబ్బు పన్నులకో… ప్రభుత్వ వ్యవస్థలోని లంచాలకో పోతుంది. కానీ విదేశాల్లో సంపాదించిన డబ్బు తమ కుటుంబానికే మిగులుతుంది. దీనికితోడు దేశంలో ఏ పని చేయాలన్నా ఎదురయ్యే బ్యూరోక్రసీ బెడద, పోలీసు వ్యవస్థ భయం, న్యాయ వ్యవస్థలో అంతులేని ఆలస్యం – ఇవన్నీ కలిసి యువతను, నిపుణులను బయటకు నెట్టేస్తున్నాయి.
ప్రజలను తరిమేస్తున్న పాలన…
ప్రతి ఏటా విదేశీ పౌరసత్వం తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం దీనిపై నోరు మెదపదు. లక్షలాది మంది ఎందుకు దేశం నుంచి వెళ్లిపోతున్నారో విశ్లేషణ లేదు. ఈ వలసలను ఎలా ఆపాలా అన్న ఆలోచన ఏమాత్రం కనిపించడం లేదు. దేశంలోని పౌరులకు మెరుగైన జీవితం ఇవ్వడంపై దృష్టి పెట్టకుండా… విదేశాల్లో ఉన్న ధనవంతులను ఆకర్షించేందుకు ఓసీఐ కార్డు పథకాలు ప్రకటించడం హాస్యాస్పదం. ఒక రకంగా ప్రతిభావంతులైన వారిని మెరుగైన జీవితం కోసం దేశం నుంచి పరోక్షంగా తరమివేస్తున్నట్లే కదా! ఇది దేశంపై ప్రజలు నమ్మకం కోల్పోవడం తప్ప మరొకటి కాదు. ఈ పరిస్థితిని తక్షణం ఆపకపోతే రాబోయే రోజుల్లో భారత్ అంటే కేవలం ఒక భూభాగం మాత్రమే మిగిలిపోతుంది… భారతీయులు మిగలరు. ఇది జాతికి, దేశానికి తీరని నష్టం.