అసమర్థ మంత్రి… ఇండిగో కంత్రి – విమాన మంత్రిని తొలగించాలన్న డిమాండ్లు

Ram Mohan Naidu Union Minister for Civil Aviation
  • ఇండిగో సంక్షోభంపై దేశవ్యాప్తంగా జనాగ్రహం
  • పెదవి విప్పని మంత్రి రామ్మోహన్ నాయుడు
  • సంక్షోభ సమయంలో పార్టీలు… రీల్సా?
  • పుతిన్ పర్యటన వేళ గంగలో కలిసిన పరువు
  • దిక్కులు చూసిన విమానయాన యంత్రాంగం
  • ఇండిగో యాజమాన్యంపై తక్షణ చర్యలేవీ?
  • లక్షల మంది ఇబ్బందులు… అరెస్టు చేయరా?

సహనం వందే, న్యూఢిల్లీ:

ఒక పది మంది రోడ్డుమీదకు వచ్చి చిన్నపాటి నిరసన చేస్తే ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారని వారిని తక్షణమే పోలీసులు అరెస్టు చేస్తారు. అనుమతి లేకుండా 50 మంది ధర్నా చేస్తే శాంతిభద్రతలకు విఘాతం అంటూ పోలీసులు లోన పడేస్తారు. మరి దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రయాణికులను ఇబ్బందుల పాలు చేసి… అనేక పెళ్లిళ్లు రద్దయి పోవడానికి కారకులైన ఇండిగో యాజమాన్యంపై ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలేదు? ఇంత జరిగితే దానికి బాధ్యులైన వ్యక్తిని అరెస్టు చేయకూడదా? ఈ మొత్తం గందరగోళానికి బాధ్యత వహించాల్సిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎందుకు రాజీనామా చేయలేదు? దేశవ్యాప్తంగా ఇండిగో ప్రయాణాల రద్దుతో తీవ్రంగా నష్టపోయిన ప్రయాణికుల ఆవేదన ఇది.

అంతర్జాతీయంగా గంగలో కలిసిన దేశ పరువు
ఇండిగో
సంక్షోభం సృష్టించిన ప్రకంపనలు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను మసకబార్చాయి. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మన దేశంలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ ఘటనలు చోటు చేసుకోవడం కేంద్ర పెద్దలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఐదారు రోజులు గడిచినా విమాన సర్వీసుల కష్టాలు తీరకపోవడంతో లక్షలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు ఘోరంగా విఫలమవడంపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా రంగంలోకి దిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రెండు నెలల ముందే తెలిసినా పట్టదా?
ఇండిగో
సంక్షోభం తీవ్రం కావడానికి ప్రధాన కారణం మంత్రి రామ్మోహన్‌నాయుడు అసమర్థత, నిర్లక్ష్యమేనని కేంద్రంలోని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆల్‌ ఇండియా పైలెట్ల అసోసియేషన్ ఈ సంక్షోభం ముంచుకొస్తోందని రెండు నెలల క్రితమే పౌర విమానయాన శాఖ దృష్టికి తీసుకెళ్లినా మంత్రి కనీసం స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. సమస్య మూలకారణంపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రయాణికులకు రిఫండ్ ఇప్పిస్తామంటూ ప్రచారానికి తెర తీయడంపై ఎన్డీఏలోని కీలక నేతలు సైతం విస్మయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో పీఎంఓలోని ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగి ఇండిగో సీఈఓ, అధికారులతో చర్చలు జరపాల్సి వచ్చింది.

సంక్షోభ సమయంలో పార్టీలు, రీల్సా?
ఇంతటి తీవ్ర సంక్షోభం దేశాన్ని చుట్టుముట్టిన సమయంలోనూ మంత్రి రామ్మోహన్‌నాయుడు వ్యవహరించిన తీరుపై ప్రజలు సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు. ఇండిగో సంక్షోభం తలెత్తిన మూడోరోజు న్యూఢిల్లీలో ఒక స్నేహితుడి పార్టీలో పాల్గొన్న మంత్రి ఫొటోలు బయటకు రావడం మరింత ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. దేశం దిగ్భ్రాంతిలో ఉంటే ప్రజల సమస్యను గాలికొదిలేసి మంత్రి పార్టీలు, నెట్‌ఫ్లిక్స్, రీల్స్‌తో బిజీగా ఉన్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం సమయంలోనూ సంఘటనాస్థలాన్ని రీల్స్‌గా చేసుకుని ప్రచారం చేసుకున్న ఘటనలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.

రాజీనామా చేయాలంటూ డిమాండ్‌
రామ్మోహన్‌నాయుడు
కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అహ్మదాబాద్ విమాన ప్రమాదం మొదలు ఇండిగో సంక్షోభం వరకు ఏదో ఒక ప్రతికూల ఘటన జరుగుతూనే ఉందని ఇది ఆయన అసమర్థతకు నిదర్శనమని విమర్శకులు అంటున్నారు. రాజ్యసభలో ఆయన ఇచ్చిన వివరణపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసి వాకౌట్ చేసింది. మంత్రి ఇండిగో అంతర్గత సమస్యల వల్లే సంక్షోభం ఏర్పడిందని చెప్పినా దానిని ముందుగా పసిగట్టడంలో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో మంత్రి దారుణంగా విఫలమయ్యారని జాతీయ స్థాయిలో మీడియా, సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ల ధరల మోత, సంక్షోభాన్ని అరికట్టలేకపోవడం వంటి కారణాలతో ఆయన తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్‌లు పెరుగుతుండటం గమనార్హం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *