- హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో పలువురు భేటీ
సహనం వందే, హైదరాబాద్:
ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు హైడ్రా కార్యకలాపాలపై అమితాసక్తి చూపించారు. ముఖ్యంగా నగరంలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ గురించి వారు ఆరా తీశారు. అలాగే వర్షాకాలంలో వరదల నివారణకు హైడ్రా తీసుకున్న పటిష్ట చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు, పర్యావరణవేత్తలు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి ఆయన చేస్తున్న కృషి పట్ల అభినందనలు తెలిపారు.
చెరువుల అభివృద్ధిపై పర్యావరణవేత్తల ప్రశంస
పలువురు ప్రముఖ పర్యావరణ వేత్తలు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో హైడ్రా చర్యలు ఎంతో దోహదం చేస్తాయని కొనియాడారు. నగరీకరణ నేపథ్యంలో చెరువులు మురికి కూపాలుగా మారిపోతున్నాయని… వాటిని పునరుద్ధరించి అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా అభివృద్ధి చేయడం చాలా శుభ పరిణామమని ప్రశంసించారు. చెరువులతో పాటు వాటిని అనుసంధానం చేసే కాలువలను పరిరక్షించుకుంటే వరద ముప్పు చాలావరకు తప్పించుకోవచ్చునని… ఆ దిశలో హైడ్రా పని అద్భుతమని మెచ్చుకున్నారు.
వాటర్‌మ్యాన్ ప్రత్యేక సందర్శన
వాటర్‌మ్యాన్‌గా పేరుగాంచిన ప్రముఖ పర్యావరణ వేత్త రాజేంద్ర సింగ్ ప్రత్యేకంగా నగరంలోని చెరువులను సందర్శించడానికి ఆసక్తి కనబర్చారు. ఆయన పాతబస్తీలోని బమృక్‌నుద్దౌలా, అంబర్‌పేటలోని బతుకమ్మకుంట చెరువులను సందర్శించినట్లు తెలిపారు. ఈ చెరువులను ఎంతో బాగా అభివృద్ధి చేశారని, ఆక్రమణలు తొలగించి చెరువును అభివృద్ధి చేసిన తీరు ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. పూర్తిగా కబ్జాలో ఉన్న బతుకమ్మకుంటను సైతం నాలుగు నెలల్లో గొప్పగా అభివృద్ధి చేసి ఆ పరిసరాల రూపురేఖలను మార్చేశారని కమిషనర్ రంగనాథ్‌ను కొనియాడారు. అనేకమంది ప్రతినిధులు కమిషనర్‌తో కలిసి ఈ అంశాలపై చర్చించారు.
సాంకేతికతపై హైడ్రా దృష్టి
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కూడా గ్లోబల్ సమ్మిట్‌లోని పలు స్టాళ్లను పరిశీలించారు. హైడ్రా కార్యకలాపాలకు అవసరమైన సాంకేతికతపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. చెరువుల పరిరక్షణ, నీటి నిర్వహణకు సంబంధించిన అధునాతన పద్ధతులను ఆయన పరిశోధించారు.