తారలు… కొత్త దారులు – తెరపై తళుకులు… బయట వెలుగులు

Cine Stars
  • అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ లోకి ప్రగతి ఎంట్రీ
  • టర్కీ పోటీల్లో 4 గోల్డ్ మెడల్స్ సాధించిన నటి
  • వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా హీరోయిన్ సదా
  • రకుల్ ప్రీత్ సింగ్ కు హైదరాబాదులో జిమ్

సహనం వందే, హైదరాబాద్:

ఒకప్పుడు నటీమణుల పాత్ర కేవలం వెండితెరకే పరిమితం. పెళ్లి కాగానే ఇంటికే పరిమితం కావాల్సి వచ్చేది. అలాగే అవకాశాలు తగ్గగానే కొందరు కనుమరుగైపోయేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి! ఈ తరం తెలుగు నటీమణులు నటనతోపాటు అనేక రంగాల్లో తమదైన ముద్ర వేస్తూ ఆల్ రౌండర్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. సినిమా అవకాశాలు తగ్గినా తమ జీవిత లక్ష్యం అక్కడితో ఆగదని నిరూపిస్తున్నారు. గ్లామర్ ప్రపంచంలో మెరిసిన ఈ తారలు నిజ జీవితంలో ఎలాంటి సాహసాలు చేస్తున్నారో తెలుసుకుందాం.

పవర్ లిఫ్టింగ్‌లో ప్రగతి పంచ్…
సీనియర్ నటి ప్రగతి… ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కేవలం తల్లి పాత్రల్లోనే కాదు… అంతర్జాతీయ క్రీడాకారిణిగానూ రాణిస్తున్నారు. తాజాగా టర్కీలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు సాధించడం మామూలు విషయం కాదు. 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా సినిమా ఆఫర్లు పక్కన పెట్టి మూడేళ్లుగా కఠోర సాధన చేసి ఆమె ఈ విజయాన్ని అందుకున్నారు. దేశంలో రాష్ట్ర స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు పతకాలు గెలిచి వయసు తన లక్ష్యాలకు అడ్డంకి కాదని నిరూపించారు. ఆమె పట్టుదల నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది.

ట్రాక్ మీద నివేదా వేగం
మెంటల్ మదిలో, చిత్రలహరి వంటి సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాజ్ ఇప్పుడు రేసింగ్ ట్రాక్‌పై దూసుకుపోతోంది. ఆమె కార్ రేసింగ్ నేర్చుకుని వేగంతో దూకుడు చూపిస్తోంది. అంతేకాదు తమిళనాడులో జరిగిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో కూడా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. తెరపై అందంగా కనిపించడమే కాదు… గుండె ధైర్యం కూడా ఉందని నివేదా రుజువు చేసుకుంది.

డాక్టర్ టాలెంట్… మీనాక్షి రేంజ్
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె ఒక డెంటల్ డాక్టర్. టీనేజ్‌లోనే రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక ఒకప్పటి టాప్ హీరోయిన్ సదా గురించి చెప్పాలంటే… ఆమె నటనకు విరామం ఇచ్చి పూర్తిస్థాయి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారిపోయింది. ఆమె ప్రస్తుతం అడవుల్లో తిరుగుతూ పులులు, సింహాలు వంటి అడవి జంతువుల ఫోటోలు తీయడంలో నిమగ్నమై ఉంది. ఆమె సాహసం సామాన్యమైనది కాదు.

వ్యాపారంలోనూ విజయం
మరికొందరు తారలు తమ ఇష్టాలను వ్యాపారాలుగా మార్చుకుని ఆర్థికంగానూ విజయాలు సాధిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్స్ సమంత, రష్మిక వంటి నటీమణులు సినిమాలతో పాటు సొంతంగా పర్ఫ్యూమ్ కంపెనీలు స్థాపించారు. రకుల్ ప్రీత్ సింగ్ అయితే హైదరాబాద్‌లో జిమ్‌లు, హోటల్స్ వంటి వ్యాపారాలు నడిపిస్తోంది. నటన ఒక్కటే జీవితం కాదని తమకు నచ్చిన రంగంలోనూ రాణించవచ్చని ఈ నటీమణులు నిరూపిస్తున్నారు. వీరి అసాధారణ విజయాలు యువతకు నిజమైన స్ఫూర్తిని ఇస్తున్నాయి

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *