- రష్యా, ఇరాన్, బ్రెజిల్ వంటి దేశాలపై వేటు
- అంతర్గత మెమోతో అంతర్జాతీయ కలకలం
- జాబితాలో పాకిస్థాన్, థాయ్‌లాండ్ కూడా
- ఈ నెల 21 నుంచి అమలులోకి కఠిన ఆంక్షలు
- వివరాలు వెల్లడించిన ‘రాయిటర్స్’ వార్త సంస్థ
సహనం వందే, న్యూఢిల్లీ:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ ఏకంగా 75 దేశాలకు వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. రష్యా, ఇరాన్ వంటి దేశాలతో పాటు థాయ్‌లాండ్, బ్రెజిల్ వంటి దేశాలను కూడా ఈ జాబితాలో చేర్చడం గమనార్హం. ఇది అగ్రరాజ్యపు వీసా విధానంలో అతిపెద్ద మార్పు.
75 దేశాల జాబితాలో ఉన్నవారు వీరే
అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన అంతర్గత మెమో ప్రకారం రష్యా, ఇరాన్, బ్రెజిల్, నైజీరియా, థాయ్‌లాండ్, ఆఫ్ఘనిస్థాన్, సోమాలియా, ఇరాక్, ఈజిప్ట్, యెమెన్ వంటి 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ నిలిచిపోయింది. వీటితో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ వంటి దేశాల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఈ సారికి భారత్, చైనా పేర్లు ఈ జాబితాలో కనిపించకపోవడం గమనార్హం. అయితే పూర్తి జాబితా బయటకు రాలేదు.

నిలిచిన వీసా ఇంటర్వ్యూలు
ఈ నెల 21 నుంచి ఈ 75 దేశాల ఎంబసీల్లో వీసా ప్రాసెసింగ్ పూర్తిగా నిలిచిపోనుంది. స్క్రీనింగ్, వెట్టింగ్ పద్ధతులను సమీక్షించే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాజిక భద్రతకు ముప్పు కలిగించే వారిని అడ్డుకోవడమే తమ లక్ష్యమని ట్రంప్ సర్కార్ చెబుతోంది. అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకున్న లక్షలాది మంది ప్రయాణికులు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. ఇది ప్రపంచ పర్యాటక రంగంపై కోలుకోలేని దెబ్బ.
భారత్‌కు లేదు ముప్పు.. కానీ ఆందోళన
ట్రంప్ ప్రకటించిన ఈ 75 దేశాల జాబితాలో ప్రస్తుతానికి భారతదేశం పేరు లేదు. దీనివల్ల మన దేశ పౌరులకు అమెరికా వీసాల విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే పక్కనే ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలపై ఆంక్షలు ఉండటంతో భవిష్యత్తులో భారత్‌పై కూడా ఏవైనా కొత్త నిబంధనలు వస్తాయేమోనని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉన్న భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
అమెరికా ఫస్ట్ నినాదం
ట్రంప్ తన అమెరికా ఫస్ట్ నినాదంలో భాగంగానే ఈ ఉక్కుపాదం మోపుతున్నారు. రష్యా, ఇరాన్ వంటి దేశాలతో ఉన్న దౌత్యపరమైన విభేదాలు కూడా ఈ నిర్ణయానికి ఆజ్యం పోశాయి. వలసదారుల వెల్లువను అరికట్టడానికి ఏకంగా 75 దేశాలను దూరం పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ఈ నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ప్రయాణాలు, వాణిజ్యం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.