- నాలుగు నియోజకవర్గాల్లో ప్రాజెక్టుల ప్రారంభం
- భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల్లో పెరిగిన వేగం
- దశాబ్దాల సమస్యలకు ఎంపీ పరిష్కారం
- అభివృద్ధి పథంలో విజయనగరం జిల్లా
సహనం వందే, విజయనగరం:
విజయనగరం జిల్లా అభివృద్ధి బాటలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 18 నెలల కాలంలోనే జిల్లా రూపురేఖలు మారిపోయాయి. పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యుల సమన్వయంతో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కాయి. ఢిల్లీ నుంచి అమరావతి వరకు కలిశెట్టి చేస్తున్న నిరంతర కృషి నేడు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇస్తోంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కనిపిస్తున్న మార్పు ఇదీ.

భోగాపురం విమానాశ్రయం గ్రోత్ ఇంజిన్
నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని భోగాపురం విమానాశ్రయం పనులు ఇప్పుడు యుద్ధ ప్రాతిపాదికన సాగుతున్నాయి. ఎంపీ కలిశెట్టి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలే జరిగిన ట్రయిల్ ఫ్లైట్ ల్యాండింగ్‌తో విమానాశ్రయం తుది దశకు చేరుకుంది. ఇది వేలాది మంది యువతకు ఉపాధి ఇచ్చే గ్రోత్ ఇంజిన్‌లా మారనుంది.
చీపురుపల్లి రైల్వే బ్రిడ్జి కల సాకారం
నాలుగు జిల్లాల ప్రయాణికుల చిరకాల వాంఛ అయిన చీపురుపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కేవలం 18 నెలల్లోనే పూర్తి కావడం విశేషం. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంపీ కలిశెట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 80 శాతం పనులను రికార్డు సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి జాప్యం లేకుండా చూడటంతోనే ఇది సాధ్యమైంది.
మానాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి పనుల్లో కదలిక
గజపతినగరం నియోజకవర్గంలో పదేళ్లుగా కదలిక లేని మానాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి పనుల్లో ఇప్పుడు వేగం పెరిగింది. ఎంపీ కలిశెట్టి అధికారులతో నిరంతరం మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో ఉన్న అడ్డంకులను తొలగించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల మధ్య రవాణా సులభతరం అవుతుంది. రైతులు, పారిశ్రామికవేత్తల ఉత్పత్తుల రవాణాకు మార్గం సుగమం కానుంది.
రణస్థలం జాతీయ రహదారిపై మార్పు
ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం వద్ద జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రతిపాదన పదేళ్లుగా కాగితాలకే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంపీ కలిశెట్టి నేషనల్ హైవే అధికారులతో సంప్రదింపులు జరిపారు. నిర్మాణ పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జి పూర్తయితే రణస్థలం జంక్షన్ వద్ద ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు ప్రమాదాల సంఖ్య కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.
ఎంపీ కలిశెట్టి దార్శనికతకు నిదర్శనం
జిల్లాలో జరుగుతున్న ఈ అభివృద్ధి పనుల వెనుక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దార్శనికత స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం 18 నెలల కాలంలోనే స్థానిక అవసరాలను గుర్తించి వాటిని ఢిల్లీ, అమరావతి స్థాయికి తీసుకెళ్లారు. సమస్యలకు పరిష్కారం చూపడమే కాకుండా పనులు నాణ్యంగా, సకాలంలో పూర్తి కావడానికి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు ఇన్నాళ్లకు మోక్షం పొందడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.