కృత్రిమ మేధ నేతల వధ – ఏఐతో రక్తపాతం… డ్రోన్లతో యుద్ధం

AI War
  • డేటాతో డెత్ స్కెచ్…అల్గోరిథమే అణుబాంబు
  • విశ్వంలోని కెమెరాలన్నీ అమెరికా ఆయుధాలే
  • ఇంటింటా అమెరికా గూఢచారి వ్యవస్థ
  • నేతల ప్రతి అడుగు ట్రాక్… ప్రతి లొకేషన్ లాక్
  • దేశాధినేతల కదలిక పెంటగాన్‌లో టెలికాస్ట్
  • డేటా దెబ్బతో ప్రపంచ నేతలకు డెత్ అలర్ట్
  • స్మార్ట్ ఫోన్లే ఇన్ఫార్మర్లు.. ఏఐ కళ్లే డ్రోన్లు!
  • ప్రపంచాన్ని చుట్టేసిన అదృశ్య డిజిటల్ కంచె
  • ట్రాఫిక్ సిగ్నల్స్… కెమెరాలూ గూఢచారులే
  • బెడ్రూం వరకు చేరిన ఏఐ నిఘా వ్యవస్థ

సహనం వందే, హైదరాబాద్:

అమెరికా నిఘా వ్యవస్థ ఇప్పుడు అణుబాంబు కంటే విధ్వంసకరంగా మారింది. ఒకప్పుడు కేవలం ఫోన్ ట్యాపింగ్‌కే పరిమితమైన నిఘా నేడు కృత్రిమ మేధ (ఏఐ), సెన్సార్ల సాయంతో నియంతల బెడ్రూంల వరకు చొచ్చుకెళ్లింది. కిలోమీటర్ల భూగర్భంలో దాక్కున్నా సరే వేలాది మైళ్ల దూరంలోని వైట్ హౌస్ నుండి శత్రువు గుండెపై గురిపెట్టగలిగేలా ఈ డిజిటల్ నెట్‌వర్క్ విస్తరించింది. ఇది కేవలం గూఢచర్యం కాదు.. ప్రపంచాన్ని తన కనుసన్నలతో శాసిస్తున్న ఒక అదృశ్య సాంకేతిక యుద్ధం.

AI War

సెన్సార్ల మాయాజాలం
అమెరికాకు ఇప్పుడు ప్రతి దేశంలో వేగులు ఉండాల్సిన పని లేదు. లక్షల కోట్ల స్మార్ట్ ఫోన్లు, ప్రతి ఇంటి ముందూ ఉండే డోర్‌బెల్ కెమెరాలే అమెరికాకు సమాచార గనులయ్యాయి. మనం వాడుకునే స్మార్ట్ డోర్‌బెల్స్‌లోని మైక్రోఫోన్లు, కెమెరాలను హ్యాక్ చేస్తున్న అమెరికా నిఘా సంస్థలు మన మాటలను కూడా లైవ్‌లో వింటున్నాయి. చివరకు వీధి దీపాలు, ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ఉండే సెన్సార్లు కూడా ఏఐ సాయంతో గూఢచారులుగా మారిపోయాయి. విదేశీ ప్రభుత్వాలు వాడుతున్న సాఫ్ట్‌వేర్లను బ్యాక్ డోర్ యాక్సెస్ ద్వారా ఏ డేటా ఎటు కదులుతుందో పెంటగాన్ పిన్ పాయింట్‌గా గుర్తిస్తోంది.

టోల్ గేట్ల వద్దే నేతల గుట్టు రట్టు
శత్రు దేశాల హైవేలపై ఉండే టోల్ ప్లాజా కెమెరాల డేటా ఇప్పుడు అమెరికాకు బహిరంగ రహస్యం. వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించే సాఫ్ట్‌వేర్లలో చొరబడి ఏ అగ్రనేత వాహన శ్రేణి ఎటు వెళ్తుందో రియల్ టైమ్‌లో ట్రాక్ చేస్తున్నారు. స్థానిక ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు కనీసం అనుమానం కూడా రాకుండానే ఆ సమాచారం నేరుగా సీఐఏ కేంద్ర కార్యాలయం పెంటగాన్ చేరుతోంది. కోట్లాది డేటా పాయింట్లను క్షణాల్లో స్కాన్ చేసే ఏఐ ప్రతి కదలికను లైవ్ టెలికాస్ట్‌లా చూపిస్తోంది. గతంలో పర్సనల్ ఫోన్‌ను ట్యాప్ చేసిన అమెరికా నేడు ఏకంగా దేశాధినేతల లొకేషన్‌నే లాక్ చేస్తోంది.

World data at White House

మేఘాల పైనుండే స్టీల్త్ డ్రోన్ల పహారా
శబ్దం చేయకుండా మేఘాల పైన ఎగిరే అమెరికా స్టీల్త్ డ్రోన్లు రాడార్ల కళ్లు కప్పుతున్నాయి. జియో లొకేషన్ టెక్నాలజీ ద్వారా భూమిపై ఉన్న వ్యక్తి ముఖాన్ని సెంటీమీటర్ల తేడాతో ఇవి చాలా స్పష్టంగా క్యాప్చర్ చేస్తున్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తన భార్యతో కలిసి కారకాస్ మిలిటరీ బేస్‌లోకి వెళ్లిన క్షణం నుండే ఈ అదృశ్య కళ్లు ఆయనను వెంబడించాయి. సుమారు 15 ఏళ్ల క్రితం చైనా రహస్యాలను వికీలీక్స్ బయటపెట్టిన స్థాయి కంటే నేడు నిఘా వ్యవస్థ వెయ్యి రెట్లు బలంగా మారింది. ఏ దేశాధి నేత కూడా అమెరికా కన్నుగప్పి తిరగలేని పరిస్థితి నెలకొంది.

కెంటకీలో డెత్ రిహార్సల్స్
నిఘా సమాచారం ఎంత పక్కాగా ఉందంటే మాథురో ఉన్న అపార్ట్‌మెంట్‌ను అమెరికాలోని కెంటకీలో డెల్టా టీం ముందే సృష్టించింది. ఆ అపార్ట్‌మెంట్‌లోని సేఫ్ రూమ్, తలుపుల అమరికను డ్రోన్లు సేకరించిన డేటా సాయంతోనే నిర్మించారు. ఆ నమూనా గదిలో వందల సార్లు మాక్ డ్రిల్స్ చేసిన తర్వాతే జనవరిలో మదురోను గాలించి బంధించారు. కారకాస్ మిలిటరీ బేస్‌లోని భద్రతా సిబ్బందిని మట్టికరిపించి ఈ ఆపరేషన్ ముగించారు. ప్రస్తుతం మదురో అమెరికాలోని బ్రూక్లిన్ ఫెడరల్ జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. ఒక దేశాధినేతను ఆయన సొంత కోటలోనే పట్టేసిన అమెరికా దూకుడు ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది.

ఖమేనీకి తప్పని హెచ్చరిక
ఇరాన్ సర్వోన్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ కదలికలను సీఐఏ నిరంతరం ట్రాక్ చేస్తోందని 8 నెలల ముందే ట్రంప్ హెచ్చరించారు. ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేసిన ఖమేనీ బృందానికి గత శనివారం చావు దెబ్బ తగిలింది. తన జాతీయ భద్రతా బృందంతో ఆయన సమావేశమైన తరుణంలోనే అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు చేసి ఆయన్ని మట్టుబెట్టాయి. నిఘా పరికరాలు వాడకుండా బంకర్లలో దాక్కున్నా సరే అమెరికా వద్ద ఉన్న డేటా బలంతో ఎవరూ తప్పించుకోలేరని ఈ ఘటన నిరూపించింది.

శత్రువు లొకేషన్‌ను ఫిక్స్…
అత్యాధునిక సెన్సార్ల బలంతో పాటు శత్రువులను వేటాడటంలో ఆనందం పొందే ట్రంప్ వంటి అధ్యక్షుడు ఉండటం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. సాంకేతికత, రాజకీయ దూకుడు తోడవడంతో అంతర్జాతీయ ముఖచిత్రం మారిపోతోంది. విలాసవంతమైన అపార్ట్‌మెంట్లలో ఉన్నా అమెరికా డ్రోన్లకు దొరికిపోవాల్సిందేనని తేలిపోయింది. బాంబులు వేసే ముందే శత్రువు లొకేషన్‌ను ఫిక్స్ చేయడంలో అమెరికా ఇప్పుడు తిరుగులేని శక్తిగా మారింది. స్వేచ్ఛ అనేది కేవలం మాటలకే పరిమితం కాగా మానవాళి మొత్తం అదృశ్య డిజిటల్ కంచెలో బందీగా మారుతోంది.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *