- గత ఉప కులపతుల పాత్రపై అనుమానాలు
- సుదీర్ఘంగా పనిచేసిన ప్రావీణ్యుడి దారుణాలు
- ఆయన హయాంలోనే భ్రష్టు పట్టిన వర్సిటీ
- ఆ తర్వాత కొన్నాళ్లు పనిచేసిన ఉన్నతాధికారి
- ఒక్కో పేపరు ధర 50 వేలు.. జగిత్యాల కేంద్రం
- ఇన్‌సర్వీస్ కోటాను రద్దుకు ఏఈఓల గర్జన
సహనం వందే, హైదరాబాద్:
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో అక్రమాల పుట్ట పగిలింది. అన్నదాతకు సాయం చేయాల్సిన ఏఈఓలే ఇప్పుడు కాపీ కొట్టి దొరికిపోయారు. తమ ప్రమోషన్ల కోసం ఏకంగా పేపర్లనే కొనుగోలు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ప్రభుత్వ సొమ్ముతో చదువుకుంటూ అక్కడే సిబ్బందికి ఆశ చూపి పేపర్లను బయటకు తెచ్చారు. గత ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఈ దందా ఇప్పుడు బట్టబయలైంది. ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు వివరాలు చూస్తే సామాన్యుడు విస్తుపోవాల్సిందే.

భ్రస్టు పట్టించిన ‘ప్రవీణ్యు’డు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఉపకులపతులు కొందరు సర్వనాశనం చేసి కూర్చున్నారన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణ వచ్చాక సుదీర్ఘకాలం పనిచేసిన ఒక ‘ప్రవీణ్య’మైన వ్యక్తిగా చెప్పుకునే అధికారి తన చెప్పుచేతుల్లో యూనివర్సిటీని ఉంచుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికార అండ చూసుకొని సామాజిక వర్గ డప్పు కొట్టుకొని నియంతృత్వానికి బీజం వేశారు. అక్రమాలు జరుగుతున్నప్పటికీ ఆయన చూసి చూడనట్లు వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. ఆయన పోయిన తర్వాత కూడా యూనివర్సిటీని గాడిలో పెట్టడంలో తదుపరి అధికారులు ఘోరంగా విఫలం అయ్యారన్న విమర్శలు ఉన్నాయి.
50 వేలు ఇస్తే చాలు… పేపరు చేతిలో..
జగిత్యాల వ్యవసాయ కళాశాలలో జరిగిన విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. ఇన్ సర్వీస్ కోటాలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న ఏఈఓలు కాలేజీ సిబ్బందితో రహస్య ఒప్పందాలు చేసుకున్నారు. ఒక్కో సబ్జెక్టు పేపరు కోసం 50,000 రూపాయల చొప్పున బేరం కుదుర్చుకున్నారు. ఇలా డబ్బులు ఇచ్చి పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు పొందుతూ ఈజీగా పాస్ అయిపోతున్నారు. రాష్ట్రంలోని ఇతర కాలేజీల్లోనూ ఇదే తంతు కొనసాగుతున్నట్లు వర్సిటీ విచారణలో తేలింది. అందుకే 34 మంది ఏఈఓల సీట్లను వీసీ జానయ్య రద్దు చేశారు.


150 కోట్ల ఖర్చు… లోతైన దర్యాప్తు
గత ఎనిమిదేళ్ల నుంచి ఈ ఇన్ సర్వీస్ కోటా ప్రక్రియ సాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 150 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇంత భారీ మొత్తంలో నిధులు వృధా అవుతున్నా, అక్రమాలు జరుగుతున్నా యూనివర్సిటీ యంత్రాంగం నిద్రపోతోందా అని గ్రాడ్యుయేట్ ఏఈఓల సంఘం ప్రశ్నిస్తోంది. కేవలం ఏఓ ప్రమోషన్ల కోసం ఇంత భారీ నెట్‌వర్క్ పనిచేయడం వెనుక పెద్దల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపితే మరిన్ని షాకింగ్ నిజాలు బయటపడే అవకాశం ఉందని తెలంగాణ గ్రాడ్యుయేట్ ఏఈఓల సంఘం అధ్యక్షులు యాదగిరి గౌడ్ ఆరోపించారు.
ప్రమోషన్ల కోసం అడ్డదారులు…
ప్రభుత్వం కేవలం ఏఓ పోస్టులకు అర్హత కల్పించేందుకే వీరికి ఈ చదువు అవకాశం ఇస్తోంది. కానీ కొందరు ఏఈఓలు కష్టపడకుండా అక్రమ మార్గాల్లో డిగ్రీలు పొందుతున్నారు. దీనివల్ల నిజాయితీగా చదువుకున్న వారికి అన్యాయం జరుగుతోంది. లీకేజీలో పట్టుబడ్డ వారు గతంలో కూడా ఇలాగే చేశారా అనే కోణంలో దర్యాప్తు జరగాలి. ఇన్ సర్వీస్ విధానం వల్ల శాఖకు ఏమాత్రం ఉపయోగం లేదని, దీనివల్ల కేవలం కొందరికి అక్రమ ప్రమోషన్లు మాత్రమే లభిస్తున్నాయని సంఘం నేతలు మండిపడుతున్నారు.
ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలి
ఈ స్కామ్‌లో దొరికిన వారిని కేవలం కాలేజీ నుంచి పంపితే సరిపోదని యాదగిరి గౌడ్ స్పష్టం చేశారు. వారిని తక్షణమే సర్వీసు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అడ్వైజర్ సుమన్, గౌరవ అధ్యక్షులు నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. గతంలో ఈ కోటాలో చదువుకున్న వారిపై కూడా ఎంక్వైరీ వేయాలన్నారు. వారి ప్రమోషన్లను వెనక్కి తీసుకోవాలని, తద్వారా సిస్టమ్‌లో పారదర్శకత వస్తుందని సూచించారు.
ఇకనైనా కళ్లు తెరవాలి
విద్యా వ్యవస్థలో ఇలాంటి లీకేజీలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయం లాంటి కీలక శాఖలో ఇలాంటి అవినీతి జరగడం దురదృష్టకరం. ఇన్ సర్వీస్ కోటాను పూర్తిగా రద్దు చేసి సమర్థులైన వారికి మాత్రమే అవకాశాలు కల్పించాలని కార్యదర్శి సంధ్య కోరారు. ప్రజాధనాన్ని ఇలా అక్రమార్కుల కోసం వాడటం ఆపాలని, విచారణను వేగవంతం చేసి సూత్రధారులను కఠినంగా శిక్షించాలని గ్రాడ్యుయేట్ ఏఈఓలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.