అంకెల లోకం… జీవితం అల్లకల్లోలం – గ్రేడుల గోలలో మరుగున పడుతున్న ప్రతిభ

Like Numbers life
  • లైకులు, వ్యూస్ కోసం పాకులాడుతున్నాం
  • అంకెలే అన్నీ అనుకుంటే ఆనందం ఆవిరి

సహనం వందే, హైదరాబాద్:

మనం ఆడే ఆటలో స్కోరు పెరిగితే వచ్చే కిక్కే వేరు. ఆ అంకెలు మనల్ని ఉత్సాహపరుస్తాయి. కానీ అదే అంకెలు మన నిజ జీవితాన్ని శాసిస్తే? లైకులు రాలేదని బాధపడటం… మార్కులు తగ్గితే కుంగిపోవడం… ఇదంతా ఒక అదృశ్య జైలు. తత్వవేత్త సి థిన్గుయెన్ చెబుతున్న ఈ అంకెల మాయాజాలం గురించి చదివితే మీరు ఆశ్చర్యపోతారు.

ఆటల్లో స్కోరు బోర్డు ఇస్తుంది గెలుపు కిక్కు…
మీరు డన్జియన్స్ అండ్ డ్రాగన్స్ లాంటి ఆటలు ఆడుతున్నప్పుడు.. మీ చేతిలో ఒక స్కోరు బోర్డు ఉంటుంది. ఒక రాక్షసుడిని చంపితే 10 పాయింట్లు. ఆ పాయింట్ రాగానే మీలో తెలియని ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ఆ ఆటలో మీ లక్ష్యం ఏంటో ఆ అంకె స్పష్టంగా చెబుతోంది. అక్కడ అంకెలు మనల్ని ఉర్రూతలూగిస్తాయి. ఆ నిమిషానికి అవే మన ప్రపంచం. కానీ ఆట ముగిశాక ఆ అంకెలను అక్కడే వదిలేయాలి. కానీ మనం ఆ అంకెలను ఇంటికి తెచ్చుకుంటున్నాం.

Social Major Role in Number of Likes

జీవితాన్ని మింగేస్తున్న గ్రేడుల గోల…
స్కూలు పిల్లల దగ్గరి నుంచి ఆఫీసులో పని చేసే వాళ్ల వరకు అందరం అంకెల బందీలమే. ఒక విద్యార్థికి 99 మార్కులు వస్తే వాడు తెలివైన వాడు…. 40 వస్తే దద్దమ్మ అని ముద్ర వేస్తున్నాం. ఆ 40 మార్కుల వెనుక ఉన్న వాడి సృజనాత్మకతను ఎవరూ చూడటం లేదు. ఆఫీసులో కూడా అంతే. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎన్ని లైన్ల కోడ్ రాశాడనే సంఖ్య చూస్తున్నారే తప్ప.. అందులో ఉన్న నాణ్యతను పట్టించుకోవడం లేదు. ఈ రేటింగుల గోలలో మనిషి ఒక యంత్రంలా మారిపోతున్నాడు.

లైకుల వేటలో నలిగిపోతున్న నైపుణ్యం
ఈ రోజుల్లో మన విలువను ఇన్‌స్టాగ్రామ్ లైకులు, యూట్యూబ్ వ్యూస్ నిర్ణయిస్తున్నాయి. ఒక గొప్ప కళాకారుడు వేసిన పెయింటింగ్‌కు 10 లైకులు వచ్చి.. ఒక పిచ్చి డాన్స్‌కు లక్ష వ్యూస్ వస్తే.. ఆ లక్ష ఉన్నవాడే గొప్ప అనుకుంటున్నాం. ఇలా అంకెలు మన అభిరుచులను చంపేస్తున్నాయి. వ్యూస్ కోసం పాకులాడుతూ అసలైన నైపుణ్యాన్ని గాలికి వదిలేస్తున్నాం. మన సంతోషం మన చేతుల్లో లేదు.. ఎదుటివాడు నొక్కే లైకు అనే అంకెలో ఉండిపోయింది.

వైన్ రుచిని శాసిస్తున్న పాయింట్లు
న్గుయెన్ ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. వైన్ తాగేటప్పుడు దాని రుచిని ఆస్వాదించాలి. కానీ ఇప్పుడు జనం వైన్ బాటిల్ మీద ఉన్న రేటింగ్ చూస్తున్నారు. ఒక బాటిల్‌కు 95 పాయింట్లు ఉంటే అది అమృతం అని నమ్ముతున్నారు. 70 పాయింట్లు ఉంటే అది బాలేదని ఫిక్స్ అయిపోతున్నారు. అంటే మీ నాలుకకు తగిలే రుచి కంటే కంటికి కనిపించే అంకే మీకు ముఖ్యం అయిపోయింది. మీ సొంత అభిప్రాయాన్ని కూడా అంకెలే నిర్ణయిస్తున్నాయి.

ఆర్థిక లెక్కల మాయలో సామాన్యుడు
ప్రతి రోజూ టీవీల్లో స్టాక్ మార్కెట్ పాయింట్లు కనిపిస్తాయి. అవి పెరిగితే దేశం బాగుందని, పడిపోతే అంతా మునిగిపోయిందని జనం భయపడతారు. 80 వేల పాయింట్ల సెన్సెక్స్ మీకు అన్నం పెడుతుందా అంటే గ్యారంటీ లేదు. కానీ ఆ అంకె పెరిగితే ఒక రకమైన ఊహాజనిత ఆనందం. ఈ అంకెల మాయలో పడి అసలైన ఆర్థిక సూత్రాలను మనం మర్చిపోతున్నాం. సంఖ్యలు పెరగడం ముఖ్యం కాదు.. సామాన్యుడి జేబులో డబ్బు ఉండటం ముఖ్యం.

అంకెల జైలు నుంచి బయటపడదాం
సంఖ్యలు మనల్ని పనిముట్లుగా వాడుకుంటున్నాయి. మనం చేసే పనిలో సంతృప్తి ఉందా లేదా అనేది కాకుండా.. రేటింగ్ ఎంత వచ్చింది అనేదే కొలమానం అవుతోంది. న్గుయెన్ చెప్పేది ఒక్కటే.. అంకెలను ఆటల్లోనే ఉంచండి. జీవితంలోకి రానీయకండి. ప్రేమను, స్నేహాన్ని, సంతోషాన్ని ఏ అంకెతోనూ కొలవలేం. అంకెలకు అతీతంగా ఆలోచించినప్పుడే మనిషికి అసలైన స్వేచ్ఛ దొరుకుతుంది. లేకపోతే ఈ అంకెల ప్రపంచంలో మనం ఒక ఖైదీలాగే మిగిలిపోతాం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *