తమ్మినేని ‘ఘోర’భద్రం – సీపీఎం కేంద్ర కమిటీ అభిశంసన

Tammineni
  • తప్పుడు రాజకీయ విధానాలతో వేటు
  • రాష్ట్ర కార్యదర్శి ఎంపికలో లాబీయింగ్ గుట్టు

సహనం వందే, హైదరాబాద్:

సిపీఎం కోటలో ముఠాతత్వం ముదిరి పాకాన పడింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఎర్ర జెండా నీడన లాబీయింగ్‌లు రాజ్యమేలాయి. రాష్ట్ర మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై కేంద్ర కమిటీ వేసిన వేటు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. సిద్ధాంతాల ముసుగులో జరిగిన తెరవెనుక మంత్రాంగం బట్టబయలైంది. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఆకాంక్షలే మిన్నగా వ్యవహరించారన్న ఆరోపణలు ఇప్పుడు నిజమయ్యాయి.

Tammineni Veerabhadram

తమ్మినేనిపై క్రమశిక్షణ వేటు
సీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని పార్టీ కేంద్ర కమిటీ అభిశంసించింది. ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలో తప్పుడు రాజకీయ దృక్పథాలను అనుసరించారని ఆక్షేపించింది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించడంపై కేంద్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ సంస్కృతిని గాలికి వదిలేశారని లేఖలో పేర్కొంది. ఇది పార్టీ గౌరవానికి తీరని నష్టం కలిగించిందని భావిస్తోంది. సీనియర్ నాయకులే ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడటం మునుపెన్నడూ జరగలేదని గుర్తు చేసింది.

రాష్ట్ర కార్యదర్శి ఎంపికలో లాబీయింగ్ గుట్టు
2024 లో జరిగిన రాష్ట్ర పార్టీ నూతన కార్యదర్శి ఎన్నిక ప్రక్రియలో అరాచకం జరిగింది. ప్రజాస్వామ్య చర్చలు, ఏకాభిప్రాయ సాధన స్థానంలో లాబీయింగ్ రాజ్యమేలింది. ప్రలోభాలు, అస్తిత్వవాద అపీళ్లు చోటు చేసుకున్నాయని కేంద్ర కమిటీ విమర్శించింది. పార్టీ ప్రమాణాలను తుంగలో తొక్కారని మండిపడింది. ఆ ఎన్నికల సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ నిట్టనిలువున చీలిపోయింది. ఇది పార్టీ పునాదులను కదిలించేలా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది.

ముఠాతత్వం ఆందోళనకరం
పార్టీలో ముఠాతత్వం ఆందోళనకర స్థాయికి చేరిందని కేంద్ర కమిటీ విశ్లేషించింది. పొలిట్ బ్యూరో సభ్యులు ఐక్యత కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. తమ్మినేనితో సహా పార్టీ నాయకత్వంలోని ఒక వర్గం వెనక్కి తగ్గేందుకు అంగీకరించలేదు. రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చాలా మంది సభ్యులు ఈ తెరవెనుక మంత్రాంగంపై ఆరోపణలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ సమిష్టి ప్రయోజనాలను పక్కన పెట్టారని తేల్చింది. ఈ అనారోగ్యకర వాతావరణం పార్టీని బలహీనపరిచింది.

వివరణపై తీవ్ర అసంతృప్తి
తమ్మినేని వీరభద్రం, స్కైలాబ్ బాబు, ప్రసాద్ ఇచ్చిన వివరణలను కేంద్ర కమిటీ పరిశీలించింది. వాటిలో ఆత్మ విమర్శ లోపించిందని, వివరణలు అసమగ్రంగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. అందుకే ముగ్గురిని అభిశంసిస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తమ్మినేని ఇకపై రాష్ట్ర సెక్రటేరియట్ కమిటీ సమావేశాల్లో కేవలం పరిశీలకుడిగా మాత్రమే ఉండాలి. రాష్ట్ర సెక్రటేరియట్ మార్గదర్శకత్వంలోనే ఆయన నడుచుకోవాలని ఆదేశించింది. ఇది ఆయన రాజకీయ ప్రభావాన్ని తగ్గించే చర్యగా కనిపిస్తోంది.

నియమ నిబంధనల విరుద్ధం
తెలంగాణ రాష్ట్ర కమిటీకి కేంద్ర కమిటీ 4 పేజీల సుదీర్ఘ లేఖ రాసింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇటీవల జరిగిన కీలక భేటీలో దీనిపై చర్చించారు. ఈ లేఖను శాఖా కార్యదర్శుల వరకు పంపాలని నిర్ణయించారు. రాష్ట్ర కార్యదర్శి తన బాధ్యతలను స్వతంత్రంగా, సమర్థంగా నిర్వర్తించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితి దృష్ట్యా తీవ్రమైన దిద్దుబాటు చర్యలు చేపట్టాలని నాయకత్వం నిర్ణయించింది. అంతా పొలిట్ బ్యూరో మార్గదర్శకత్వంలోనే జరగాలని లేఖలో తేల్చి చెప్పింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *