మందుతో ‘మాయరోగం’ – రోగులను రేపిస్టులుగా మార్చే మెడిసిన్

Ropinirole Stimulates the dopamine
  • నేరగాళ్లుగా, జూదగాళ్లుగా మార్చే మందు
  • తెలియకుండానే క్రిమినల్స్ అవుతున్న వైనం
  • మెదడుపై ఫార్మా కంపెనీల కెమికల్ టెర్రరిజం
  • 30 లక్షల బతుకు ఛిద్రం… ఫార్మాల రక్తచరిత్ర

సహనం వందే, హైదరాబాద్:

ఆధునిక వైద్యం పేరిట బహుళజాతి ఫార్మా సంస్థలు సాగిస్తున్న రసాయన మారణకాండ బట్టబయలైంది. పార్కిన్సన్, కాళ్లలో అసౌకర్యం తగ్గించేందుకు ఇచ్చే మందులు రోగులను నేరగాళ్లుగా, జూదగాళ్లుగా మారుస్తున్నాయి. బ్రిటన్ నుంచి భారత్ వరకు విస్తరించిన ఈ వ్యసనాల ఉప్పెన వేలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. రోపినిరోల్ వంటి డోపమైన్ అగోనిస్ట్ మందుల వాడకం వల్ల రోగుల ప్రమేయం లేకుండానే వారి మెదడు నియంత్రణ తప్పుతోంది. ఫలితంగా సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్నవారు సైతం వికృత చేష్టలకు బానిసలవుతున్నారు.

Dopamine Therapy

మెదడుపై కెమికల్ టెర్రరిజం
పార్కిన్సన్, కాళ్లలో అసౌకర్యం తగ్గించేందుకు వాడే ఈ మందులు నేరుగా మెదడులోని రివార్డ్ సర్క్యూట్‌ను ధ్వంసం చేస్తున్నాయి. డోపమైన్ స్థాయిని కృత్రిమంగా పెంచడం వల్ల రోగులలో ప్రేరణా శక్తి నశించి వికృత చేష్టలకు దారి తీస్తోంది. రోగుల ప్రమేయం లేకుండానే వారిని జూదానికి, కామానికి బానిసలుగా మారుస్తోంది. సుమారు 16 శాతం మంది రోగులు ఈ మందుల విషవలయంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు.

మెదడుపై ప్రభావం…
ఈ మందులు మెదడులోని డోపమైన్ గ్రాహకాలను ప్రేరేపిస్తాయి. డోపమైన్ అనేది మనకు సంతోషం లేదా రివార్డ్ ఇచ్చే హార్మోన్. ఇది విపరీతంగా పెరగడం వల్ల మనిషిలో ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్ వస్తుంది. అంటే ఒక పని చేస్తే కలిగే లాభనష్టాల గురించి ఆలోచించే విచక్షణ కోల్పోయి తక్షణ తృప్తి కోసం జూదం, వికృత శృంగారం లేదా విపరీతమైన షాపింగ్ వంటి వాటికి బాధితులు బానిసలవుతారు. ఈ మందు వల్ల కలిగే ప్రవర్తనా మార్పులను వయసు మళ్ళిన వారిలో వచ్చే మానసిక సమస్యలుగా భ్రమపడుతుంటారు. చాలా మంది వైద్యులు ఈ మందు రాసేటప్పుడు రోగుల కుటుంబ సభ్యులకు హెచ్చరించడం లేదు.

బాధితుల ఆక్రందనలు
సైరస్ అనే మహిళ తన జీవితం నాశనమైందని కన్నీరు మున్నీరవుతోంది. సాధారణ గృహిణి అయిన ఆమె ఈ మందు వాడటం వల్ల జూదానికి బానిసగా మారి 30 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఆండ్రూ అనే న్యాయవాది తన క్లయింట్ల నుండి 60 కోట్లకు పైగా సొమ్మును దోచుకున్నాడు. శృంగార వ్యసనంతో ఆ డబ్బును తగలేసి చివరకు కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక మందు మనిషిని ఇంతటి పాతాళానికి నెట్టగలదా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోంది.

వికృత శృంగార వ్యసనం
మైఖేల్ అనే బాధితుడు ఈ మందుల వల్ల తన జీవితం అగాధంలో పడిందని వాపోతున్నాడు. ఎన్నడూ లేని విధంగా 20 మందితో సంబంధాలు పెట్టుకున్నాడు. స్వలింగ సంపర్కం వైపు మళ్ళాడు. వివాహ బంధాలు తెగిపోతున్నా మందుల మత్తులో బాధితులు ఏమీ చేయలేకపోతున్నారు. బెల్జియం కోర్టులో ఒక వ్యక్తి తన మనవరాలిపైనే దాడి చేసిన కేసులో మందుల ప్రభావం వల్లే ఇది జరిగిందని తేలడం ఈ విపత్తు తీవ్రతకు అద్దం పడుతోంది.

ఫార్మా సంస్థల నేరపూరిత మౌనం
బ్రిటిష్ ఫార్మా దిగ్గజం జీఎస్‌కేకు ఈ మందుల వికృత రూపం 26 ఏళ్ల క్రితమే తెలుసు. 2000 సంవత్సరంలోనే ఒక రోగి ఏడేళ్ల పసిపాపపై లైంగిక దాడి చేశాడని తెలిసినా ఆ సంస్థ మౌనం వహించింది. దీనిని కేవలం లైంగిక వాంఛగా అభివర్ణించి తప్పించుకుంది. వికృత ప్రవర్తనకు ఈ మందులే కారణమని తెలిసినా హెచ్చరికలు జారీ చేయడానికి మరో ఏడేళ్లు తీసుకుంది.

భారత్‌లోనూ మందుల ముప్పు
బ్రిటన్‌లో అలజడి సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక మందులు భారత్‌లో కూడా విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయి. సన్ ఫార్మా, గ్లెన్‌మార్క్, టొరెంట్, జైడస్ కాడిలా వంటి దేశీయ దిగ్గజాలు రోపినిరోల్‌ను రోపార్క్, రోపిటార్, రోపిన్‌ప్రైమ్ వంటి వివిధ పేర్లతో ఉత్పత్తి చేస్తున్నాయి. భారత మందుల నియంత్రణ సంస్థ ఈ మందులకు ఎప్పుడో అనుమతులు ఇచ్చింది. సుమారు 25కు పైగా కంపెనీలు ఈ మందులను భారత విపణిలో విక్రయిస్తున్నాయి.

నియంత్రణ సంస్థల వైఫల్యం
ఆరోగ్య శాఖ, నియంత్రణ సంస్థలు ఈ దారుణాన్ని అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. రోగులకు ఇచ్చే మందుల చీటీలపై ఈ దుష్ప్రభావాల గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. వైద్యులు కూడా రోగుల ప్రవర్తనలో మార్పులను గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆన్‌లైన్ ఫారమ్‌లలో బాధితులు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఫలితంగా వందలాది మంది నేరగాళ్లుగా మారి జైలు పాలవుతున్నారు లేదా ప్రాణాలు తీసుకుంటున్నారు.

న్యాయపోరాటం… భవిష్యత్తు
ప్రస్తుతం బాధితులు అంతర్జాతీయ స్థాయిలో న్యాయపోరాటం మొదలుపెట్టారు. ఫ్రాన్స్‌లో ఒక వ్యక్తి జీఎస్‌కేపై 90 లక్షల రూపాయల పరిహారం కోరుతూ దావా వేశాడు. ఈ నెలలో వచ్చే తీర్పు ఫార్మా కంపెనీల భవితవ్యాన్ని తేల్చనుంది. ఈ మందులపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఫ్రాన్స్‌కు చెందిన డిడియర్ జాంబార్ట్ అనే వ్యక్తి ఈ మందు వాడి జూదానికి, వికృత శృంగారానికి బానిసయ్యానని దావా వేశాడు. దీంతో 2012లో కోర్టు అతనికి 1.5 కోట్లకు పైగా రూపాయల పరిహారం చెల్లించాలని జీఎస్‌కేను ఆదేశించింది.

వైద్య నిపుణుల అభిప్రాయం ఏంటంటే…
వైద్యపరంగా చూస్తే ఈ మందులు పార్కిన్సన్ రోగులకు ప్రాణవాయువు వంటివి. సమస్య మందుతో కాదు… దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి అని అంటున్నారు.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *