ప్రపంచానికి మరో హిట్లర్ – దేశదేశాన అమెరికా జెండా లక్ష్యం

Trump warnings
  • ఇదే అగ్ర రాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ ఎజెండా
  • వెనిజులా తర్వాత అనేక దేశాలకు వార్నింగ్
  • భారత్ క్యూబా మెక్సికో గ్రీన్ ల్యాండ్ లపై కన్ను
  • రష్యా నూనె కొనడంపై ఇండియాకు హెచ్చరిక
  • అటువంటి దేశాలపై 25 శాతం టారిఫ్ విధింపు
  • మెక్సికోలోకి సైన్యాన్ని పంపుతామని వార్నింగ్
  • గ్రీన్‌ల్యాండ్ తమకు కావాల్సిందేనని హుకూం
  • వివిధ దేశాలను వణికిస్తున్న ట్రంప్ నిర్ణయాలు

సహనం వందే, న్యూఢిల్లీ:

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ నాజీ నియంత హిట్లర్ ఎలాగైతే వ్యవహరించాడో… సరిగ్గా అలాగే ట్రంప్ కూడా ప్రపంచంపై ఆధిపత్యం కోసం దూకుడుతో ముందుకు వెళ్తున్నాడు. వెనిజులా అధ్యక్షుడు మదురోను బందీగా తీసుకురావడమే ప్రపంచ దేశాలకు పరోక్షంగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లైంది. వెనిజులా నుంచి ఇండియా వరకు ఆయన హెచ్చరికల పరంపర కొనసాగుతోంది. స్నేహం కంటే వ్యాపారమే ముఖ్యం అన్నట్లుగా ట్రంప్ తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి మిత్ర దేశాల విషయంలో కూడా ఆయన కఠినంగా వ్యవహరిస్తుండటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

ఇండియాకు టారిఫ్ సెగ…
రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మద్దతు ఇచ్చే దేశాల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగా రష్యా ఆయిల్ కొనే దేశాలపై 25 శాతం టారిఫ్ విధిస్తూ కొత్త బిల్లును సిద్ధం చేశారు. భారత రాయబారితో జరిపిన భేటీలో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. భారత్ రష్యా ఇంధన కొనుగోలును తగ్గించినా ఆయన మాత్రం సంతృప్తి చెందడం లేదు. అవసరమైతే ఈ సుంకాలను సున్నా నుంచి 500 శాతం వరకు పెంచే అధికారం తనకే ఉందని హెచ్చరించారు. ఇది భారత ఎగుమతులపై సుమారు 8 లక్షల కోట్ల రూపాయల మేర ప్రభావం చూపే అవకాశం ఉంది.

క్యూబాపై టార్గెట్…
వెనిజులా సంక్షోభం ప్రభావం నేరుగా క్యూబాపై పడనుంది. క్యూబా ఆర్థిక వ్యవస్థకు వెనిజులా నుంచి అందే ఆర్థిక సాయమే కీలకం. ఇప్పుడు వెనిజులాలో పరిస్థితి తారుమారు కావడంతో క్యూబాకు ఆదాయం వచ్చే మార్గం లేదు. వెనిజులా నుంచి చమురు, నిధులు అందకపోతే క్యూబా ప్రభుత్వం పేకమేడలా కూలిపోతుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. మదురోను రక్షించే క్రమంలో ఇప్పటికే చాలా మంది క్యూబన్ బాడీగార్డ్స్ ప్రాణాలు కోల్పోయారని ఆయన ఎద్దేవా చేశారు. క్యూబాలో కమ్యూనిస్టు పాలనకు అంతం పలకడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

మెక్సికోపై సైనిక హెచ్చరిక
మెక్సికో ద్వారా అమెరికాలోకి మాదకద్రవ్యాల సరఫరా జరుగుతోందని ట్రంప్ మండిపడ్డారు. మెక్సికో ప్రభుత్వం చేతగానితనం వల్లే అక్కడ డ్రగ్ కార్టెల్స్ బలంగా మారాయని విమర్శించారు. మెక్సికోను ఆ దేశ అధ్యక్షురాలు కాదు.. కార్టెల్స్ నడుపుతున్నాయని ఆరోపించారు. డ్రగ్స్ మాఫియాను అడ్డుకోవడానికి అమెరికా సైన్యాన్ని మెక్సికోలోకి పంపుతామని వార్నింగ్ ఇచ్చారు. అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ దీనికి నిరాకరిస్తున్నా.. ఆమె భయంతో ఉన్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. పొరుగు దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసేలా ఉంది.

గ్రీన్‌ల్యాండ్ స్వాధీనానికి డిమాండ్
అమెరికా భద్రత కోసం గ్రీన్‌ల్యాండ్ తమకు కావాలని ట్రంప్ కొత్త పల్లవి అందుకున్నారు. అక్కడ రష్యా, చైనా ఓడలు తిరుగుతుంటే డెన్మార్క్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని విమర్శించారు. డెన్మార్క్ వద్ద సరైన సైనిక శక్తి లేదని.. వారు కేవలం కుక్కల బండ్లతో గస్తీ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. గ్రీన్‌ల్యాండ్ వ్యూహాత్మకంగా అమెరికాకు ఎంతో ముఖ్యమని.. యూరోపియన్ యూనియన్ కూడా దీనిని అర్థం చేసుకోవాలని కోరారు. రష్యా, చైనాలకు అడ్డుకట్ట వేయాలంటే గ్రీన్‌ల్యాండ్ అమెరికా వశం కావాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు.

ఇరాన్ మీద కన్నెర్ర…
ఇరాన్‌లో జరుగుతున్న ప్రజా నిరసనలపై ట్రంప్ కఠినంగా స్పందించారు. ప్రజలను చంపితే అమెరికా ఊరుకోదని… తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అణు ఒప్పందాలు, ఇతర ఆంక్షలతో ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. ఇప్పుడు నేరుగా సైనిక చర్యకు దిగుతామన్న హెచ్చరికలు పశ్చిమ ఆసియాలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. యూరప్ దేశాలతో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవడానికి కూడా తాను టారిఫ్ లను అస్త్రంగా వాడుతున్నానని గర్వంగా చెప్పుకొచ్చారు. ట్రంప్ మార్కు రాజకీయాలు దునియాను దద్దరిల్లజేస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *