- గజం చొప్పున కమీషన్ రేట్లు ఖరారు
- భూమి మార్పిడి దరఖాస్తుకు వేలల్లో రేటు
- వాట్సాప్ లెక్కలు… టెక్నాలజీతో దోపిడీ
- లంచం ఇస్తేనే ఫైలుకు మోక్షం… లేదంటే కష్టం
- గుజరాత్ మాజీ కలెక్టర్ పై ఈడీ వేటు
- కటకటాల్లో ఊచలు లెక్కబెడుతున్న కలెక్టర్
సహనం వందే, గుజరాత్:
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కంచే చేను మేసిన చందమిది. ఐఏఎస్ అనే అత్యున్నత హోదాను అడ్డుపెట్టుకుని ఆ అధికారి సాగించిన లీలలు వింటే సామాన్యుడికి ఒళ్లు గగుర్పొడుస్తుంది. కలెక్టరేట్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనుకుంటే పొరపాటే. అది పక్కాగా రేట్లు ఖరారు చేసి దోచుకునే వ్యాపార కేంద్రమని రాజేంద్రకుమార్ పటేల్ నిరూపించారు. ఒక్కో పనికి ఒక్కో రేటు కట్టి, అందినకాడికి దండుకున్న ఈ ‘అవినీతి చక్రవర్తి’ బాగోతం ఇప్పుడు బట్టబయలైంది.
ప్రతి పనికి ఒక రేటు…
హోటల్‌లో తినుబండారాలకు రేటు ఉన్నట్లు… ఈ కలెక్టరేట్‌లో ఫైళ్లు కదలడానికి ఒక మెనూ కార్డు ఉండేది. వ్యవసాయ భూమిని వాణిజ్య అవసరాలకు మార్చుకోవాలనే (సీఎల్ యూ) దరఖాస్తు వచ్చిందంటే పటేల్ కళ్లు మెరిసేవి. దరఖాస్తు రకాన్ని బట్టి గజానికి 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ‘స్పీడ్ మనీ’ పేరుతో రేటు ఫిక్స్ చేశారు. డబ్బు ఇస్తేనే పని వేగంగా జరుగుతుందని, లేదంటే ఫైలు అటక ఎక్కుతుందని బాధితులను బెదిరించేవారు. సుమారు 800 దరఖాస్తుల దారులను ఇలాగే పీల్చి పిప్పి చేశారు.
డిజిటల్ దొంగతనం… వాట్సాప్ వాటాలు
పాతకాలం దొంగల్లా కాకుండా ఈ ఐఏఎస్ అధికారి టెక్నాలజీని కూడా అవినీతికే వాడారు. ఎంత వసూలు అయింది, ఎవరెవరు ఇచ్చారు అనే వివరాలను పక్కాగా వాట్సాప్ లో పంపేవారు. ఈ దందాలో కలెక్టరే సింహభాగం అంటే 50 శాతం వాటా తీసుకునేవారు. మిగిలిన 50 శాతంలో మధ్యవర్తులకు, కింది స్థాయి సిబ్బందికి వాటాలు పంచేవారు. ఈ లంచాల లెక్కలన్నీ పీడీఎఫ్ ఫైళ్ల రూపంలో కలెక్టర్ పర్సనల్ అసిస్టెంట్ మొబైల్ నుంచి ఆయనకు వెళ్లేవి. డిజిటల్ ఇండియాను ఈయన ఇలా ‘డిజిటల్ దోపిడీ’కి వాడుకోవడం విచారణ అధికారులనే ఆశ్చర్యపరిచింది.
కోట్ల రూపాయల అక్రమ సామ్రాజ్యం
కేవలం భూమి మార్పిడి అనుమతుల ద్వారానే ఈ అధికారి 1500 కోట్ల రూపాయలకు పైగా వెనకేశారు. ఒక సామాన్య దరఖాస్తుదారుడి వద్దే 65 లక్షల రూపాయలు గుంజారంటే ఈ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సంపాదించిన పాపపు సొమ్మును దాచుకోవడానికి అహ్మదాబాద్ లో తన పేరు మీద ఫ్లాట్ కొన్నారు. ఆ ఫ్లాట్ అద్దెను తన తల్లి బ్యాంకు ఖాతాలోకి మళ్లించి… అది నీతిగా సంపాదించిన సొమ్ము అని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఈడీ అధికారులు తీగ లాగితే డొంకంతా కదిలి పాపం పండింది.
అధికారులంతా ఒక్కటే.. గొలుసుకట్టు దోపిడీ
ఈ అవినీతిలో కలెక్టర్ ఒక్కడే కాదు.. ఆయన కింది స్థాయి సిబ్బంది అంతా ఒక మాఫియాలా పనిచేశారు. డిప్యూటీ రెవెన్యూ ఆఫీసర్, క్లర్క్ లు, పర్సనల్ అసిస్టెంట్.. అందరూ కలిసే ఈ లంచాల వేట సాగించారు. ఒక డిప్యూటీ ఆఫీసర్ ఇంట్లో 67.5 లక్షల రూపాయల నగదు దొరకడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పక్కా షేరింగ్ అగ్రిమెంట్ తో ఏ అధికారికి ఎంత వాటా వెళ్లాలో ముందే నిర్ణయించుకుని ఈ దందా నడిపించారు. అధికారం చేతిలో ఉంది కదా అని సామాన్యుడి రక్తం తాగిన ఈ అధికారుల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
ఐఏఎస్ హోదాకే తీరని కళంకం
2015 బ్యాచ్ కి చెందిన రాజేంద్రకుమార్ పటేల్ తన తెలివితేటలను ప్రజల కోసం కాకుండా జేబులు నింపుకోవడానికి వాడారు. ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసినా, జైలుకు పంపినా ప్రజల్లో కలిగిన ఆగ్రహం మాత్రం తగ్గడం లేదు. విచారణలో మరిన్ని అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఈడీ చెబుతోంది.
శిక్ష పడాల్సిందే.. వ్యవస్థ మారాల్సిందే
ప్రస్తుతం రాజేంద్రకుమార్ పటేల్ ఈడీ కస్టడీలో ఊచలు లెక్కపెడుతున్నారు. ఆయనపై మనీ లాండరింగ్ తో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. కేవలం సస్పెన్షన్ తో సరిపెట్టకుండా ఆయన అక్రమంగా సంపాదించిన ప్రతి పైసాను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ‘అవినీతి తిమింగలాలకు’ కఠిన శిక్ష పడితేనే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది.