- 140 కోట్ల జనాభాకు సైక్రియాటిస్టుల సంఖ్య 9 వేలే
- మానసిక ఆరోగ్యానికి బడ్జెట్‌లో 1 శాతమే
- చికిత్స అందక పెరుగుతున్న ఆత్మహత్యలు
సహనం వందే, హైదరాబాద్:
దేశంలో మానసిక సమస్యలు ముదురుతున్నాయి. ప్రతి రోజూ లక్షలాది మంది ఒత్తిడి, ఆందోళనలతో నలిగిపోతున్నారు. అయితే వీరికి వైద్యం అందించే వ్యవస్థ మాత్రం కుంటుపడుతోంది. చికిత్స పొందాల్సిన వారు కొండంత ఉంటే… సాయం చేసే చేతులు గోరంతే ఉన్నాయి. ఈ అంతరం భయంకరమైన పరిణామాలకు దారితీస్తోంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే సమాజం మానసిక కుంగుబాటులోకి జారిపోయే ప్రమాదం పొంచి ఉంది.

చికిత్సలో భారీ అంతరం…
భారతదేశంలో మానసిక వైద్యం అందని ద్రాక్షలా మారింది. దేశవ్యాప్తంగా వివిధ మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిలో 80 నుంచి 85 శాతం మందికి సరైన చికిత్స అందడం లేదు. దీనిని నిపుణులు ట్రీట్‌మెంట్ గ్యాప్ అని పిలుస్తున్నారు. అంటే అత్యధిక శాతం మంది రోగులు అసలు ఆసుపత్రి గడప కూడా తొక్కడం లేదు. కేవలం 15 శాతం మంది మాత్రమే డాక్టర్ల వద్దకు వెళ్తున్నారు. సరైన సమయంలో వైద్యం అందకపోవడం వల్ల చిన్నపాటి సమస్యలు కూడా ముదిరిపోయి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
దేశంలో మానసిక వైద్యులు 9000 మందే…
వైద్యం అందకపోవడానికి ప్రధాన కారణం డాక్టర్ల కొరత. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో కేవలం 9000 మంది మాత్రమే మానసిక వైద్యులు ఉన్నారు. అంటే లక్షన్నర మందికి ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి లక్ష మందికి కనీసం 3 నుంచి 5 మంది సైక్రియాట్రిస్టులు ఉండాలి. కానీ మన దగ్గర పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా పల్లెల్లో మానసిక వైద్యం అసలు నామమాత్రంగా కూడా లేదు.
బడ్జెట్ కోతలు.. నిధుల లేమి
మానసిక ఆరోగ్యానికి కేటాయిస్తున్న నిధులు ఏమాత్రం సరిపోవడం లేదు. దేశ మొత్తం ఆరోగ్య బడ్జెట్‌లో మానసిక రంగానికి కేటాయిస్తున్నది 1 శాతం కంటే తక్కువే. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు 10 నుంచి 15 శాతం నిధులు ఖర్చు చేస్తుంటే.. మన దగ్గర వందల కోట్లు కూడా దాటడం లేదు. ఇందులో మెజారిటీ నిధులు పెద్ద నగరాల్లోని ఆసుపత్రులకే సరిపోతున్నాయి. దీనివల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం గగనంగా మారింది.
పెరుగుతున్న ఆత్మహత్యలు
సరైన చికిత్స అందకపోవడం వల్ల దేశంలో ఆత్మహత్యల రేటు పెరుగుతోంది. మానసిక కుంగుబాటుకు గురైన వారు సరైన సలహా ఇచ్చే వారు లేక ప్రాణాలు తీసుకుంటున్నారు. మన దేశంలో ఏటా దాదాపు 1.7 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీరిలో మెజారిటీ వ్యక్తులు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్న వారే. బాధితులను గుర్తించి వారికి చికిత్స అందిస్తే ఈ మరణాలను 70 శాతం వరకు తగ్గించవచ్చని గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదు.
వివక్షతో తీరని నష్టం
మానసిక వ్యాధి అంటే సమాజంలో ఉన్న ముద్ర (స్టిగ్మా) చికిత్సకు పెద్ద అడ్డంకిగా మారింది. పిచ్చివాళ్లని అంటారనే భయంతో చాలా కుటుంబాలు బాధితులను దాచిపెడుతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇతర జబ్బులకు వైద్యం చేయిస్తారు కానీ… మానసిక వైద్యుడి దగ్గరకు వెళ్లడానికి వెనకాడుతున్నారు. అవగాహన లేక చాలా మంది రోగులను భూతవైద్యుల దగ్గరకు, దర్గాల చుట్టూ తిప్పుతున్నారు. దీనివల్ల రోగి పరిస్థితి విషమించి శాశ్వత వైకల్యానికి దారితీస్తోంది.
యుద్ధ ప్రాతిపదికన చర్యలు…
ఇండియన్ సైక్రియాట్రిక్ సొసైటీ నివేదిక ప్రకారం క్షేత్రస్థాయిలో మార్పు రావాలి. ఎంబీబీఎస్ విద్యార్థులకు మానసిక వైద్యంలో కఠిన శిక్షణ ఇవ్వాలి. టెలి-మానస్ వంటి డిజిటల్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న సైక్రియాట్రిస్ట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. బడ్జెట్ కేటాయింపులను కనీసం 5 శాతానికి పెంచాలి. మానసిక ఆరోగ్యం అనేది లగ్జరీ కాదు.. అది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని ప్రభుత్వాలు గుర్తించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.