- ప్రపంచాన్ని ఏఐ శాసిస్తుంటే మారని పాఠం
- బలిపీఠంపై విద్యార్థుల భవిష్యత్తు
- ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగ ఫ్యాక్టరీలు
- ఇండియాలో ఇంజనీర్ల బతుకు అగమ్యగోచరం
- ఏటా 15 లక్షల మందికి ఇంజనీరింగ్ పట్టా
- అందులో 10 శాతం మందికే కనీస నైపుణ్యం
సహనం వందే, హైదరాబాద్:
కృత్రిమ మేధస్సు పెనుతుఫానులా విరుచుకుపడుతుంటే భారతీయ విద్యావ్యవస్థ పాతకాలపు పాఠాలతో విద్యార్థుల భవిష్యత్తును బలిపీఠం ఎక్కిస్తోంది. లక్షల రూపాయలు పోసి కొన్న ఇంజనీరింగ్ పట్టాలు ఇప్పుడు నిరుద్యోగ పత్రాలుగా మారుతున్నాయి. నైపుణ్యం లేని చదువులతో లక్షలాది మంది యువత ఐటీ కంపెనీల గడప తొక్కలేక అల్లాడుతున్నారు. మార్కెట్ అవసరాలకు, విద్యాబోధనకు మధ్య ఉన్న భారీ అగాధం ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకే సవాలుగా మారింది.
నైపుణ్యం లేని గ్రాడ్యుయేట్లు
భారతదేశంలో ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. వీరిలో కేవలం 10 శాతం మందికి మాత్రమే కంపెనీలకు కావాల్సిన కనీస నైపుణ్యం ఉంది. 8 లక్షల కోట్ల రూపాయల విలువైన భారతీయ ఐటీ పరిశ్రమ ఇప్పుడు ఏఐ దెబ్బకు వణికిపోతోంది. అన్షుమాన్ సింగ్ అనే వ్యవస్థాపకుడు చెప్పినట్లుగా చాలామందికి ప్రాథమిక కోడింగ్ కూడా రావడం లేదు. వీరు కాలేజీల్లో నేర్చుకున్న విషయాలు ప్రస్తుత సాంకేతికతకు ఏమాత్రం సరిపోవడం లేదు. కంపెనీలు ఇప్పుడు కేవలం డిగ్రీలను చూడటం లేదు. పని చేసే సత్తా ఉన్నవారినే వెతుక్కుంటున్నాయి.
సిలబస్ మార్చని మూర్ఖత్వం
భారతీయ విద్యాసంస్థలు ఇంకా దశాబ్దాల నాటి అంశాలనే బోధిస్తున్నాయి. తన్మయ్ సింగ్ అనే విద్యార్థి కథే దీనికి పెద్ద ఉదాహరణ. తను చదివిన చదువుకు పరిశ్రమలో ఎదురవుతున్న సవాళ్లకు ఏమాత్రం పొంతన లేదు. ఏఐ, మెషీన్ లెర్నింగ్ వంటి కీలక రంగాల్లో సరైన శిక్షణ ఉండటం లేదు. కాలేజీలు కేవలం ఫీజుల వసూలుపైనే దృష్టి పెడుతున్నాయి. ప్రొఫెసర్లకు కూడా మారుతున్న టెక్నాలజీపై కనీస అవగాహన ఉండటం లేదు. దీంతో విద్యార్థులు సొంతంగా నేర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
తరిగిపోతున్న వేతనాల విలువ
గతంలో ఐటీ ఉద్యోగం అంటే లక్షల రూపాయల ప్యాకేజీలు ఉండేవి. టీసీఎస్, విప్రో వంటి కంపెనీలు ఇచ్చే జీతాలు దశాబ్ద కాలంగా పెరగలేదు. సగటు ప్రారంభ వేతనం ఏడాదికి 3 నుంచి 4 లక్షల రూపాయల దగ్గరే నిలిచిపోయింది. దీనిని నేటి ధరలతో పోలిస్తే చాలా తక్కువ అని మోహన్ దాస్ పాయ్ విశ్లేషించారు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే జీతాల విలువ సగానికి పడిపోయింది.
కృత్రిమ మేధస్సు పెనుముప్పు
గోల్డ్‌మన్ సాక్స్ అంచనా ప్రకారం ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ఉద్యోగాలు ప్రభావితం అవుతాయి. ఇది భారతదేశం లాంటి సేవా రంగంపై ఆధారపడ్డ దేశానికి పెద్ద దెబ్బ. కేవలం కింది స్థాయి పనులు చేసే వారి అవసరం ఇక ఉండదు. సాఫ్ట్‌వేర్ కోడింగ్, బగ్స్ సరిచేయడం వంటి పనులను ఏఐ సెకన్లలో చేస్తోంది. అమెరికా కంపెనీలు ఇప్పుడు భారతీయ శ్రమశక్తిపై ఆధారపడటం తగ్గిస్తున్నాయి. నైపుణ్యం లేని ఇంజనీర్లు ఇప్పుడు లేఆఫ్స్‌కు మొదటి బాధితులు అవుతున్నారు.
శిక్షణ కోసం మళ్ళీ ఖర్చులు
కాలేజీలో లక్షలు పెట్టి చదివినా పని నేర్చుకోవడానికి విద్యార్థులు మళ్ళీ బయట కోర్సులు చేస్తున్నారు. పూణేలోని హృషికేష్ వంటి యువకులు యూట్యూబ్, ప్రైవేట్ శిక్షణ కేంద్రాలపై ఆధారపడుతున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇన్ఫోసిస్ వంటి పెద్ద సంస్థలు కూడా కొత్త వారిని తీసుకోవడం తగ్గించేశాయి. 500 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం గడించే ఐటీ రంగం ఇప్పుడు డైలమాలో ఉంది. చదువు పూర్తి కాగానే ఉద్యోగం వస్తుందన్న నమ్మకం పూర్తిగా సడలిపోయింది.
ప్రభుత్వాలు… విద్యావేత్తల నిర్లక్ష్యం
విద్యారంగంలో సమూల మార్పులు చేయకపోతే దేశ ప్రగతి మందగిస్తుంది. నాస్కామ్ నివేదిక ప్రకారం నైపుణ్యాల కొరత పెద్ద అడ్డంకిగా మారింది. విద్యా విధానం కేవలం పరీక్షల చుట్టూనే తిరుగుతోంది. ప్రయోగాత్మక జ్ఞానం, సమస్యల పరిష్కార సామర్థ్యం విద్యార్థుల్లో లోపించింది. కార్పొరేట్ కంపెనీలు విద్యార్థులకు మళ్ళీ శిక్షణ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. తక్షణమే ఏఐ యుగానికి తగ్గట్లుగా పాఠ్యప్రణాళికలు మార్చాలి. లేదంటే ఇంజనీరింగ్ పట్టాలు కేవలం గోడలకు అలంకారంగానే మిగిలిపోతాయి.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్