- ఇనుప తలుపులను ధ్వంసం చేసి అరాచకం
- అధ్యక్షుడు మదురోను ఎత్తుకెళ్లిన అమెరికా
- మదురో ముఖానికి ముసుగు వేసి తరలింపు
- డ్రగ్స్ కేసులో మదురో దంపతుల అరెస్ట్
- ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు
- ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన అగ్రరాజ్యం
- వామపక్ష కమ్యూనిస్టు ప్రభుత్వాలపై కన్నెర్ర
- చమురు కోసమే యుద్ధమంటున్న రష్యా,చైనా
- లాటిన్ అమెరికాలో రాజకీయ సంక్షోభం
సహనం వందే, వెనిజులా:
అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. వెనిజులా దేశంపై మెరుపు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బందీగా పట్టుకుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఈ ఆపరేషన్ తో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రజాస్వామ్యం పేరుతో అమెరికా చేస్తున్న ఈ సాహసం చమురు రాజకీయం వైపు మలుపు తిరుగుతోంది.

అర్ధరాత్రి ఆపరేషన్ తో విలవిల
శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆ దేశ రాజధాని కారకాస్ నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. అమెరికా సైన్యంలోని అత్యున్నత విభాగం డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ లో పాల్గొంది. ఒక కోటలాంటి ఇంట్లో నివసిస్తున్న అధ్యక్షుడు మదురోను అమెరికా బలగాలు చుట్టుముట్టాయి. భారీ బ్లో టార్చ్ లతో స్టీల్ డోర్లను కట్ చేసి లోపలికి ప్రవేశించాయి. అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ ఆపరేషన్ ను ప్రత్యక్షంగా వీక్షించడం విశేషం. ప్రస్తుతం మదురో దంపతులను అమెరికాలోని న్యూయార్క్ కు తరలించారు.
చమురు నిల్వలపైనే ట్రంప్ కన్ను
ఈ అరెస్టు వెనుక అసలు కారణం వెనిజులాలోని అపారమైన చమురు నిల్వలని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాల్లో వెనిజులా ఒకటి. మదురో ప్రభుత్వం అమెరికాకు వ్యతిరేకంగా ఉండటంతో చాలా కాలంగా వాషింగ్టన్ గుర్రుగా ఉంది. మదురోను తొలగించి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ చమురు నిల్వలను చేజిక్కించుకోవాలని ట్రంప్ స్కెచ్ వేశారు. వెనిజులా వ్యూహాత్మక వనరులను ముఖ్యంగా చమురు, ఖనిజాలను స్వాధీనం చేసుకునేందుకే ఈ దాడి జరిగిందని వెనిజులా ప్రభుత్వం ఆరోపిస్తోంది. దేశంలో సరైన ప్రభుత్వం ఏర్పడే వరకు తామే పాలన కొనసాగిస్తామని ట్రంప్ ప్రకటించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
డ్రగ్స్ స్మగ్లింగ్ ముసుగులో వేటు
మదురోపై అమెరికా తీవ్రమైన ఆరోపణలు మోపింది. నార్కో టెర్రరిజం, డ్రగ్స్ స్మగ్లింగ్ కు మదురో నాయకత్వం వహిస్తున్నారని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండి తెలిపారు. మెషిన్ గన్ల వాడకం, భారీగా కొకైన్ దిగుమతి చేస్తున్నట్లు మదురోపై కేసులు నమోదు చేశారు. గతంలో మదురో ఆచూకీ తెలిపిన వారికి సుమారు 415 కోట్ల రూపాయల బహుమతిని కూడా ప్రకటించారు. విదేశీ ఉగ్రవాద సంస్థలతో మదురోకు సంబంధాలు ఉన్నాయని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ఆరోపణల సాకుతోనే ఒక సార్వభౌమ దేశంపై దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని వెనిజులా మిత్రదేశాలు మండిపడుతున్నాయి.

ప్రపంచ దేశాల మధ్య చిచ్చు
ఈ మెరుపు దాడి ప్రపంచాన్ని రెండుగా చీల్చింది. రష్యా, చైనా ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. అమెరికా సాయుధ దురాక్రమణకు పాల్పడిందని రష్యా ఆరోపించగా… సార్వభౌమ దేశంపై దాడి చేయడం ఆందోళనకరమని చైనా పేర్కొంది. ఇరాన్, బ్రెజిల్ దేశాలు కూడా అమెరికా తీరును తప్పుబట్టాయి. ఇది అంతర్జాతీయ శాంతికి భంగం కలిగిస్తుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు అర్జెంటీనా వంటి దేశాలు ట్రంప్ నిర్ణయానికి మద్దతు తెలిపాయి. బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నాయి. ఈ పరిణామం రష్యా, అమెరికా మధ్య ప్రత్యక్ష పోరుకు దారితీస్తుందేమోనన్న భయం మొదలైంది.
వెనిజులాలో ఎమర్జెన్సీ ప్రకటన…
మదురో అరెస్టుతో వెనిజులా ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించి సైన్యాన్ని మోహరించింది. మదురో ప్రాణాలతో ఉన్నాడో లేదో వెంటనే నిరూపించాలని ఆ దేశ ఉపాధ్యక్షురాలు డిమాండ్ చేశారు. కారకాస్ లోని ప్రధాన విమానాశ్రయం, పోర్టుల వద్ద పేలుళ్లు జరగడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. విదేశీ బలగాలను ఎదుర్కొంటామని ఆ దేశ రక్షణ మంత్రి ప్రకటించారు. అయితే ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి బహుమతి విజేత మరియా కోరినా మచాడో మాత్రం స్వేచ్ఛా సమయం వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు. వెనిజులాలో ఇప్పుడు అంతర్గత యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
లాటిన్ అమెరికా రాజకీయాల్లో మార్పు
మదురో అరెస్టుతో లాటిన్ అమెరికాలో వామపక్ష ప్రభుత్వాలకు గట్టి హెచ్చరిక ఇచ్చినట్లు అయింది. అమెరికా తన పొరుగు దేశాల్లో జోక్యాన్ని పెంచబోతోందని ఈ ఘటన నిరూపిస్తోంది. ఒక దేశ అధ్యక్షుడిని బంధించి తమ దేశంలో విచారించడం అనేది ప్రమాదకరమైన సంప్రదాయమని విశ్లేషకులు చెబుతున్నారు. వెనిజులాలో త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ట్రంప్ చెబుతున్నా అది అంత తేలికైన విషయం కాదు. ఆ చమురు సంపద చుట్టూ ఇప్పుడు అగ్రరాజ్యాలు తమ పావులు కదుపుతున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ మార్కెట్ లో చమురు ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో వెనిజులా రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.