బీసీ బాట… కవిత వేట – గురి పెట్టిన జాగృతి నేత

Kavitha BC Bhata
  • వెనుకబడిన వర్గాల ఓట్ల కోసం తపన
  • ప్రధాన పార్టీలకు కల్వకుంట్ల ఆడబిడ్డ సవాల్
  • లెక్క తేలని తెలంగాణ రాజకీయాలు

సహనం వందే, హైదరాబాద్:

తెలంగాణ రాజకీయ తెరపై మరో సంచలనం మొదలైంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తూ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇది కేవలం అధికారం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. మూడు ప్రధాన పార్టీల కోటలను బద్దలు కొట్టే వ్యూహం. ఈ రాజకీయ చదరంగంలో కవిత వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.

బలమైన సామాజిక అస్త్రం
తెలంగాణ జనాభాలో 52 శాతం ఉన్న బీసీలు ఇప్పుడు రాజకీయాలకు కీలకంగా మారారు. ఈ భారీ ఓటు బ్యాంకును ఆకర్షించడమే లక్ష్యంగా కవిత పావులు కదుపుతున్నారు. కేవలం నినాదాలు ఇస్తే సరిపోదని ఆమె నమ్ముతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా బీసీల కోసం పోరాటం చేసి సొంత నేతల నుంచే వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం కావాలనే ఆకాంక్షను ఆమె తన రాజకీయ పెట్టుబడిగా మార్చుకుంటున్నారు.

Telangana Jagruthi Kavitah

కాంగ్రెస్ బీసీ రాజకీయాలు
అధికార కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తోంది. 2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బీసీ కుల గణన అంటూ పెద్ద హడావుడి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేశారు. అక్కడ ఎదురుదెబ్బ తగిలినా తాము బీసీల కోసం పోరాడామని ప్రజలకు చెప్పుకునే అవకాశం కాంగ్రెస్‌కు దక్కింది. ఈ గట్టి పోటీని తట్టుకుని కవిత ఎలా నిలబడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బీఆర్ఎస్, బీజేపీల వ్యూహాలు
పదేళ్ల పాలనలో బీసీల కోసం ఎన్నో పథకాలు అమలు చేశామని బీఆర్ఎస్ చెబుతోంది. తమ పార్టీ పుట్టిందే బీసీల నుంచి అని గులాబీ నేతలు ప్రకటిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా తాము బీసీ పార్టీ అని ప్రచారం చేసుకుంటోంది. ముఖ్యంగా కేంద్రమంత్రి బండి సంజయ్ వంటి బీసీ నేతలను ముందు పెట్టి ఆ పార్టీ దూసుకుపోతోంది. తీన్మార్ మల్లన్న వంటి నేతలు కూడా ఇదే వర్గం నుంచి యాక్టివ్‌గా ఉన్నారు. ఇలాంటి బలమైన సమీకరణాల మధ్య కవిత తన ఉనికిని చాటుకోవాల్సి ఉంటుంది.

అగ్రకులాధిపత్యంపై తిరుగుబాటు
ప్రధాన పార్టీలన్నింటిలోనూ అగ్రకులాల పెత్తనం ఎక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో బలమైన అగ్రకులాన్ని దాటి బీసీలు ఎదిగే పరిస్థితి లేదని కవిత బృందం వాదిస్తోంది. అటు బీఆర్ఎస్ లో కూడా కేసీఆర్ కుటుంబం, పాత తెలుగుదేశం పార్టీకి చెందిన అగ్రకుల నేతలదే హవా అని చెబుతున్నారు. బీజేపీ సైతం గెలిచే స్థానాలను అగ్రకులాలకు ఇచ్చి ఓడిపోయే సీట్లను బీసీలకు కట్టబెడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్యాప్‌ను భర్తీ చేస్తామని కవిత హామీ ఇస్తున్నారు.

మహిళా శక్తి… అనుభవం
కవితకు కుటుంబ రాజకీయ వారసత్వం పెద్ద అడ్వాంటేజ్. ఆమె మాట్లాడే తీరు చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం పురుషాధిక్య రాజకీయం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఒక మహిళా నాయకురాలిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ కోటా ఉండాలని ఢిల్లీ వేదికగా పోరాడితే ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. మహిళలు, బీసీ ఓట్లు కలిస్తే కవితకు తిరుగులేని భవిష్యత్తు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో అసలు సవాలు
రాజకీయాల్లో రాణించాలంటే కేవలం స్లోగన్లు సరిపోవు. బీసీలకు నిజమైన భాగస్వామ్యం ఇవ్వాలని కవిత భావిస్తున్నారు. అందుకే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 80 శాతం టిక్కెట్లు బీసీలకే ఇవ్వాలని యోచిస్తున్నారు. గ్రామ, జిల్లా స్థాయిల్లో బీసీలకు పెద్దపీట వేయడమే ఆమె లక్ష్యం. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఒంటరి మహిళగా ఆమె చూపిస్తున్న ధైర్యం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఆమె కాన్ఫిడెన్స్ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *