మహిళా బిల్లుకు డీ’లిటిగేషన్’ – మహిళా, డిలిమిటేషన్ బిల్లులకు లింకేంటి?

Delimitation bill And Mahila Reservation Bill
  • రెండింటికీ ముడి పెట్టడంలో అంతర్గత కుట్ర
  • మహిళా బిల్లు పేరుతో దక్షిణాదిపై కుతంత్రం
  • కేంద్రం కుట్రను తిప్పికొట్టిన ప్రతిపక్షాలు
  • సౌత్ ఇండియన్ గెలుపు… కేంద్రానికి షాక్
  • ఎన్డీఏ కూటమి వ్యూహం తలకిందులు

సహనం వందే, హైదరాబాద్:

మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసిన కేంద్ర సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి సీట్ల సంఖ్యను పెంచి తద్వారా దక్షిణాది ప్రాబల్యాన్ని తగ్గించాలనే పాలకుల కుట్రను ప్రతిపక్షాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా తెరపైకి తెచ్చిన ఈ నిబంధన రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. కేవలం మహిళల కోటా కోసమే కాకుండా తమ ప్రాంతీయ హక్కుల పరిరక్షణ కోసం దక్షిణాది గళం పార్లమెంటులో బలంగా వినిపించింది.

పునర్విభజన అసలు ముప్పు
కేవలం రాజకీయ లబ్ధి కోసం మహిళల భుజాల మీద తుపాకీ పెట్టి డీలిమిటేషన్ పేరిట దక్షిణాది రాష్ట్రాల గొంతు కోయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. మహిళా రిజర్వేషన్ చట్టం అమలును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం వెనుక భారీ వ్యూహం దాగి ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సవరణ బిల్లు ప్రకారం పునర్విభజన తర్వాతే 33 శాతం కోటా అమలు చేయాలని ప్రభుత్వం పట్టుబట్టింది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యాన్ని తగ్గించాలని కుట్ర ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పునర్విభజన జరిగితే ఉత్తరాదిలో సీట్లు పెరిగి దక్షిణాదిలో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది. ఈ చిక్కుముడినే అడ్డం పెట్టుకుని మహిళా హక్కులను తాకట్టు పెట్టాలని కేంద్రం చూస్తోందనే వాదన బలంగా వినిపించింది.

Delimitation and Mahila Reservation bill

వివాదానికి మూలబిందువు ఇదే
కేంద్రం ప్రతిపాదించిన ఈ నిబంధనే అసలు వివాదానికి ప్రధాన కేంద్రమైంది. ప్రస్తుతం ఉన్న 543 సీట్లకే 33 శాతం రిజర్వేషన్లు వెంటనే వర్తింపజేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కానీ ప్రభుత్వం మాత్రం సీట్ల సంఖ్య పెరిగిన తర్వాతే కోటా ఇస్తామని మొండికేసింది. మహిళా సాధికారత కంటే పునర్విభజన ద్వారా రాజకీయ లబ్ధి పొందడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారని విమర్శలు వచ్చాయి. దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాలరాయాలన్న ఈ ఎత్తుగడను గుర్తించిన విపక్షాలు సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించి పాలకుల పట్టును సడలించాయి.

కుట్రకు తగిన సమాధానం
మహిళా రిజర్వేషన్ల పేరుతో జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రతిపక్షాలు అండగా నిలిచాయి. ప్రభుత్వ కుట్రకు లోక్‌సభ వేదికగా గట్టి సమాధానం చెప్పినట్టు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పునర్విభజన పేరుతో మహిళా కోటాను దశాబ్దాల పాటు వాయిదా వేసే ప్రయత్నం జరిగింది. ఈ నెల 16వ తేదీ నుండి చట్టం అమలులోకి వచ్చినా సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఇది కేవలం ఒక బిల్లు ఓటమి కాదు… సమాఖ్య వ్యవస్థపై దాడి చేయాలనుకున్న పాలకుల ఆలోచనకు తగిలిన పెద్ద దెబ్బ.

సభలో సంఖ్యాబలం గల్లంతు
శుక్రవారం లోక్‌సభలో జరిగిన ఓటింగ్ ఫలితాలు ఎన్డీయే కూటమికి షాక్ ఇచ్చాయి. రాజ్యాంగ సవరణకు కావాల్సిన మూడింట రెండు వంతుల మెజారిటీని ప్రభుత్వం సాధించలేకపోయింది. బిల్లుకు అనుకూలంగా కేవలం 298 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. మరోవైపు ప్రతిపక్షాల ఐక్యతతో బిల్లుకు వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. అధికార పక్షానికి సరిపడా సభ్యుల మద్దతు లభించకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఖరారు చేశారు. ఈ ఓటమి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను జాతీయ స్థాయిలో దిగజార్చింది.

వెనక్కి తగ్గిన కిరణ్ రెజిజు
ఓటింగ్ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రెజిజు కీలక ప్రకటన చేశారు. 131వ సవరణ బిల్లు వీగిపోవడంతో మిగిలిన 2 సవరణ బిల్లులతో కూడా ముందుకు వెళ్లకూడదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలిపారు. హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇండీ అలయన్స్ సభ్యులు తమ షరతులతోనే మహిళా బిల్లును అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఏది ఏమైనా, పునర్విభజన ఆధారంగా మహిళా కోటాను అమలు చేయాలన్న కేంద్రం మొండితనం చివరకు పరాజయంతో ముగిసింది.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *