- విదేశీ భాషల మోజుపై ఫడ్నవీస్ ప్రశ్న
- హిందీ భాషపై త్వరలో కమిటీ నివేదిక
సహనం వందే, మహారాష్ట్ర:
మహారాష్ట్రలో భాషా వివాదం మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఏ భాషకు ప్రాధాన్యత ఉండాలనే అంశంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సతారాలో జరిగిన సాహిత్య సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ… మహారాష్ట్రలో మరాఠీకే అగ్రపీఠం ఉంటుందని, ఇతర భాషలను బలవంతంగా రుద్దే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మరాఠీ ఒక్కటే తప్పనిసరి
రాష్ట్రంలోని పాఠశాలల్లో మరాఠీ భాష ఒక్కటే తప్పనిసరి అని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. మొదటి తరగతి నుంచే హిందీని మూడో భాషగా ప్రవేశపెట్టాలని చేసిన సిఫార్సులపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. విద్యార్థులు తమకు నచ్చిన ఏ భారతీయ భాషనైనా నేర్చుకునే స్వేచ్ఛ ఉందని, కానీ ప్రభుత్వం ఏ భాషను బలవంతంగా అమలు చేయదని ఆయన హామీ ఇచ్చారు. మరాఠీ అస్తిత్వాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని పునరుద్ఘాటించారు.
త్వరలో హిందీపై కమిటీ నివేదిక
హిందీ పాఠ్యాంశాల అమలుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ప్రస్తుతం తుది దశలో ఉంది. నివేదిక అందిన తర్వాతే మూడో భాషను ఏ తరగతి నుండి ప్రవేశపెట్టాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఫడ్నవీస్ వెల్లడించారు. అప్పటి వరకు పాఠశాలల్లో మరాఠీ మాత్రమే ప్రధాన భాషగా కొనసాగుతుంది.
విదేశీ భాషల మోజుపై ప్రశ్న
‘మనం ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ వంటి విదేశీ భాషలకు రెడ్ కార్పెట్ వేస్తున్నాం. కానీ మన దేశానికి చెందిన ఇతర భాషలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాం?’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. విదేశీ భాషల పట్ల చూపే ఆదరణ స్వదేశీ భాషల పట్ల కూడా ఉండాలని, ఇది కేవలం రాజకీయ అంశం కాదు.. సాంస్కృతిక గౌరవమని ఆయన పేర్కొన్నారు.
ప్రాచీన భాషా హోదా
మరాఠీ భాషకు ప్రాచీన భాషా హోదా దక్కడంపై ఫడ్నవీస్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతోనే ఈ గౌరవం దక్కిందని కొనియాడారు. కేవలం హోదాతోనే సంతృప్తి పడకూడదని, దేశవ్యాప్తంగా మరాఠీకి ఆదరణ పెరగాలని, మరాఠీ సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించే ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
భావ ప్రకటన స్వేచ్ఛ
సాహిత్యానికి ఆంక్షలు పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రమాదంలో ఉందంటూ కొందరు చేసే విమర్శలను కొట్టిపారేస్తూ ఆలోచనలు, సాహిత్య ప్రవాహం కొనసాగినంత కాలం ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరాఠీ భాషా వికాసం కోసం ప్రభుత్వం ఎంతటి ఖర్చుకైనా వెనకాడదని స్పష్టం చేస్తూ మరాఠీ ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.