- కొత్త ఏడాది పుణ్యక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
- పుణ్యక్షేత్రాల ఆధ్యాత్మిక పర్యాటకానికి క్రేజ్
- రికార్డు స్థాయిలో అయోధ్యకు యాత్రికులు
- కాశీ నుంచి కన్యాకుమారి దాకా సందడి
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 64.68 కోట్ల మంది రాక
- దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన యుపీ
- అయోధ్యలో 16.44 కోట్లతో రికార్డుల వేట
- దీంతో భారీగా పెరిగిన ఆదాయ వనరులు
సహనం వందే, న్యూఢిల్లీ:
భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. గడచిన కొన్నేళ్లుగా భక్తి మార్గంలో ప్రయాణించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దేవాలయాల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనతో పర్యాటక రంగం కళకళలాడుతోంది. కేవలం వినోదం కోసమే కాకుండా మానసిక ప్రశాంతత కోసం భక్తులు పుణ్యక్షేత్రాల బాట పడుతున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తోంది.

అయోధ్యలో రికార్డుల వేట
రామ్ లల్లా కొలువుదీరిన అయోధ్య ఇప్పుడు పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. 2024 ఏడాదిలో ఏకంగా 16.44 కోట్ల మంది పర్యాటకులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. గత డిసెంబర్ ఒక్క నెలలోనే సుమారు 6 కోట్ల మంది వచ్చారని అంచనా వేస్తున్నారు. భవ్య రామమందిర నిర్మాణం తర్వాత ఈ నగరం రూపురేఖలే మారిపోయాయి. కేవలం దేశీయులే కాకుండా విదేశీయులు కూడా అయోధ్యను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ పెరుగుదల పర్యాటక రంగంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది.
కాశీ నుంచి మథుర దాకా…
ప్రపంచంలోనే పురాతన నగరమైన వారణాసి పర్యాటకంలో దూసుకుపోతోంది. 2024లో వారణాసికి 11 కోట్ల మంది పర్యాటకులు తరలివచ్చారు. గంగా హారతి కాశీ విశ్వనాథుడి దర్శనం కోసం భక్తులు వేల కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు. అలాగే మథుర బృందావనం కూడా భక్తులతో కిక్కిరిసిపోతోంది. 2024లో ఇక్కడ 9 కోట్ల మంది పర్యటించారు. పుణ్యక్షేత్రాల సందర్శన ఇప్పుడు ఒక ట్రెండ్ లా మారింది.

దక్షిణాదిలోనూ జోరు…
ఉత్తరాదిలోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పర్యాటక రంగం వృద్ధి బాటలో ఉంది. తమిళనాడులో గతేడాది 30.68 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారు. కర్ణాటకలో 30.45 కోట్ల మంది యాత్రికులు పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకుల సంఖ్య 29.2 కోట్లుగా నమోదైంది. గతంతో పోలిస్తే ఏపీలో 13.96 శాతం వృద్ధి కనిపిస్తోంది. తిరుమల వంటి క్షేత్రాలతోపాటు తీర ప్రాంత పర్యాటకం కూడా బాగా పుంజుకుంది. మౌలిక వసతులు పెరగడంతో యాత్రికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
మహారాజ సంస్కృతికి జై
రాజస్థాన్ రాష్ట్రం తన వారసత్వ సంపదతో పర్యాటకులను కట్టిపడేస్తోంది. 2023లో 17.90 కోట్లుగా ఉన్న పర్యాటకుల సంఖ్య 2024 నాటికి 23 కోట్లు దాటింది. అంటే ఏడాది కాలంలోనే 28.5 శాతం వృద్ధి నమోదైంది. కోటలు రాజభవనాలు, ఎడారి అందాలను చూడటానికి జనం క్యూ కడుతున్నారు. పర్యాటక రంగంపై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ ఇక్కడ ఫలితాలను ఇస్తోంది. విదేశీ పర్యాటకుల రాకతో స్థానిక ప్రజలకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ లో భక్తి ప్రభంజనం…
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహకాళేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. 2024 ఏడాదిలో 7.32 కోట్ల మంది ఇక్కడికి వచ్చారు. గత నెల 25 నుంచి ఈనెల 5వ తేదీ మధ్యలో సుమారు 12 లక్షల మంది వస్తారని అధికారులు భావిస్తున్నారు. అత్యంత తీవ్రమైన వాతావరణం ఉన్నప్పటికీ కేదార్ నాథ్ క్షేత్రాన్ని 16 లక్షల మంది సందర్శించడం విశేషం. ప్రతికూల పరిస్థితులు ఉన్నా భక్తుల విశ్వాసం ముందు అవేవీ అడ్డుకావడం లేదు. భక్తితో పాటు పర్యాటకం కలవడంతో కొత్త ఉపాధి మార్గాలు ఏర్పడుతున్నాయి.
దేశవ్యాప్తంగా పర్యాటక వెల్లువ
మొత్తంగా చూస్తే దేశీయ పర్యాటక రంగం ఏడాది కాలంలో 18 శాతం వృద్ధిని సాధించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 64.68 కోట్ల మంది పర్యాటకులతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పర్యాటక రంగం ద్వారా లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. కొత్త ఏడాది వేడుకల కోసం భక్తులు, పర్యాటకులు క్షేత్రాలకు తరలి వెళ్లారు. హోటళ్లు రవాణా రంగం పర్యాటక శాఖలు యాత్రికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.