గూడు చెదిరె… గుండె పగిలె – దేశంలో ఏడేళ్లలో రెట్టింపైన ఇళ్ల కూల్చివేతలు

Poor People Houses
  • కూలుతున్న గూడు… పేదవాడి గోడు!
  • 2023లో లక్షకు పైగా పేదల ఇళ్ల కూల్చివేత
  • వీధిన పడుతున్న లక్షలాది పేద కుటుంబాలు
  • పునరావాసం చూపడంలో పాలకుల నిర్లక్ష్యం
  • అభివృద్ధి పేరుతో సామాన్యుడిపై బుల్డోజర్లు
  • నిలువ నీడ లేక అల్లాడుతున్న బడుగులు
  • హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్స్ నెట్‌వర్క్ నివేదిక

సహనం వందే, న్యూఢిల్లీ:

అభివృద్ధి ముసుగులో పేదవాడి సొంతింటి కల కల్లలవుతోంది. నగరాల సుందరీకరణ పేరిట బుల్డోజర్లు పేదల గుడిసెలను నేలమట్టం చేస్తున్నాయి. ఏళ్ల తరబడి నివసిస్తున్న చోట నుంచి కనికరం లేకుండా గెంటేస్తున్నారు. అధికార గర్వంతో పాలకులు చేస్తున్న ఈ దాడులు మానవ హక్కులను కాలరాస్తున్నాయి. గూడు కోల్పోయిన గుండెల్లో ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. ఇది కేవలం ఇళ్ల కూల్చివేత కాదు.. సామాన్యుడి ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడి.

Housing and Land Rights Network remarks

రెట్టింపైన విధ్వంసం…
గడిచిన 7 ఏళ్ల కాలంలో దేశంలో ఇళ్ల కూల్చివేతలు భయంకరంగా పెరిగాయి. గణాంకాలను పరిశీలిస్తే ఈ కాలంలో కూల్చివేతలు ఏకంగా రెట్టింపయ్యాయి. 2017 నుంచి 2024 మధ్య కాలంలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్స్ నెట్‌వర్క్ (హెచ్ఎల్ఆర్ఎన్) డేటా ప్రకారం… దేశంలో 2017-23 మధ్య 3,44,768 పేదల ఇళ్ళను కూల్చివేశారు. దీనివల్ల దాదాపు 16 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2023లో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కూల్చివేసిన ఇళ్ల శాతం చాలా తక్కువగా ఉంది. ఒక్క 2023 సంవత్సరంలోనే సుమారు 1.05 లక్షల ఇళ్లను నేలమట్టం చేశారు. దీనివల్ల దాదాపు 5.15 లక్షల మంది వీధిన పడ్డారు. పాలకుల దూకుడుకు పేదలు బలైపోతున్నారు. చట్టాల పేరుతో సామాన్యుడి పొట్ట కొట్టడం పరిపాటిగా మారింది.

పునరావాసం అందని ద్రాక్షే…
ఇళ్లు కూల్చేస్తున్న ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయం చూపడంలో విఫలమవుతోంది. గూడు కోల్పోయిన వారిలో కేవలం 10 శాతం మందికి మాత్రమే పునరావాసం లభిస్తోంది. మిగిలిన 90 శాతం మంది గతి ఏంటో పట్టించుకునే నాథుడే లేడు. అభివృద్ధి అంటే పేదలను వెళ్లగొట్టడమేనా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఆకాశహర్మ్యాల మధ్య మురికివాడలు ఉండకూడదన్న పాలకుల అహంకారం పేదరికాన్ని మరింత పెంచుతోంది. పునరావాసం లేని కూల్చివేతలు అమానుషమని స్వచ్ఛంద సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి.

బుల్డోజర్ రాజకీయాలు
ఇటీవల కాలంలో బుల్డోజర్ ఒక రాజకీయ ఆయుధంగా మారింది. నేర నియంత్రణ పేరుతోనో లేదా ఆక్రమణల సాకుతోనో ఇళ్లను కూల్చివేయడం ఫ్యాషన్ గా మారింది. చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండానే అధికారులు ఇళ్లను పడగొడుతున్నారు. దీనివల్ల రాజ్యాంగం కల్పించిన జీవన హక్కుకు భంగం కలుగుతోంది. నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి వేళ ఇళ్లు కూల్చడం ఏ రకమైన పాలన అని జనం నిలదీస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులకు పేదల ఇళ్లు వేదికగా మారుతున్నాయి.

శిథిలాల కింద మానవత్వం
ఒక్కో ఇల్లు కూలిపోతుంటే ఆ కుటుంబం దశాబ్దాల కష్టం బుగ్గిపాలవుతోంది. కూల్చివేతల సమయంలో పిల్లల పుస్తకాలు నిత్యావసర వస్తువులు కూడా బయటకు తెచ్చుకునే అవకాశం ఇవ్వడం లేదు. శిథిలాల మధ్య కూర్చుని ఏడుస్తున్న వృద్ధులు, చిన్నారుల దృశ్యాలు మనసును కలచివేస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లే పిల్లలు తమ గూడు లేక చదువుకు దూరమవుతున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు ఆరుబయట చలిలో ఎండుతూ ప్రాణాలు వదులుతున్నారు. పాలకుల అభివృద్ధి మంత్రం పేదల పాలిట మరణశాసనంగా మారుతోంది.

నగరాల సుందరీకరణ ఎవరి కోసం?
స్మార్ట్ సిటీలు, మెట్రో ప్రాజెక్టుల కోసం పేదలను బలి ఇస్తున్నారు. నగరాల మధ్యలో ఉన్న మురికివాడలను ఖాళీ చేయించి ఆ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. పేదలను నగరం వెలుపలకు పంపడం వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటోంది. పని దొరకక ఆదాయం లేక ఆ కుటుంబాలు పస్తులుంటున్నాయి. ప్రభుత్వాలు కేవలం ధనవంతుల కోసమే పని చేస్తున్నాయన్న భావన ప్రజల్లో బలపడుతోంది. సంపన్నుల మేడల కోసం పేదల నీడను లాక్కోవడం ఎంతవరకు సమంజసం.

చట్టం చుట్టం కాకూడదు
న్యాయస్థానాలు కూల్చివేతలపై ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వాల్లో మార్పు రావడం లేదు. ఆక్రమణల తొలగింపు పేరుతో సాగుతున్న ఈ అరాచకానికి అడ్డుకట్ట వేయాలి. ప్రతి పేదవాడికి నిలువ నీడ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇల్లు కూల్చే ముందు వారికి సరైన వసతి కల్పించడం కనీస ధర్మం. మానవతా దృక్పథం లేని ఏ అభివృద్ధి అయినా అది వినాశనానికే దారితీస్తుంది. పాలకులు తమ వైఖరి మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *