- నిన్నటి వరకు సహజీవనం అంటూ తిరిగారు
- నేడు అంతకంటే సులువైన కొత్త డేటింగ్
- ఎవరికీ అనుమానం రాకుండా సీక్రెట్ రిలేషన్
- తల్లిదండ్రులను మోసం చేస్తున్న నేటి యువత
- రిలేషన్ ఉన్నా అందరి ముందు లేనట్టే బిల్డప్
- ఫోటోలు ఉండవు… సెల్ఫీలు అసలే దిగరు
- వాట్సప్ సోషల్ మీడియాలో చాటింగ్ ఉండదు
సహనం వందే, హైదరాబాద్:
గతంలో ప్రేమంటే ఒక గర్వం. పది మందికి చెప్పుకునే ఒక అందమైన అనుభూతి. కానీ ఇప్పుడు కలియుగం పరాకాష్టకు చేరింది. బంధాలకు రంగులు మారాయి. నిన్న మొన్నటి వరకు పెళ్లి పెటాకులు లేకుండా సహజీవనం అంటూ తిరిగారు. ఇప్పుడు అంతకుమించి చెత్త కల్చర్ హైదరాబాదును సర్వనాశనం చేస్తుంది. నగర యువత ఇప్పుడు కొత్త రూట్ పట్టింది. అదే హుష్ డేటింగ్. గుట్టుచప్పుడు కాకుండా.. ఎవరికీ తెలియకుండా.. కేవలం ఇద్దరి మధ్యే సాగే ఈ రిలేషన్ షిప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అందరి ముందు ఎవరో తెలియనట్లు…
ప్రస్తుతం హైదరాబాద్ యువతలో ఈ హుష్ డేటింగ్ ట్రెండ్ విపరీతంగా పెరిగింది. సాధారణంగా ఎవరైనా ప్రేమలో పడితే సోషల్ మీడియాలో ఫొటోలు పెడతారు. కానీ ఈ కొత్త ట్రెండ్ లో మాత్రం అస్సలు హడావుడి ఉండదు. కనీసం ప్రాణ స్నేహితులకు కూడా విషయం చెప్పరు. వ్యక్తిగత గోప్యతకు వీరు ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అందరి ముందు ఎవరో తెలియనట్లు నటిస్తారు.
మెట్రో నగరాల్లో ఇష్టారాజ్యం…
ఈ రహస్య బంధాల సంస్కృతి ఒక్క భాగ్యనగరానికే పరిమితం కాలేదు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ మొదలైంది. చెన్నై వంటి సంప్రదాయ నగరాల్లోనూ ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఐటీ ఉద్యోగులు, స్టార్టప్ నిర్వాహకులు ఈ తరహా డేటింగ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కెరీర్ కు ఆటంకం లేకుండా ఉండాలని ఇలా ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నా… భారతీయ సంప్రదాయాలను తుంగలో తొక్కిస్తున్నారన్న విమర్శలున్నాయి.
పెళ్లి ప్రశ్నలకు చెక్
యువత ఈ దారి ఎంచుకోవడానికి ప్రధాన కారణం సమాజం. సోషల్ మీడియా వెర్రి తలలు వేస్తుంది. మరోవైపు చుట్టుపక్కల వాళ్ళు ఎవరితో తిరుగుతున్నావ్? పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? వంటి ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ఇది మంచి మార్గమని భావిస్తూ తల్లిదండ్రులను నయవంచనకు గురి చేస్తున్నారు. ఈ బంధానికి ఎలాంటి పేర్లు పెట్టరు. జవాబుదారీతనం అస్సలు ఉండదు. అందుకే నో లేబుల్ రిలేషన్ షిప్స్ కు డిమాండ్ పెరుగుతోంది. ఒకరిపై ఒకరు అంచనాలు పెంచుకోకుండా స్వేచ్ఛగా ఉండొచ్చు.
ఫోటోలు లేవు… ట్యాగింగ్ లు ఉండవు
ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీలు పెట్టడం… ఫేస్ బుక్ లో లవ్ సింబల్స్ వాడటం వంటివి ఈ డేటింగ్ లో కనిపించవు. జంటగా దిగిన ఒక్క ఫొటో కూడా బయటకు రాదు. వీరు డేటింగ్ కోసం రద్దీగా ఉండే పబ్లు, మాల్స్ కు వెళ్లరు. హోటళ్లకు వెళ్లి గంటల పాటు గడపరు. ఏకాంతంగా ఉండే ప్రదేశాలకే ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు ఉంటే ఎవరూ తెలియని ఇతర నగరాలకు వెళ్లి వస్తుంటారు. ప్రపంచానికి తమ ప్రేమ విషయం తెలిస్తే వచ్చే ఇబ్బందుల కంటే ఈ రహస్య బంధమే బాగుందని వారు నమ్ముతున్నారు.
ఆర్థిక స్వాతంత్ర్యం తోడై…
నేటి తరం యువతలో ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగింది. లగ్జరీ జీవితం అలవాటైంది. ఎవరికీ లొంగి ఉండటం ఇష్టం లేదు. ఇగోలు కూడా ఈ ట్రెండ్ కు కారణమవుతున్నాయి. ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకపోవడంతో నచ్చినంత కాలం కలిసి ఉండటం… లేదంటే సైలెంట్ గా విడిపోవడం సులువుగా మారింది. మ్యాగీలాగా ఇన్‌స్టంట్ బంధాలు పెరిగిపోతున్నాయి.
భావోద్వేగాల పరిస్థితి ఏంటి?
హుష్ డేటింగ్ సౌకర్యంగానే ఉన్నా… ఇందులో అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి. బంధానికి గుర్తింపు లేకపోవడంతో మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పరస్పర గౌరవం లోపిస్తే భావోద్వేగపరంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. స్పష్టత లేని బంధాలు ఎప్పుడైనా కూలిపోవచ్చు. అందుకే ట్రెండ్ పేరుతో గుడ్డిగా వెళ్లడం కంటే… మనసుకు ఏది సరైనదో ఆలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కోసారి ఇలాంటి బంధాలు నేరాలకు కారణంగా మారుతున్నాయి.
మారుతున్న మనుషుల తీరు
మనుషుల ఆలోచనా విధానం మారుతోంది. ఆ కాలం నాటి నిబద్ధత ఇప్పుడు కరువైంది. విడిపోవడం అనేది చాలా చిన్న విషయంగా మారిపోయింది. సెలబ్రెటీల నుంచి సామాన్యుల దాకా అందరూ ఇదే ఫార్ములా వాడుతున్నారు. అయితే ఏ బంధంలోనైనా నిజాయితీ ముఖ్యం. అది లేనప్పుడు రహస్యంగా ఉన్నా… బహిరంగంగా ఉన్నా ప్రశాంతత ఉండదు. పరిణతితో నిర్ణయాలు తీసుకున్నప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది.