- 120 మంది డిపాజిట్ చేసిన సొమ్ము గల్లంతు
- కో ఆపరేటివ్ సొసైటీలో కోట్ల కుంభకోణం
- రెండేళ్లుగా అందని వడ్డీ… అసలుకే ఎసరు
- పాలకుల అండతోనే అక్రమాలకు లైసెన్స్
- న్యాయం కోసం రిటైర్డ్ ఉద్యోగుల గర్జన
సహనం వందే, రాజమండ్రి:
రిటైర్ అయ్యాక ఆసరాగా ఉంటుందని దాచుకున్న పైసలు మాయమయ్యాయి. దశాబ్దాల పాటు ఫ్యాక్టరీలో రక్తం ధారపోసి సంపాదించిన సొమ్మును సొసైటీ ముంచేసింది. ఆంధ్ర పేపర్ మిల్లు (రాజమండ్రి) రిటైర్డ్ ఉద్యోగుల బతుకులు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా కనికరించే నాథుడే కరువయ్యారు.
నమ్మించి ముంచారు
ఆంధ్ర పేపర్ మిల్లులో 30 నుంచి 40 ఏళ్ల పాటు సేవలందించి రిటైర్ అయిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు వచ్చిన పీఎఫ్, గ్రాట్యుటీ సొమ్మును నమ్మకంతో సొసైటీలో డిపాజిట్ చేశారు. రిజిస్టర్డ్ నంబర్ 1426 గల కో ఆపరేటివ్ సొసైటీలో రూపాయి వడ్డీ వస్తుందని ఆశపడ్డారు. కానీ నవంబర్ 2023 నుంచి వీరికి వడ్డీ గానీ… అసలు గానీ అందడం లేదు. ఈ వివరాలను ఆంధ్ర పేపర్ మిల్లు రిటైర్డ్ ఉద్యోగులు ఎం.సోమరాజు, వెంకటేశ్వర రావు, పి.ఉమా మహేశ్వరరావు గురువారం రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

తప్పించుకుంటున్న మేనేజ్ మెంట్
దాదాపు 120 మంది రిటైర్డ్ ఉద్యోగులు 4 కోట్ల రూపాయల మేర డిపాజిట్ చేశారు. ఆ సొమ్ము విషయమై పాలక వర్గం సభ్యులను అడిగితే మేనేజ్ మెంట్ కటింగ్ ఆపిందని సాకులు చెబుతున్నారు. మేనేజ్ మెంట్ వద్దకు వెళ్తే సొసైటీలో మోసం జరిగిందని బుకాయిస్తున్నారు. రికార్డులు అడిగినా ఇవ్వడం లేదు. తమకు సంబంధం లేదని యాజమాన్యం తప్పించుకుంటోంది. తప్పు చేసిన పాలక వర్గంపై చర్యలు తీసుకోవడంలో మిల్లు యజమాన్యం మీనమేషాలు లెక్కిస్తోందని రిటైర్డ్ ఉద్యోగులు మండిపడుతున్నారు.
రాజకీయ అండతోనే ఆటలు
అక్రమాలపై విచారణలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. పాలక వర్గం కోర్టు నుంచి స్టే తెచ్చుకుని ఎంక్వైరీ జరగకుండా అడ్డుకుంటోంది. గతంలో ఉన్న ఎంపీ భరత్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును కలిసినా పరిస్థితిలో మార్పు రాలేదు. పాలకులు మారుతున్నా బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదని సోమరాజు, వెంకటేశ్వర రావు, ఉమా మహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం
జిల్లా కలెక్టర్, సహకార శాఖ అధికారుల చుట్టూ రెండేళ్లుగా తిరుగుతున్నామని వారు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డబ్బును తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నారు.