- బాలమేధావులే గొప్పవారవుతారనేది అపోహ
- అందులో కేవలం 10 శాతం మందే ప్రతిభ
- ఒలింపిక్ విజేతలు, నోబెల్ గ్రహీతల పాఠం
- చిన్నప్పటి నుంచే అతి శ్రమతో బర్నవుట్
- అల్లరి పిల్లలే భవిష్యత్తులో విజేతలు
- బహుముఖ ప్రవేశం ఉన్నవారే వికసిస్తారు
- వారే స్థిరమైన విజయాలు సాధిస్తున్నారు
సహనం వందే, హైదరాబాద్:
పిల్లవాడు పట్టుమని పదేళ్లు రాకముందే బ్యాటు పట్టుకుని సెంచరీలు కొడుతున్నాడా? వెంటనే అతనో సచిన్ టెండూల్కర్ అయిపోతాడని మురిసిపోకండి. బాల్యంలోని మెరుపులు భవిష్యత్తులో తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. చిన్నప్పుడు సామాన్యంగా కనిపించేవారే కాలక్రమేణా ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్రతిభకు తొందరపాటు కంటే సహనమే అసలైన పెట్టుబడి అని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
పరిశోధన చెప్పిన చేదు నిజం
జర్మనీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు అర్నే గులిచ్ నేతృత్వంలో ఈ ఆసక్తికర అధ్యయనం జరిగింది. ఒలింపిక్ విజేతలు, నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారులు, చదరంగం యోధుల జీవితాలను ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దయ్యాక తమ రంగాల్లో అగ్రస్థానానికి చేరిన వారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే చిన్నప్పుడు అసాధారణ ప్రతిభ చూపారు. మిగిలిన 90 శాతం మంది బాల్యంలో చాలా సాదాసీదాగా ఉండటం విశేషం. అంటే చిన్నప్పుడు టాపర్లుగా ఉన్న పిల్లలందరూ భవిష్యత్తులో స్టార్లు కాలేరని ఈ రిపోర్ట్ తేల్చి చెప్పింది.
చిన్ననాటి వేగం ఎందుకు శాపం
బాల్యంలోనే ఒకే రంగంపై దృష్టి పెట్టిన పిల్లలు మొదట్లో వేగంగా దూసుకుపోతారు. తల్లిదండ్రులు, కోచ్‌లు వారిపై అమితమైన ఒత్తిడి పెంచుతారు. దీనివల్ల వారు చిన్న వయసులోనే మానసిక అలసటకు లోనవుతారు. దాన్నే బర్నవుట్ అని పిలుస్తారు. ఇతర రంగాల గురించి అవగాహన లేకపోవడం వల్ల వారి ఆలోచనా పరిధి తగ్గిపోతుంది. ఒక దశకు చేరుకున్నాక వారి ప్రతిభ స్తంభించిపోతుంది. యువ ప్రతిభావంతుల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడగలుగుతున్నారు. మిగిలిన వారు అర్థాంతరంగా తమ కెరీర్‌ను ముగించేస్తున్నారు.
ఆలస్యంగా వికసించడమే మేలు
చిన్నప్పుడు అల్లరి చేస్తూ అన్ని రంగాల్లో వేలు పెట్టే పిల్లలే భవిష్యత్తులో విజేతలుగా నిలుస్తున్నారు. ఆలస్యంగా రంగంలోకి దిగేవారు రకరకాల అనుభవాలను గడిస్తారు. దీనివల్ల వారికి మానసిక పరిపక్వత వస్తుంది. నెమ్మదిగా ఒక రంగంలో స్థిరపడటం వల్ల వారికి సుదీర్ఘ కాలం రాణించే శక్తి లభిస్తుంది. మైఖేల్ జార్డన్ వంటి దిగ్గజాలు బాస్కెట్ బాల్‌తో పాటు బేస్ బాల్ కూడా ఆడారు. చార్లెస్ డార్విన్ సైతం తన కెరీర్ మొదట్లో చాలా సాధారణంగా ఉన్నారు. విశ్వనాథన్ ఆనంద్ కూడా చదరంగంలో ఒక్కసారిగా దూసుకు రాలేదు. నిలకడగా రాణిస్తూ శిఖరాలను అధిరోహించారు.
ఉదాహరణలు ఇవే
సంగీత ప్రపంచంలో మొజార్ట్, గోల్ఫ్ రంగంలో టైగర్ వుడ్స్ వంటి వారు బాల్య ప్రతిభావంతులుగా గుర్తింపు పొందారు. కానీ వీరి కంటే బీథోవెన్, మైఖేల్ జార్డన్ వంటి వారు భవిష్యత్తులో ఎక్కువ ప్రభావం చూపారు. శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ కూడా చిన్నప్పుడు అంత చురుగ్గా ఏమీ లేరు. ఫుట్‌బాల్ వంటి క్రీడల్లో కూడా చిన్నప్పుడు అద్భుతంగా ఆడిన వారు సీనియర్ జట్టులోకి వచ్చేసరికి కనిపించకుండా పోతున్నారు. దీనికి కారణం అతిగా శ్రమించడం మరియు వైవిధ్యం లేకపోవడమే. చదరంగంలో కూడా ఆలస్యంగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన వారే ఎక్కువ కాలం టాప్ టెన్ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
పెద్దలకు గుణపాఠం
ఈ పరిశోధన ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక కనువిప్పు. పిల్లలను చిన్నప్పటి నుంచే ర్యాంకుల వేటలోనో లేక మెడళ్ల వేటలోనో పరుగులెత్తించవద్దు. వారిని స్వేచ్ఛగా పెరగనివ్వాలి. అన్ని రకాల క్రీడలు, కళలను పరిచయం చేయాలి. ఒకే అంశంపై ఒత్తిడి పెంచితే వారిలోని సహజమైన సృజనాత్మకత చచ్చిపోతుంది. చిన్నప్పుడు వెనకబడి ఉన్నా సరే సరైన సమయంలో వారు తమ ప్రతిభను బయటపెడతారు. ఓపిక పట్టడం వల్లనే గొప్ప విజేతలు తయారవుతారని గులిచ్ అధ్యయనం హితవు పలుకుతోంది. బాల్య మెరుపుల కంటే పెద్దల ప్రకాశమే శాశ్వతమని గుర్తించాలి.