- 62 మంది వైద్య అధ్యాపకులపై వేటు
- ఏడాదిగా విధులకు రాకపోవడమే కారణం
- తాత్కాలిక తొలగింపు… డీఎంఈ నోటీసులు
సహనం వందే, విజయవాడ:
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కోట్లాది రూపాయల జీతాలు తీసుకుంటూ ఏడాదిన్నర పైగా విధులకు ఎగనామం పెడుతున్న 62 మంది వైద్య అధ్యాపకుల సేవలను తాత్కాలికంగా రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) జి.రఘునందన్ రావు నిర్ణయించారు. అనుమతి లేకుండా సంవత్సరానికి పైగా గైర్హాజరైన 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లపై షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ ప్రొవిజనల్ టర్మినేషన్ ఆర్డర్లు విడుదల చేశారు.

ఉద్యోగం అంటే లెక్కే లేదా?
ఈ డాక్టర్లు సర్వీసు నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని… విధులకు ఎగనామం పెట్టి ప్రైవేటు ప్రాక్టీస్‌లో మునిగిపోయారని ఆరోపణలు ఉన్నాయి. వీరి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రమైంది. విద్యార్థుల భవిష్యత్తు బుగ్గిపాలవుతోంది. రోగులకు నాణ్యమైన చికిత్స అందకుండా పోతోంది. ఇక ఈ ధోరణికి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.
షోకాజ్ నోటీసులతో షాక్
గైర్హాజరైన వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన డీఎంఈ… వారి సేవలను ఎందుకు రద్దు చేయకూడదో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నోటీసులను డీఎంఈ వెబ్‌సైట్‌లో ప్రదర్శించడంతో పాటు సంబంధిత కాలేజీల నోటీసు బోర్డులపై అతికించారు. ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5.30 గంటల లోపు వ్యక్తిగతంగా హాజరై వివరణ సమర్పించాలి. లేకపోతే వీరు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు పరిగణించి శాశ్వతంగా సేవల నుంచి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
కార్పొరేట్ ఆశలే జీవితం…
ప్రభుత్వ ఉద్యోగం ఉంటూ ప్రైవేటు ఆసుపత్రుల్లో భారీ సంపాదనపై మొగ్గు చూపడమే ఈ పలాయనానికి ప్రధాన కారణం. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి ఆసక్తి లేకపోవడం, సౌకర్యాల లోపం, రాజకీయ ఒత్తిళ్లు కూడా వీరిని దూరం చేస్తున్నాయి. ఇప్పటివరకు నిబంధనలు కఠినంగా లేకపోవడం వీరికి వరంగా మారింది.
తెలంగాణలోనూ ఇదే దారి…
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. అక్కడ కూడా అనేకమంది వైద్యులు విదేశాలకు గానీ… ప్రైవేటు ప్రాక్టీస్‌కు గానీ వెళ్లిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సెలవులు పెట్టి గైర్హాజరవుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ వైద్య విద్యార్థులకు బోధించే అధ్యాపకులు కరువై రేపటి తరం డాక్టర్ల నైపుణ్యం ప్రశ్నార్థకమవుతోంది.