- ఎన్‌టీఏపై పార్లమెంటరీ ప్యానెల్ సీరియస్
- దేశవ్యాప్తంగా విద్యార్థి భవిష్యత్తు ప్రశ్నార్థకం!
- ఆన్‌లైన్ పరీక్షల్లో పెరుగుతున్న అక్రమాలు
- నీట్, జేఈఈలను సరిగా నిర్వహించని దుస్థితి
- హ్యాకింగ్ బెడద కన్నా పెన్ను పేపరే మిన్న
- బ్లాక్ లిస్ట్ కంపెనీలను పక్కన పెట్టాలి
- యూపీఎస్‌సీ తరహా రాత పరీక్షలే సురక్షితం
- పెన్ను కాగితంపై రాసే రాత పరీక్షకు మారండి
సహనం వందే, న్యూఢిల్లీ:
దేశంలో ప్రవేశ పరీక్షల నిర్వహణలో వ్యవస్థీకృత వైఫల్యాలు బయటపడుతున్నాయి. సాంకేతికత పేరుతో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. అక్రమాలు, హ్యాకింగ్ భయాల మధ్య పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటోంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఎన్‌టీఏ తీరుపై ఇప్పుడు సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

తప్పుల తడకగా ఎన్‌టీఏ
జాతీయ పరీక్షల సంస్థ ఎన్‌టీఏ వైఫల్యాలు వరుసకడుతున్నాయి. ఈ ఏడాది జరిగిన 14 పరీక్షల్లో ఐదింటిలో తీవ్ర సమస్యలు తలెత్తాయి. నీట్ యూజీ పేపర్ లీక్ కావడం, యూజీసీ నెట్ వాయిదా పడటం వ్యవస్థ అసమర్థతకు నిదర్శనం. జేఈఈ మెయిన్ లో ఏకంగా 12 ప్రశ్నలు తొలగించడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది.
సాంకేతికతతోనే అసలు ముప్పు…
ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణలో సాంకేతిక సమస్యలు పీడకలలా మారాయి. కంప్యూటర్ల హ్యాకింగ్ వల్ల పారదర్శకత లోపిస్తోంది. దీనివల్ల పరీక్షలు తరచూ వాయిదా పడుతున్నాయి. డిజిటల్ విధానం కంటే పాత పెన్ను పేపరు పద్ధతే నయమని దిగ్విజయ్ సింగ్ కమిటీ తేల్చి చెప్పింది. యూపీఎస్‌సీ తరహాలో రాత పరీక్షలే సురక్షితమని సిఫార్సు చేసింది.
ప్రైవేటు సెంటర్ల అక్రమాలు…
పరీక్షల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల అక్రమాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థల్లోనే పరీక్షలు నిర్వహించాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. పర్యవేక్షణ బాధ్యతాయుతంగా లేకపోతే విద్యార్థుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. నిబంధనలు కఠినంగా అమలు చేస్తేనే వ్యవస్థలో ప్రక్షాళన సాధ్యమవుతుంది.
కాసుల వేటలో అధికారులు
ఎన్‌టీఏ కేవలం ఫీజుల వసూళ్లపైనే శ్రద్ధ చూపిస్తోంది. ఆరేళ్లలో విద్యార్థుల నుంచి 3512.88 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందులో 3064.77 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా ఇంకా 448 కోట్లు మిగిలే ఉన్నాయి. భారీగా నిధులు ఉన్నా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించలేకపోవడం అధికారుల నిర్లక్ష్యమే. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా నాణ్యత మచ్చుకైనా కనిపించడం లేదు.
బ్లాక్ లిస్ట్ కంపెనీల ముసుగు
గతంలో తప్పులు చేసిన సంస్థలకు మళ్లీ బాధ్యతలు ఇవ్వడం ప్రమాదకరం. బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీలను పరీక్షల ప్రక్రియకు దూరం పెట్టాలి. పేపర్ తయారీ నుంచి దిద్దుబాటు వరకు అత్యంత గోప్యత పాటించాలి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులను శిక్షించాలి. అప్పుడే విద్యా వ్యవస్థపై విద్యార్థులకు నమ్మకం కలుగుతుంది.