- దీంతో దేశంలో కృత్రిమ వరద లేదా కరువు
- బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ మెగా ప్రాజెక్ట్
- 14 లక్షల కోట్ల రూపాయలతో నిర్మాణం
- నీటి ప్రవాహంపై పెత్తనం కోసమే నిర్మాణం
- భారత్, బంగ్లాదేశ్‌లకు పొంచి ఉన్న ముప్పు
సహనం వందే, న్యూఢిల్లీ:
హిమాలయ సానువుల్లో చైనా మరో దుశ్చర్యకు తెరలేపింది. టిబెట్ ప్రాంతంలోని యార్లంగ్ త్సాంగ్పో నదిపై ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డ్యామ్ నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నది చైనా చేతుల్లో బందీ కానుంది. ఇది కేవలం విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే కాదు… భారత్ భవిష్యత్తును శాసించే జల యుద్ధ తంత్రం.
వాటర్ బాంబు ముప్పు
చైనా నిర్మిస్తున్న ఈ మెగా డ్యామ్ వల్ల అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు పెను ప్రమాదం పొంచి ఉంది. అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ హెచ్చరించినట్టుగా ఇది ఎప్పుడైనా పేలగల వాటర్ బాంబు లాంటిది. చైనా తలుచుకుంటే ఒకేసారి భారీగా నీటిని వదిలి భారత్‌లో కృత్రిమ వరదలు సృష్టించగలదు. లేదంటే అవసరమైన సమయంలో నీటిని నిలిపివేసి ఎడారిగా మార్చగలదు.
భారీ వ్యయం… భారీ కుట్ర
ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం చైనా ఏకంగా 168 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. అంటే మన కరెన్సీలో దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. 2000 మీటర్ల ఎత్తు నుంచి నీటిని మళ్లిస్తూ అత్యంత సంక్లిష్టమైన సొరంగాలు, అండర్ గ్రౌండ్ పవర్ స్టేషన్లను నిర్మిస్తోంది. ఇప్పటికే మెకాంగ్ నదిపై డ్యామ్‌లు కట్టి దిగువ దేశాలను ఇబ్బంది పెట్టిన చరిత్ర చైనాకు ఉంది.
ఉలిక్కిపడ్డ భారత్
చైనా కదలికలను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాజ్యసభలో దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. చైనా చర్యలకు విరుగుడుగా భారత్ కూడా బ్రహ్మపుత్ర నదిపై 11200 మెగావాట్ల సామర్థ్యం గల భారీ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. వ్యూహాత్మకంగా డ్రాగన్ దేశానికి చెక్ పెట్టేందుకు కేంద్రం పావులు కదుపుతోంది.
పర్యావరణ విధ్వంసం
ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. భూకంపాలు వచ్చే ప్రమాదం ఉన్న ఈ ప్రాంతంలో భారీ డ్యామ్‌ల నిర్మాణం అత్యంత ప్రమాదకరం. ఏదైనా విపత్తు జరిగితే దిగువన ఉన్న కోట్ల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. శాంతియుత సంబంధాల గురించి మాట్లాడే చైనా… ఇలాంటి చర్యలతో ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తోంది.
అంతర్జాతీయ ఆందోళన
అమెరికాకు చెందిన స్టిమ్సన్ సెంటర్ లాంటి సంస్థలు కూడా ఈ ప్రాజెక్టు రిస్క్ గురించి హెచ్చరిస్తున్నాయి. పారదర్శకత లేకుండా చైనా చేస్తున్న ఈ నిర్మాణాలు అంతర్జాతీయ జల సూత్రాలకు విరుద్ధం. నీటి భద్రత పేరుతో చైనా సాగిస్తున్న ఈ ఆధిపత్య పోరు భవిష్యత్తులో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసేలా ఉంది.