రాందేవ్ బ్రాండ్ కారంతో రోగం – పురుగుమందుల మోతాదు అధికం!

Ramdev Baba Karam
  • పార్లమెంటులో కేంద్రమంత్రి సంచలన ప్రకటన
  • ప్రజల ప్రాణాలతో పతంజలి ఫుడ్స్ చెలగాటం!
  • కరోనాకాలం నుంచి మోసం చేస్తున్న రాందేవ్
  • సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా మారని బాబా

సహనం వందే, న్యూఢిల్లీ:

దేశీయ ఉత్పత్తులు, ఆరోగ్యం అంటూ డబ్బా కొట్టుకునే బాబా రాందేవ్ యాజమాన్యంలోని పతంజలి ఫుడ్స్ కంపెనీకి లోక్‌సభలో ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్ యూనిట్‌లో తయారు చేసిన పతంజలి ఎర్ర కారం పొడి శ్యాంపిల్స్‌లో పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి ప్రతాప్ రావు జాదవ్ స్వయంగా వెల్లడించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీపై లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ మంత్రి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంటే పతంజలి కారం పొడి సురక్షితం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పినట్టే! ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనలకు విరుద్ధంగా ఇందులో రసాయనాలు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు అమూల్ బ్రాండ్ ఉత్పత్తుల పరీక్షల్లో ఎలాంటి హానికర రసాయనాలు లేవని మంత్రి చెప్పడం గమనార్హం.

పతంజలిపై గతంలోనే సుప్రీంకోర్టు చివాట్లు
ఇది కేవలం పురుగుమందుల వ్యవహారమే కాదు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన విషయం. పతంజలి ఉత్పత్తులపై ముఖ్యంగా కరోనా సమయంలో చేసిన అసత్య ప్రకటనలపై గతంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రోగాలు నయమవుతాయని… వ్యాక్సిన్లకు మించి పనిచేస్తాయని పతంజలి సంస్థ తప్పుడు ప్రచారం చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. తక్షణం ప్రకటనలు నిలిపివేయకపోతే కోటి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అంతేకాదు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణలను స్వయంగా కోర్టుకు పిలిపించి మందలించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా లోక్‌సభలో కారం పొడిలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు తేలడం పతంజలి విశ్వసనీయతపై మరోసారి బట్టబయలైంది.

ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం…
కేవలం కారం పొడి మాత్రమే కాదు… మన నిత్య జీవితంలో వాడుతున్న ప్రతి ఆహార పదార్థంలోనూ కల్తీ భయం వెంటాడుతోంది. మిర్చిలో ఇటుక పొడి, పసుపులో రంగులు, పాలలో రసాయనాలు… ఇలా కల్తీ దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు సురక్షితమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేయాల్సిన భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) పర్యవేక్షణ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఆహారం తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై నియంత్రణ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం… దేశంలో ఇంత పెద్ద బ్రాండ్‌ కారంలో పురుగుమందుల మోతాదును ఎందుకు నియంత్రించలేకపోయింది? ఈ చట్టాల అమలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత అని మంత్రి చెప్తున్నా… ప్రజల ఆరోగ్య భద్రతకు సరైన చర్యలు ఎక్కడ తీసుకుంటున్నారు?

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *