యూదులు లక్ష్యం… చారిత్రక శతృత్వం – ఆస్ట్రేలియాలో ఉగ్ర దాడి వెనక కారణం అదే

Australia Beach attacks
  • పాలిస్తీనాపై ఇజ్రాయిల్ యుద్ధానికి ప్రతీకారం
  • ఆ దేశ ప్రభుత్వ వైఫల్యంపై ఇజ్రాయెల్ ఫైర్

సహనం వందే, ఆస్ట్రేలియా:

ఆస్ట్రేలియాలో బాండీ బీచ్‌లో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో 15 మంది మృతి చెందారు. ఉల్లాసంగా ఉన్న వాతావరణంలోకి తుపాకీ గుళ్లు దూసుకురావడం… చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా ఊచకోత కోయడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కాల్పులకే పరిమితం కాకుండా భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు దొరకడం ఈ దాడి వెనుక పెద్ద కుట్ర ఉందనడానికి నిదర్శనం. ఇది కేవలం ఆవేశంలో చేసిన దాడి కాదు… యూదులు పై విధ్వంసం సృష్టించడానికి చేసిన పక్కా ప్రణాళిక అని తేలిపోయింది.

Bondi Beach

బాండీ బీచ్‌ ఘటన వెనుక కసి…
ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో హనుక్కా యూదుల పండుగ సందర్భంగా చాబాద్ సంస్థ ఏర్పాటు చేసిన ఈవెంట్‌పై ఉగ్రవాదులు గురిపెట్టడం వెనుక స్పష్టమైన లక్ష్యం ఉంది. ఈ ఉగ్రదాడి కేవలం ఒక హింసాత్మక ఘటన మాత్రమే కాదు. ఇది యూదుల పట్ల ప్రపంచవ్యాప్తంగా నాటుకుపోయిన సెమిటిజం వ్యతిరేకత (యూదుల ద్వేషం)… రాజకీయ శతృత్వానికి నిదర్శనం. చరిత్ర పొడవునా యూదులు వేర్వేరు ప్రాంతాలలో వివక్షకు, హింసకు గురవుతూనే ఉన్నారు. అయితే ఆధునిక యుగంలో ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత ఉగ్రవాద మూకలు యూదులను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రధాన కారణాలు రెండు. మొదటిది: పాలస్తీనా – ఇజ్రాయెల్ సంఘర్షణ కారణంగా ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే యూదులను శత్రువులుగా చూడటం. రెండోది: మత ప్రేరేపిత ద్వేషం. ఈ కారణంగానే ప్రపంచంలో యూదుల పవిత్ర స్థలాలు, ఆరాధనా మందిరాలు (సినగోగ్‌లు), పండుగ ఉత్సవాలు ఉగ్రవాదుల లక్ష్యాలుగా మారుతున్నాయి.

ప్రభుత్వ వైఫల్యంపై ఇజ్రాయెల్ ఫైర్…
ఈ ఉగ్రదాడిపై ఇజ్రాయెల్ నాయకులు తీవ్ర స్థాయిలో ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం దేశంలో పెరుగుతున్న యూదుల వ్యతిరేకత గురించి ఎన్ని హెచ్చరికలు వచ్చినా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా విధానాలు యూదుల ద్వేషమనే జ్వాలలపై ఆజ్యం పోశాయి అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. గత కొన్ని నెలలుగా ఆస్ట్రేలియాలో యూదుల సంఘాలపై దాడులు, ఆందోళనలు జరుగుతున్నాయని… ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ఆస్ట్రేలియన్ యూదుల సంఘం సీఈఓ కూడా విమర్శించారు. ప్రపంచంలోనే అత్యధిక హోలోకాస్ట్ బాధితులు ఆశ్రయం పొందిన దేశాలలో ఆస్ట్రేలియా ఒకటి కావడం… అక్కడ ఈ తరహా దారుణం జరగడం ప్రభుత్వ భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది.

ప్రపంచవ్యాప్తంగా భద్రత పెంపు…
బాండీ బీచ్‌
లో జరిగిన ఈ మారణహోమం తరువాత ప్రపంచవ్యాప్తంగా యూదుల భద్రతపై ఆందోళన పెరిగింది. న్యూయార్క్, లండన్, బెర్లిన్ వంటి ప్రధాన నగరాల్లోని పోలీసులు హనుక్కా వేడుకలు జరిగే ప్రాంతాల్లో, సినగోగ్‌ల వద్ద భద్రతా బలగాలను పెంచారు. ఈ దాడితో తమకు నేరుగా సంబంధం లేదని ఉగ్ర సంస్థలు చెప్పినప్పటికీ… భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ దారుణం విభజన, హింస, ద్వేషం ముందు తమ దేశం లొంగిపోదని ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించినప్పటికీ… ఉగ్రవాద మూకల ఆట కట్టించడానికి మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని యూదుల కౌన్సిల్ డిమాండ్ చేసింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *