- నియామక ప్రక్రియలో కీలక నిబంధన మార్పు
- అనర్హులైన విద్యార్థులకు లబ్ధి జరిగేలా రూల్స్
- విద్యార్థులు అడ్డదారి… ఉద్యోగాలు పక్కదారి
- అక్రమాలు బయటపడటంతో ఆగ్రహజ్వాలలు
- దీంతో విద్యార్థి ప్లేస్‌మెంట్ కమిటీ రాజీనామా
- మొత్తంగా ఉద్యోగాల షెడ్యూల్ ప్రక్రియకు బ్రేక్
- లబోదిబోమంటున్న ఐఐఎం అభ్యర్థులు
సహనం వందే, బెంగళూరు:
దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటైన బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. 20 మంది సభ్యులున్న విద్యార్థి ప్లేస్‌మెంట్ కమిటీ మొత్తం ఒక్కసారిగా రాజీనామా చేయడంతో 2026 నాటి నియామక ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నెల 10న ఈ సామూహిక రాజీనామా జరిగింది. అసలు ఈ రాజీనామాలకు కారణం ఏమిటంటే… నియామక ప్రక్రియలో ఓ ముఖ్యమైన నిబంధనను కమిటీ సభ్యులకు అనుకూలంగా ఉండేలా మార్చారనే తీవ్ర ఆరోపణలు రావడమే! నిబంధన మార్పుతో కొందరు అనర్హులైన విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా ప్రయత్నించారన్నది ప్రధాన ఫిర్యాదు. ఈ వ్యవహారంపై ఇప్పుడు యావత్ విద్యార్థి వర్గం ఉలిక్కిపడుతోంది. కేవలం కమిటీలోని కొందరి స్వార్థం వల్ల వందలాది విద్యార్థుల కెరీర్ ప్రమాదంలో పడింది. ఈ నిబంధన మార్పు వల్ల ఏ మేరకు అవినీతి జరిగిందనేది బయటపడాల్సి ఉంది.

ప్లేస్‌మెంట్ ప్రక్రియ నిలిపివేతతో గందరగోళం…
ఈ ప్లేస్‌మెంట్ కమిటీ అనేది సాధారణంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థి ప్రతినిధులతో కూడి ఉంటుంది. వీరు ఫ్యాకల్టీ పర్యవేక్షణలో ఉంటూ నియామకాలకు సంబంధించి కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే ఈ 20 మంది సభ్యుల ప్యానెల్ రాజీనామా చేయడంతో ప్లేస్‌మెంట్ కార్యకలాపాలకు సంబంధించిన విద్యార్థి-నేతృత్వం పూర్తిగా నిలిచిపోయింది. దీనిపై కమిటీ సభ్యులు స్వయంగా ఇన్‌స్టిట్యూట్ కెరీర్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (సీడీఎస్)కు, తోటి విద్యార్థులకు లేఖ రాశారు. ‘తదుపరి ప్రకటన వచ్చేవరకు ల్యాటరల్, ఫైనల్ ప్లేస్‌మెంట్స్ ప్రాసెస్-2026కి సంబంధించిన అన్ని కార్యకలాపాలను నిలిపివేశాం’ అని వారు ఆ లేఖలో స్పష్టం చేశారు.
ఉద్యోగాల కోసం ఎదురుచూసే సమయంలో కీలకమైన ప్లేస్‌మెంట్ వ్యవస్థ అకస్మాత్తుగా ఆగిపోవడం అభ్యర్థులను తీవ్ర గందరగోళంలో పడేసింది. ఈ నిలిపివేత కారణంగా క్యాంపస్‌కు రావాల్సిన కంపెనీల షెడ్యూలింగ్, ఇంటర్వ్యూల నిర్వహణ, పత్రాల ధ్రువీకరణ వంటి కీలక ప్రక్రియలన్నీ స్థంభించిపోయాయి.
అంతర్గత విచారణకు ఆదేశం…
ఈ వివాదంపై ఐఐఎం బెంగళూరు యాజమాన్యం స్పందించింది. ఆరోపణల వ్యవహారం ఇన్‌స్టిట్యూట్ అంతర్గత సమీక్షలో ఉందని తెలిపింది. విద్యార్థుల సంక్షేమం తమకు అత్యంత ముఖ్యమని, ఇన్‌స్టిట్యూట్ విలువలకు అది కేంద్రమని పేర్కొంది. అయితే ఏ నిబంధన మార్చారు? ఎవరికి అనుకూలంగా మార్చడానికి ప్రయత్నించారు? రాజీనామాకు దారితీసిన అసలు ఆరోపణలు ఏమిటి? అనే వివరాలను ఇన్‌స్టిట్యూట్ వెల్లడించలేదు. కేవలం అంతర్గత సమీక్ష పేరుతో కాలయాపన చేస్తారా లేక నిజంగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. ప్లేస్‌మెంట్లకు సంబంధించిన ముందస్తు ప్రక్రియ డిసెంబరులో ప్రారంభమై తుది ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూలు ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. సమయం చాలా తక్కువగా ఉన్న ఇలాంటి కీలక సమయంలో ప్లేస్‌మెంట్ వ్యవస్థ కుప్పకూలడం మేనేజ్‌మెంట్ వైఫల్యానికి నిదర్శనం. నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడంలో ఫ్యాకల్టీ పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంతర్గత వివాదం కారణంగా విద్యార్థులపై ఒత్తిడి పెరిగి నియామక ప్రక్రియ ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది.