- టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి ఫైర్
- కుప్ప కూలిపోయిన పరిపాలన వ్యవస్థ
- ప్రజలకు పూర్తిస్థాయిలో అందని వైద్య సేవలు
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)లో పాలనా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడంపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) మండిపడింది. నెలల తరబడి జీతాలు అందకపోవడం… హెల్త్ కార్డులు ఇవ్వకపోవడం… అనేక జిల్లాల్లో డిప్యూటీ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (డీసీహెచ్ఎస్) పోస్టులు ఖాళీగా ఉండటం వంటి అంశాలు పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల కార్యకలాపాలను, వైద్య సిబ్బంది మనోబలాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. పరిపాలన స్తంభించడంతో రోజూవారీ పనులు నిలిచిపోయి ప్రజలకు వైద్య సేవలు అందడంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్కి నివేదిక బుట్టదాఖలు…
టీవీవీపీలో ఈ సంక్షోభం నిరంతరంగా కొనసాగడానికి ప్రధాన కారణం… ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆస్కి కమిటీ సిఫార్సు చేసిన కీలకమైన డీసీహెచ్ఎస్ పోస్టును మంజూరు చేయకపోవడమేనని టీజీజీడీఏ ఆరోపించింది. ఆస్కి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. అంతేకాదు దానిపై నిర్ణయం ప్రకటించలేదు. ఈ జాప్యం కారణంగానే పరిషత్ పాలనా యంత్రాంగం బలహీనపడి ఆసుపత్రుల నిర్వహణ, డాక్టర్ల సంక్షేమం తీవ్రంగా దెబ్బతిన్నాయని టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్, కోశాధికారి డాక్టర్ రవూఫ్ విమర్శించారు. ఈ మేరకు గురువారం వారు ఒక ప్రకటన జారీ చేశారు.
పనిచేయని స్థితిలో 81 ఆసుపత్రులు…
వైద్య విధాన పరిషత్ లో సమస్యలు పతాక స్థాయికి చేరాయి. వైద్యులు, సిబ్బందికి జీతాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. సిబ్బందికి ఆరోగ్య కార్డుల జారీ ఇప్పటికీ జరగలేదు. చాలా జిల్లాలకు డీసీహెచ్ఎస్ అధికారులు లేకపోవడంతో ఆ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ముఖ్యంగా సిబ్బందిని తిరిగి సర్దుబాటు (రీ-డిప్లాయ్‌మెంట్) చేయడంలో ఆలస్యం వల్ల మానుకొండూరు, చొప్పదండి వంటి చోట్ల పరిషత్తు పరిధిలోని 81 ఆసుపత్రులు పూర్తిగా పనిచేయడం లేదని నరహరి పేర్కొన్నారు. దీనికితోడు గత రెండేళ్లుగా డాక్టర్ల పదోన్నతులు ఆగిపోవడంతో వారు ప్యానెల్ ఇయర్ కూడా కోల్పోతున్నారని నరహరి ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో ఆరోగ్య సేవలు స్తంభించిపోతున్న ఈ తరుణంలో ప్రభుత్వం వెంటనే మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
టీజీజీడీఏ డిమాండ్లు…
- టీవీవీపీ వైద్యులకు చెల్లించాల్సిన పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలి.
- డీసీహెచ్ఎస్ పోస్టును మంజూరు చేయాలి.
- అర్హులైన డాక్టర్లు, సిబ్బందికి వెంటనే ఆరోగ్య కార్డులు జారీ చేయాలి.
- సాధారణ (రెగ్యులర్) డీసీహెచ్ఎస్ అధికారులను నియమించాలి. డాక్టర్ల పదోన్నతులను వేగవంతం చేయాలి.
- పనిచేయకుండా మూతపడిన 81 ఆసుపత్రులను పునరుద్ధరించాలి.