- ప్రభుత్వ కళ్ళుగప్పి దేశం నుంచి పలాయనం
- గ్రామీణ మహిళగా 900 కి.మీ. ప్రయాణం
- పాస్‌పోర్టు రద్దు చేసినా దేశం దాటిన నేత
సహనం వందే, వెనిజులా:
వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరీనా మచాడో దేశం నుంచి గురువారం తప్పించుకున్న తీరు ప్రపంచ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మాదురో ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షలు… 24 గంటల నిఘాను ఛేదించుకుని ఆమె రహస్యంగా నార్వే రాజధాని ఓస్లోకు చేరుకున్నారు. ఈ వారం జరిగే నోబెల్ ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు ఆమె రహస్యంగా దేశం విడిచి వెళ్లారు.
మారువేషంలో 900 కి.మీ. యాత్ర
అంతర్జాతీయ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం… మచాడో ప్రయాణం అత్యంత గోప్యంగా ప్రమాదకరంగా సాగింది. తనను ఎవరూ గుర్తించకుండా ఆమె పూర్తిగా మారువేషంలో కనిపించారు. పొడవాటి విగ్గు, పెద్ద సన్ గ్లాసెస్‌తో సాదాసీదా గ్రామీణ మహిళ దుస్తులు ధరించి ఓ సామాన్యురాలిగా రూపు మార్చుకున్నారు. రాత్రివేళ ఇంటి వెనుక గోడ దాటిన ఆమె కొద్దిమంది సాయంతో బయలుదేరారు. కొలంబియా సరిహద్దు వరకు దాదాపు 900 కిలోమీటర్లు అడవులు, గ్రామీణ మార్గాల గుండా ప్రయాణించారు. అక్కడి నుంచి రహస్య విమానంలో యూరప్‌కు చేరుకున్నారు.
‘మా ప్రజల గొంతుకగా నిలుస్తా’
నోబెల్ ప్రకటించిన వెంటనే మాదురో ప్రభుత్వం ఆమెను అరెస్టు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించడంతో గత రెండు నెలలుగా మచాడో రహస్యంగా ఉన్నారు. ఓస్లో చేరుకున్న కొద్ది గంటల్లోనే ఆమె ఒక సందేశం పంపారు. ‘నా పాస్‌పోర్టు రద్దు చేశారు. దేశం విడిచి వెళ్లడం నిషేధించారు. కానీ వెనిజులా ప్రజల పోరాటాన్ని మాదురో ఆపలేడు. నేను ఓస్లోలో ఉండి మా 3 కోట్ల ప్రజల తరపున ఈ బహుమతిని స్వీకరిస్తాను’ అని ధైర్యంగా ప్రకటించారు.