- 1 శాతం బడాబాబుల చేతుల్లో 40 శాతం ఆస్తి
- ధనికులు-పేదల మధ్య దారుణమైన అంతరం
- వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్ బట్టబయలు
- ప్రపంచ అసమానతల్లో ఇండియా అగ్రస్థానం
- ధనవంతులపై ప్రత్యేక పన్ను వేయాల్సిందే!
సహనం వందే, హైదరాబాద్:
ధనవంతులు-పేదల మధ్య ఉన్న దారుణమైన అంతరాన్ని ప్రముఖ ఆర్థిక నిపుణుల తాజా నివేదిక మరోసారి కళ్లకు కట్టింది. థామస్ పికెట్టీ, లూకాస్ చాన్సెల్ వంటి మేధావులు సవరించిన ప్రపంచ అసమానత నివేదిక (వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్) ప్రకారం… దేశ ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతున్నా ఆ వృద్ధి ఫలం కేవలం కొద్దిమంది సంపన్న వర్గాలకే దక్కుతోంది. సామాన్య ప్రజలు దారుణంగా అన్యాయానికి గురవుతున్నారు. దేశ సంపదలో ఏకంగా 40 శాతం వరకు అత్యంత ధనవంతులైన టాప్ 1 శాతం మంది గుప్పిట్లో ఉందని ఈ నివేదిక బట్టబయలు చేసింది. గత 3 దశాబ్దాలుగా పాలకులు అనుసరించిన తప్పుడు ఆర్థిక విధానాల వైఫల్యం కారణంగానే ఈ ధన కేంద్రీకరణ పెరిగిందని విమర్శకులు నిప్పులు చెరుగుతున్నారు.

అసమానతల్లో ప్రపంచంలోనే అగ్రస్థానం…
భారతదేశంలో ఆస్తి పంపిణీలో ఉన్న అసమానతలు ప్రపంచంలోనే అత్యంత భయంకర స్థాయిలో ఉన్నాయని నివేదిక తేల్చి చెప్పింది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలతో పోలిస్తే కూడా మన దేశంలో ఈ అంతరం మరింత దారుణంగా పెరిగింది. అత్యంత ధనవంతులైన టాప్ 10 శాతం మంది ఏకంగా 65 శాతం సంపదను తమ అధీనంలో ఉంచుకున్నారు. దీనికి విరుద్ధంగా దేశ జనాభాలో సగం మందిగా ఉన్న అట్టడుగు 50 శాతం పేద ప్రజల వద్ద ఉన్న సంపద కేవలం 6.4 శాతం మాత్రమే. ఈ సంఖ్యలు పాలకుల నిర్లక్ష్యానికి… దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అన్యాయానికి నిలువెత్తు నిదర్శనం. అత్యంత సంపన్నులైన 0.001% మంది ధనవంతుల వాటా కూడా 1995లో 3.8% నుంచి 2025 నాటికి ఏకంగా 6.1 శాతానికి పెరిగిందంటే సంపద ఎలా కేంద్రీకృతమవుతుందో అర్థం చేసుకోవచ్చు.

జాతీయ ఆదాయంలోనూ దోపిడీ!
సంపద కేంద్రీకరణతో పాటు ఆదాయ పంపిణీలోనూ దారుణమైన అసమానతలు పెరిగాయని నివేదిక తేటతెల్లం చేసింది. దేశ జాతీయ ఆదాయంలో అధిక 10 శాతం మంది ఏకంగా 58 శాతం వరకు కొల్లగొడుతున్నారు. 1980ల తర్వాత భారతదేశంలో ఈ ఆదాయ అసమానతలు అనూహ్యంగా పెరిగాయని నివేదిక తేల్చి చెప్పింది. అంటే అప్పటి నుంచి పాలించిన ప్రభుత్వాల ఆర్థిక సంస్కరణల దిశపై తీవ్ర అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఈ వృద్ధి ఫలాలు కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే దక్కుతుండగా గ్రామీణ రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని నివేదిక స్పష్టం చేసింది. ఈ అన్యాయమైన ఆదాయ పంపిణే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు పట్టిన పెద్ద పీడ.
ధనవంతులపై పన్ను వేయాల్సిందే!
ఈ ధన అసమానతలు సామాజిక అస్థిరతకు, ప్రజారోగ్య సమస్యలకు, పేదలకు విద్యా అవకాశాలు దొరకకపోవడానికి దారితీస్తాయని ఆర్థిక నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ విధానాలు ఈ అసమానతలను తగ్గించడంలో సరిగా ప్రభావం చూపడం లేదని నివేదిక ఎత్తి చూపింది. ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కావాలంటే ప్రభుత్వం పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి. సంపన్నులపై పన్నులు పెంచాలి. పేదలకు పటిష్టమైన సామాజిక సంక్షేమ పథకాలపై తక్షణమే దృష్టి సారించాలి. సమాన అవకాశాలు, న్యాయమైన పంపిణీ విధానాలను అమలు చేయడంలో ప్రభుత్వం, విద్యాసంస్థలు, ఆర్థిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని నివేదిక సూచించింది. లేకపోతే దేశ ప్రగతి మరింత సవాళ్లను ఎదుర్కొంటుందని పాలకులను నిపుణులు హెచ్చరించారు.