- తన కొడుకుతో జీవితమే కొత్త కోర్టు
- అమ్మగా ఒక తప్పు చేసినా మనసుకు బరువే!
సహనం వందే, హైదరాబాద్:
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటలోనే కాదు జీవితంలోనూ విజేతగా నిలిచింది. అనేక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సానియా… కోర్టు బయట తన తల్లి అనుభవాలను పంచుకుంది. తన కొడుకు ఇజ్హాన్‌ను పెంచే క్రమంలో తాను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం… జీవితంలో సమతుల్యత (బ్యాలెన్స్) సాధించడమే అని ఆమె అంటున్నారు. టెన్నిస్‌లో గెలవడం మాత్రమే కాదు, జీవితపు మ్యాచ్ ప్లాన్‌లో విజయం సాధించాలంటే కుటుంబం, కెరీర్ మధ్య సమన్వయం తప్పనిసరి అని ఈ టెన్నిస్ రాణి తేల్చి చెప్పింది. క్రికెటర్ షోయబ్ అహ్మద్ మాజీ భార్య అయిన సానియా 2018లో తల్లిగా మారిన తర్వాత వృత్తి జీవితాన్ని, ఇంటి బాధ్యతలను ఎలా మోస్తున్నారో వివరించింది.

టెన్నిస్‌లో యుద్ధం… తల్లిత్వంలో శాంతి
సానియా మాటల్లో చెప్పాలంటే… టెన్నిస్ ప్లేయర్‌గా ఉన్నప్పుడు ప్రతి మ్యాచ్ ఒక యుద్ధంలా ఉండేది. కానీ తల్లి అయిన తర్వాత తనకు సమతుల్యత అనే కొత్త బలం దొరికింది. కొడుకు సమయాన్ని, తన శిక్షణను, వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా మేనేజ్ చేయడం నేర్చుకున్నానని ఇది తన మనసును మరింత ప్రశాంతంగా మార్చిందని అన్నారు. అంతర్జాతీయ టోర్నీలకు వెళ్తున్నా… హైదరాబాద్‌లో కొడుకును చూసుకుంటున్నా తాను రెండింటినీ సమర్థంగా నిర్వహిస్తున్నానని చెప్పారు. ఒత్తిడికి అలవాటు పడిన తన మనస్తత్వాన్ని తల్లిత్వం పూర్తిగా మార్చేసిందని… ఇప్పుడు తాను మరింత శాంతంగా, స్థిరంగా, బలమైన మహిళగా ఉన్నానని సానియా పేర్కొంది.
అమ్మగా ఒక తప్పు కూడా మనసుకు బరువే!
టెన్నిస్ కోర్టులో ఉండే ఒత్తిడిని, తల్లిగా ఉండే ఒత్తిడిని పోల్చడం కష్టమని సానియా అన్నారు. అయితే తల్లిగా మారిన తర్వాతే తనకు నిజమైన ధైర్యం వచ్చిందని చెప్పారు. ఇజ్హాన్ ప్రతి రోజు కొత్త సవాలు విసురుతున్నాడని… అది తనను మరింత బలపరుస్తుందని ఆమె అన్నారు. టెన్నిస్ మ్యాచ్‌లో ఓడిపోతే మళ్లీ ఆడవచ్చు… కానీ తల్లిగా చిన్న పొరపాటు చేసినా అది మనసుకు బరువవుతుందని ఆమె తన మనసులోని మాటను వెల్లడించారు. ఈ ధైర్యమే తనను నిలబడేలా, జీవితాన్ని ఆస్వాదించేలా చేసిందని సానియా అభిప్రాయపడ్డారు. ఆమె ప్రయాణం మహిళలందరికీ ఒక పెద్ద స్ఫూర్తిగా నిలుస్తోంది.