‘భారత్ బ్రిటీష్ కాలనీ కాదు…’ – ఒక ప్రధాన ప్రపంచ శక్తి

Putin Comments on India
  • మోడీ మా దోస్త్: ఒత్తిళ్లకు లొంగని నేత
  • భారత్‌ను గుండెల్లో పెట్టుకుని జీవిస్తారు
  • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కితాబు
  • భారత్ టుడే’ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ
  • ఇండియా, చైనా రెండూ తమకు స్నేహితులే
  • జెలెన్స్కీ నియో-నాజీతో సమానం!
  • జీవితాన్ని 100% పొడిగించవచ్చని వ్యాఖ్య

సహనం వందే, న్యూఢిల్లీ:

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘భారత్ టుడే‘ గ్రూప్ టీవీ ఛానళ్లకు పుతిన్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో… భారత్‌తో తమ సంబంధం సామాన్య స్నేహం కాదని ఇది ప్రత్యేకమైనదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీని తన దోస్త్ అని పిలుస్తూ ఆయన చాలా విశ్వసనీయ వ్యక్తి అని, భారత్‌ను గుండెల్లో పెట్టుకుని జీవిస్తారని అన్నారు.

భారత్ బ్రిటిష్ కాలనీ కాదు…

ప్రధాని మోడీ నాయకత్వాన్ని పుతిన్ ఘనంగా కీర్తించారు. మోడీ అంత సులభంగా ఒత్తిడికి లొంగని నాయకుడని ప్రశంసించారు. భారత్ ఇకపై బ్రిటిష్ కాలనీ కాదని… అది ఒక ప్రధాన ప్రపంచ శక్తి అని అంతా గుర్తించాలని అన్నారు. మోడీ పాలనలో భారత ప్రజలు తమ నాయకుని గురించి గర్వంగా భావించవచ్చని కూడా అన్నారు. అలాగే భారత్, చైనా ఇద్దరూ తమకు సన్నిహిత స్నేహితులేనని… వారి సమస్యల్లో రష్యా జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు.

Putin and Modi

మా చమురు కొంటే తప్పేంటి?
రష్యా చమురు కొనుగోలుపై పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా పెడుతున్న ఒత్తిడిపై పుతిన్ తీవ్రంగా స్పందించారు. భారత్ రష్యన్ చమురు కొనుగోలు చేయడం న్యాయమైనది అంటూ భారత్‌కు బలమైన మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా పుతిన్ అమెరికా ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. అమెరికా తన అణు ప్లాంట్ల కోసం రష్యా నుంచి యురేనియం కొనే హక్కు అమెరికాకు ఉన్నప్పుడు భారత్‌కు ఎందుకు ఉండదంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కూడా చర్చిస్తామని పుతిన్ ప్రకటించారు. అంటే భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయానికి రష్యా పూర్తిగా అండగా నిలబడిందనే సంకేతం ఇచ్చారు.

జెలెన్స్కీ నియో-నాజీతో సమానం!
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ అధికారంలోకి వచ్చినప్పుడు శాంతిని సాధిస్తానని ప్రకటించినా ఇప్పుడు ఆయన వైఖరి పూర్తిగా మారిపోయిందని ఆరోపించారు. ఆయన దేశ ప్రజల ఆసక్తులకు కాకుండా రాడికల్ నేషనలిస్ట్ గ్రూపుల ఆందోళనలను పరిష్కరిస్తున్నారని అన్నారు. ఆ మనస్తత్వం నియో-నాజీ రెజీమ్‌తో సమానంగా ఉందన్నారు. ఎందుకంటే నేషనలిజం, నియో-నాజిజం దాదాపు ఒకే కాన్సెప్ట్‌లని పుతిన్ విమర్శించారు.

పాశ్చాత్య మీడియా దుష్ప్రచారం!
పాశ్చాత్య మీడియా రష్యాపై చేస్తున్న దుష్ప్రచారంపై పుతిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాత సోవియట్ యూనియన్‌ను పునరుద్ధరించాలని తాను కోరుకుంటున్నానని పశ్చిమ వార్తాపత్రికలు తరచూ చెబుతున్నాయని… కానీ వారికి తన వైఖరిని వివరించినా ప్రయోజనం లేదని అన్నారు. ఎందుకంటే వారు వినరని, రష్యాపై ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

జీవితాన్ని పొడిగించవచ్చు
సైన్స్, అమరత్వం గురించి మాట్లాడిన పుతిన్… దేవుడు మాత్రమే శాశ్వతుడని… ప్రతి ఒక్కరికీ ముగింపు ఉంటుందని పేర్కొన్నారు. అయితే జీవిత దీర్ఘాయుష్‌ను 100% పొడిగించవచ్చని తాను గట్టిగా విశ్వసిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా భారత్‌లో పబ్లిక్ హెల్త్‌లో వచ్చిన మార్పులను ఆయన ప్రస్తావించారు. 77 సంవత్సరాల క్రితం భారత్ సగటు జీవనాయుషు 31 సంవత్సరాలు మాత్రమే ఉంటే… ఇప్పుడు అది సుమారు 70కి చేరిందని గుర్తు చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *