కేసుల గోల… సనాతన సేవ – విజయసాయిరెడ్డి హిందుత్వ యాత్ర!

Vijayasai Reddy
  • ఒక్కసారిగా ధర్మ పరిరక్షకుడిలా బోధనలు
  • హిందూ మతంపై కుట్రలు సహించేది లేదంటూ
  • ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్న సాయిరెడ్డి
  • కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీ రాగం

సహనం వందే, అమరావతి:

మాజీ వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి వైఖరి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లూ వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు ఏనాడూ హిందుత్వ గురించి… మత మార్పిడుల గురించి మాట్లాడని ఆయన ఇప్పుడు ఒక్కసారిగా సనాతన ధర్మ పరిరక్షకుడిలా అవతారమెత్తారు. హిందూ మతంపై కుట్రలు సహించేది లేదంటూ ఎక్స్ వేదికగా గరంగరంగా పోస్టులు పెడుతున్నారు. డబ్బు ఆశ చూపి మతం మార్చితే బుద్ధి చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మత మార్పిడులపై కేంద్రం కమిటీ వేసి విచారణ చేపట్టాలని కోరుతున్నారు. ఆయన ఈ కొత్త అవతారం చూసి ఇది ఎప్పుడో వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు ఇలాంటి మాట ఒక్కటైనా అన్నారా అని రాజకీయ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి.

కేసుల ఒత్తిడి… ఢిల్లీపైన చూపు!
విజయసాయిరెడ్డి
తన రాజకీయ మార్గాన్ని మార్చుకోవడానికి ప్రధాన కారణం కేసుల ఒత్తిడే అని ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం నుంచి మొదలు పెడితే ఆయనను వెంటాడుతున్న కేసుల ఫైళ్లు ఏమాత్రం తక్కువ కావు. వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చాక వ్యాపారాల్లో మునిగిపోయినా కేంద్ర సంస్థలు పెట్టిన కేసులు ఆయనను వదలడం లేదు. ఇప్పుడు కేంద్రంతో స్నేహం చేస్తే ఈ భారం తగ్గుతుందని, అందుకే బీజేపీ తలుపు తట్టే యత్నం మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. హిందుత్వ గొడుగు పట్టుకోవడం వెనుక కేసుల భయం, బీజేపీ టికెట్ ఆశే ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్!
ఇప్పటివరకు వైఎస్సార్సీపీతో ఉన్న విజయసాయిరెడ్డి ఒక్కసారిగా హిందుత్వ అజెండాను భుజానికెత్తుకోవడం వెనక బీజేపీ నుంచి సీటు ఆశిస్తున్నారనేది బహిరంగ రహస్యం. గతంలో జగన్ కోసం ఎంత గాటుగా మాట్లాడారో… ఇప్పుడు అదేస్థాయిలో హిందూ మతం కోసం ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుంటున్న సమయంలో విజయసాయి లాంటి పెద్ద నేతలు కమలం వైపు దూకడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో విజయసాయి లాంటి నేతలు చేరితే పార్టీకి బలం పెరుగుతుంది. ఇప్పటికే కొందరు వైఎస్సార్సీపీ నాయకులు బీజేపీ వైపు చూస్తుండగా విజయసాయి కూడా ఆ జాబితాలో చేరితే మరో రాజకీయ భూకంపం తప్పదు. ఈ హిందుత్వ డ్రామా ఎంత దూరం నడుస్తుందో చూడాలి మరి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *