- ఈ ఏడాది మూడు రెట్లు పెరిగిన వాడకం
- సామాజిక మాధ్యమాల్లో కోపంతో దందా
- ఆగ్రహాన్ని రెచ్చగొట్టడమే వెబ్‌సైట్లకు ట్రాఫిక్
- అలాంటి కంటెంటే జనంలోకి వెళ్తాయి
సహనం వందే, హైదరాబాద్:
ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురణ సంస్థ ఈ ఏడాదికి గాను ఒక సంచలనాత్మక పదాన్ని ప్రకటించింది. ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ‘రేజ్ బెయిట్’ (Rage Bait) ను ఎంపిక చేసింది. అంటే మనల్ని కావాలని కోపం తెప్పించడానికి… ఆగ్రహాన్ని రేకెత్తించడానికి వాడే కంటెంట్ అని అర్థం. గత 12 నెలల్లో ఈ పదం వాడుక ఏకంగా మూడు రెట్లు పెరిగిందంటే సోషల్ మీడియాలో ఆగ్రహం ఏ స్థాయిలో అమ్ముడవుతోందో అర్థం చేసుకోవచ్చు.

లాభాల కోసం మీ కోపం ఒక పెట్టుబడి!
సోషల్ మీడియా ఫీడ్ చూస్తున్నప్పుడు మీకు అకస్మాత్తుగా చిరాకు, కోపం వచ్చాయంటే… మీరు రేజ్ బెయిట్ కు బలవుతున్నట్లే! ఇది క్లిక్‌బైట్ (Clickbait) లాంటిదే అయినా దీని ఉద్దేశం కేవలం పాఠకులను లాగడం కాదు… వారిలోని ఆగ్రహాన్ని రెచ్చగొట్టడం. ప్రజలు కోపంతో కామెంట్లు పెట్టినా… ఆ కంటెంట్‌ను షేర్ చేసినా… ఆ అకౌంట్లకు, వెబ్‌సైట్లకు ట్రాఫిక్ పెరిగి లాభాలు వస్తాయి. ఆల్గరిథమ్స్ (Algorithms) కూడా కోపం, ఆగ్రహం ఉన్న కంటెంట్‌నే జనంలోకి ఎక్కువగా పంపిస్తాయి. అందుకే ఇంటర్నెట్ ఇప్పుడు కేవలం మన దృష్టిని ఆకర్షించకుండా, మన భావోద్వేగాలనే పెట్టుబడిగా మార్చుకుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘ఆరా ఫార్మింగ్’, ‘బయోహ్యాక్’ పదాలు వెనక్కి
ఈ ఏడాది రేజ్ బెయిట్ పదం… పోటీలో ఉన్న మరో రెండు కీలకమైన పదాలను వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది. వాటిలో ఒకటి ఆరా ఫార్మింగ్ (Aura Farming). ఇది ఒక వ్యక్తి ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకోవడానికి చేసే ప్రయత్నం. రెండోది బయోహ్యాక్ (Biohack). ఇది ఆహారం, వ్యాయామం, సాంకేతిక పరికరాలు ఉపయోగించి ఆరోగ్యం, పనితీరును మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించడం. ఈ మూడు పదాలపై ప్రజల ఓట్లు తీసుకున్న తర్వాతే భాషా నిపుణుల బృందం రేజ్ బెయిట్ ను ఎంపిక చేసింది.
మెదడుకు విశ్రాంతి లేకుండా పోతోంది!
గత ఏడాది ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన బ్రెయిన్ రాట్ (Brain Rot)… ఈ ఏడాది ఎంపికైన రేజ్ బెయిట్ ఒకే థీమ్‌ను చెబుతున్నాయని భాషా నిపుణులు అంటున్నారు. బ్రెయిన్ రాట్ అంటే నిరంతరం సోషల్ మీడియా స్క్రోలింగ్ వల్ల కలిగే మానసిక అలసట. ఇప్పుడు ఈ రేజ్ బెయిట్ వల్ల వచ్చే ఆగ్రహం నిరంతరంగా మనల్ని ఉచ్చులో పడేస్తోంది. ఈ రెండూ కలిసి మనిషిని మానసికంగా కుంగదీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఆక్స్‌ఫర్డ్ మాత్రమే కాదు… కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఈ ఏడాది పదంగా పారసోషల్ (Parasocial)ను, కొల్లిన్స్ డిక్షనరీ వైబ్ కోడింగ్ (Vibe Coding)ను ప్రకటించాయి. సాంకేతికతతో నడిచే ఈ ప్రపంచంలో మనిషి జీవితం ఎటువైపు మళ్లుతోందో ఈ పదాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.