- పుతిన్ పర్యటనలో ప్రతిపక్షానికి అవమానం
- అతిథులను కలవనీయని ప్రభుత్వం
- తాము కూడా దేశానికే ప్రాతినిధ్యం వహిస్తాం…
- కేవలం ప్రభుత్వం మాత్రమే కాదని విమర్శ
సహనం వందే, న్యూఢిల్లీ:
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటన సందర్భంగా ప్రతిపక్షానికి చుక్కెదురైంది. విదేశీ ప్రముఖులు దేశాన్ని సందర్శించినప్పుడు సంప్రదాయబద్ధంగా ప్రతిపక్ష నాయకులతో కూడా సమావేశమవడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని పూర్తిగా తుంగలో తొక్కిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం పార్లమెంట్ బయట విలేకరులతో మాట్లాడిన రాహుల్ గాంధీ… విదేశీ ప్రతినిధులు ప్రతిపక్ష నాయకులను కలువకుండా కేంద్రం వ్యవస్థీకృతంగా అడ్డుకుంటోందని ఆరోపించారు.
అభద్రతా భావంతోనే ఆంక్షలు…
గతంలో వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో ఈ సంప్రదాయం గౌరవంగా అమలయ్యేదని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఈ రోజుల్లో విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు గానీ, తాను విదేశాలకు వెళ్లినప్పుడు గానీ ప్రతిపక్ష నాయకుడిని కలవకూడదని ప్రభుత్వం వారికి సలహా ఇస్తోందని ఆయన ఆరోపించారు. తాము కూడా భారతదేశానికే ప్రాతినిధ్యం వహిస్తామని… కేవలం ప్రభుత్వం మాత్రమే కాదని ఆయన తేల్చి చెప్పారు. విదేశాంగ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం తరచూ విదేశీ ప్రతినిధులను ప్రతిపక్షం నుంచి దూరం ఉంచుతున్నాయని… దీనికి కారణం వారి అభద్రతా భావమే అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. దేశం పట్ల ప్రతిపక్షం భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించడం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు.
భారత్-రష్యా బంధం కాంగ్రెస్ పుణ్యమే!
ఇదిలా ఉండగా పుతిన్ గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోడీ ఆయనకు ప్రైవేట్ విందు ఇచ్చారు. ఇరువురి మధ్య శుక్రవారం జరగనున్న అధికారిక చర్చల్లో రక్షణ సహకారం, వాణిజ్యం, అణు రియాక్టర్లపై దృష్టి పెట్టనున్నారు. భారత్-అమెరికా సంబంధాలు మందగించిన నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుత భారత్-రష్యా సంబంధాలు 1955లో ఇండో-సోవియట్ భాగస్వామ్యం నుంచి నేరుగా పుట్టుకొచ్చాయని కాంగ్రెస్ పార్టీ చరిత్రను గుర్తు చేసింది. ఆనాటి సోవియట్ నేతలు నికోలాయ్ బుల్గానిన్, నికితా క్రుష్చెవ్‌ల 1955 పర్యటనను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రస్తావించారు.
చరిత్రను మరచిన ప్రభుత్వం
1955లో సోవియట్ నాయకులు 19 రోజులపాటు ఇక్కడ పర్యటించారని… ఆ పర్యటన తర్వాతే హెచ్‌ఏఎల్ ద్వారా మిగ్ విమానాల తయారీ, ఓఎన్‌జీసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన జరిగిందని జైరాం రమేష్ గుర్తు చేశారు. అంటే దేశాభివృద్ధిలో గత ప్రభుత్వాల పాత్ర ఎంత గొప్పదో కాంగ్రెస్ చెప్పకనే చెప్పింది. దాదాపు 28 గంటల పాటు సాగనున్న పుతిన్ పర్యటన శుక్రవారం రాత్రి 9:30 గంటలకు ముగియనుంది. దేశానికి ఇంత ముఖ్యమైన అతిథి వచ్చినప్పుడు ప్రతిపక్షాన్ని పూర్తిగా పక్కనపెట్టడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, కేవలం తమ పార్టీకి మాత్రమే దేశం ప్రాతినిధ్యం అని కేంద్రం భావించడం ఎంతవరకు సమంజసమని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.