- దీంతో విమానాశ్రయాల్లోనే ప్రయాణీకులు
- వసతులు కల్పించకపోవడంతో అక్కడే నిద్ర
- మందులు లేక వృద్ధులు… పిల్లలు విలవిల
- ప్రత్యామ్నాయ చర్యలపై ఇండిగో నిర్లక్ష్యం
- రోజుకో కుంటి సాగు చెబుతున్న బడా సంస్థ
- పట్టించుకోని కేంద్ర విమానయాన శాఖ మంత్రి
సహనం వందే, హైదరాబాద్:
దేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో వరుసగా నాలుగో రోజు కూడా ప్రయాణికుల ఆందోళనలు ఆగడం లేదు. ఇండిగో విమానాలు ఆలస్యం కావడం… చివరి నిమిషంలో రద్దు కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇది ఎంతటి దారుణమో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని 6 ముఖ్య నగరాలలో గురువారం బయలుదేరిన విమానాలు కేవలం ఎనిమిదిన్నర శాతం మాత్రమే. ఇంత దారుణమైన సేవను విమానయాన సంస్థ అందిస్తుంటే ప్రయాణికులను మనుషులుగా చూస్తున్నట్టు అనుకోవచ్చా?
క్షమాపణ చెబితే సరిపోతుందా?
కంపెనీ యాజమాన్యం ఒక చిన్న ప్రకటన విడుదల చేసి ‘క్షమించండి’ అని చెప్పి చేతులు దులుపుకుంది. త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని హామీ ఇచ్చారు. కానీ నాలుగు రోజులుగా ఒక్క మార్పు కూడా కనిపించడం లేదు. విమానాలు రద్దు కావడంతో ఆగ్రహించిన ప్రయాణికులు కౌంటర్ల వద్ద సిబ్బందిని నిలదీస్తున్నా వారు నవ్వుతూ తప్పించుకుంటున్నారు. కోట్లాది రూపాయల వ్యాపారం చేసే బడా సంస్థ బాధ్యత ఇదేనా? కనీస స్పందన లేకుండా ప్రయాణికులను గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసం?
డబ్బులు లేవు… హోటల్ లేదు… సీటు లేదు!
విమానం రద్దు అయిన ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. వేరే విమానంలో ప్రత్యామ్నాయ సీటు కల్పించడం లేదు. కనీసం రాత్రి గడపడానికి ఒక హోటల్ కూడా ఏర్పాటు చేయడం లేదు. చిన్న పిల్లలతో వచ్చిన తల్లులు విమానాశ్రయాలలో నేలపైనే పడుకుని రాత్రంతా అల్లాడిపోయారు. మందులు వాడాల్సిన వృద్ధులు సరైన సమయంలో ఔషధాలు తీసుకోలేక అవస్థలు పడుతున్నారు. ఈ కష్టాలన్నీ ఇండిగో కళ్ల ముందే కనిపిస్తున్నా ఆ కంపెనీకి చీమ కుట్టినట్టు కూడా లేదు. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న ఈ సంస్థపై ఎవరు చర్య తీసుకుంటారు?
ఇండిగో రోజుకో కొత్త కారణం…
సిబ్బందికి శిక్షణ, కొత్త సాఫ్ట్‌వేర్, వాతావరణం బాగోలేకపోవడం… రోజుకో కొత్త కారణం చెబుతున్నారు. ఇవన్నీ సాకులు తప్ప మరొకటి కాదు. నిజం మాత్రం ఒక్కటే ఇండిగో అతివేగంగా విస్తరించింది. కానీ ఆ స్థాయి విమానాలను, సిబ్బందిని సమర్థవంతంగా నిర్వహించే శక్తిని అది కోల్పోయింది. కంపెనీ చేసిన ఈ తప్పుకు మూల్యం ప్రయాణికులు చెల్లించుకోవాల్సి వస్తోంది. తమ వైఫల్యాన్ని ఒప్పుకునే దమ్ము ఇండిగోకి లేదా?
ప్రభుత్వ మౌనం దేనికి సంకేతం?
వందలాది విమానాలు రద్దు అయినా, లక్షలాది మంది ప్రయాణికులు నష్టపోయినా కేంద్ర విమానయాన మంత్రి కానీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానీ నోరు మెదపడం లేదు. ఇండిగోకి జరిమానా వేయడం, లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదు. డబ్బు ఉంటే దేన్నైనా మేనేజ్ చేయవచ్చు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. సామాన్యుడి కష్టాన్ని పట్టించుకోకుండా విమానయాన సంస్థల వైపు మొగ్గు చూపుతున్న ప్రభుత్వం వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.