టాటా ట్రస్ట్… బీజేపీ లూట్ – కాషాయం ఖజానాకు గుట్టలుగా నిధులు

Tata Trust Money to BJP
  • ఆ పార్టీకి ఏకంగా రూ. 757 కోట్ల విరాళం
  • అలాగే కాంగ్రెస్ పార్టీకి రూ. 77‌ కోట్ల నిధులు
  • ఎన్నికల బాండ్లను రద్దు చేసినా ఆగని దందా
  • ట్రస్టుల ముసుగులో పార్టీలకు నిధుల వరద

సహనం వందే, న్యూఢిల్లీ:

సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ఎన్నికల బాండ్ల వ్యవహారంపై తెరపడింది అనుకుంటున్న తరుణంలో రాజకీయ పార్టీలకు నిధుల ప్రవాహం మరో కొత్త రూపంలో కొనసాగుతోంది. కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న ప్రొగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ (పీఈటీ) ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీగా రూ. 915 కోట్ల విరాళాల పంపిణీ జరిగింది. అందులో 83 శాతం వాటా ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖాతాలోకి చేరింది. టాటా ట్రస్ట్ ద్వారా బీజేపీకి రూ. 757.6 కోట్ల నిధులు అందగా, కాంగ్రెస్ పార్టీకి రూ. 77.3 కోట్లు మాత్రమే దక్కాయి. మిగతా నిధులను తృణమూల్ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేడీ వంటి ఇతర పార్టీలకు టాటా ట్రస్ట్ పంపిణీ చేసింది.

బాండ్ల రద్దుతో ఆగని దందా…
ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పు సైతం బీజేపీ ఖజానాపై పెద్దగా ప్రభావం చూపలేదని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివిధ ఎలక్టోరల్ ట్రస్టుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం టాటా ట్రస్ట్ నుంచే కాకుండా న్యూ డెమొక్రాటిక్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా రూ. 150 కోట్లు, హార్మొనీ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా రూ. 30.1 కోట్లు, ట్రయంఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా రూ. 21 కోట్ల మేర బీజేపీకి విరాళాలు అందాయి. ఈ ట్రస్టులన్నింటి ద్వారా కలిపి బీజేపీ ఏకంగా రూ. 959 కోట్లకు పైగా నిధులను సొంతం చేసుకుంది. అధికారంలో ఉన్న పార్టీకి కార్పొరేట్ విరాళాలు గుట్టలు గుట్టలుగా వచ్చి పడుతున్న వైనాన్ని ఈ లెక్కలు బట్టబయలు చేస్తున్నాయి.

కాంగ్రెస్‌కు బాండ్ల కంటే తక్కువ!
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి 2024–25లో ట్రస్టుల ద్వారా రూ. 313 కోట్లకు పైగా విరాళాలు అందినప్పటికీ… ఇది గతంలో ఎన్నికల బాండ్ల ద్వారా అందిన నిధులతో పోలిస్తే చాలా తక్కువ కావడం గమనార్హం. 2023–24లో కాంగ్రెస్ బాండ్ల ద్వారా రూ. 828 కోట్లు అందుకోగా… ఈ ఏడాది ట్రస్టులు, ఇతర మార్గాల ద్వారా కలిపి ఆ పార్టీ మొత్తం రూ. 517 కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ, బీఆర్‌ఎస్ వంటి ప్రాంతీయ పార్టీల పరిస్థితి కూడా అంతే. వీరికి అందిన నిధులు గత ఎన్నికల బాండ్ల ద్వారా అందిన భారీ మొత్తంతో పోలిస్తే బాగా తగ్గిపోయాయి. దేశంలో ఎన్నికల నిధులు అధికార పార్టీ వైపు మాత్రమే మళ్లుతున్న తీరుపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది.

టాటా కంపెనీలదే సింహభాగం

పీఈటీకి విరాళాలు అందించిన టాటా గ్రూపు కంపెనీల్లో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 308 కోట్లు, టీసీఎస్ రూ. 217.6 కోట్లు, టాటా స్టీల్ రూ. 173 కోట్లు, టాటా మోటార్స్ రూ. 49.4 కోట్లు చొప్పున భారీ విరాళాలు అందించాయి. ట్రస్టుల ద్వారా విరాళాలు ఇచ్చినా ఎక్కువ శాతం నిధులు అధికారంలో ఉన్న పార్టీకే వెళ్లడం ప్రజాస్వామ్యంలో నిధుల పంపిణీ తీరుపై తీవ్ర అనుమానాలకు, చర్చకు దారితీస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *