- తమ గోప్యత రూల్సుకు విరుద్ధమని క్లారిటీ
- భద్రతాపరమైన లోపాలు తలెత్తే అవకాశం
- ప్రపంచంలో ఎక్కడా అంగీకరించలేదని వెల్లడి
- కోట్ల మందిపై పట్టుకోసమేనన్న విమర్శలు
సహనం వందే, హైదరాబాద్:
సంచార్ సాథీ ప్రీఇన్‌స్టాలేషన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రీ ఇన్‌స్టాలేషన్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ యాప్ ఆప్షన్ మాత్రమేనని వెల్లడించింది. అయినప్పటికీ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అంటున్నారు. అయితే ఈ యాప్ విషయంలో యాపిల్ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ తయారీదారులు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది.
కోట్ల మందిపై పట్టు…
దేశంలోని 73 కోట్ల స్మార్ట్‌ఫోన్లపై పూర్తి పట్టు సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం వేసిన అడుగు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలను కలవరానికి గురిచేస్తోంది. భారతదేశంలో విక్రయించే ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ తప్పనిసరిగా సంచార్ సాథీ అనే సైబర్ సేఫ్టీ యాప్‌ను ముందుగానే లోడ్ చేయాలని టెలికం శాఖ జారీ చేసిన రహస్య ఆదేశాలు పెద్ద రాజకీయ దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలకు తలొగ్గేది లేదంటూ యాపిల్ కంపెనీ గట్టిగా నిలబడింది. దొంగిలించిన ఫోన్లను ట్రాక్ చేయడానికి, బ్లాక్ చేయడానికి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ యాప్ లక్ష్మమని ప్రభుత్వం చెబుతున్నా ఇది పౌరులపై నిఘా పెట్టే సాధనం అని ప్రతిపక్షాలు, గోప్యత న్యాయవాదులు విమర్శిస్తున్నారు.
యాపిల్ తిరస్కరణ…
యాపిల్ కంపెనీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయంలో తమకున్న ఆందోళనలను తెలియజేయడానికి సిద్ధమైంది. తమ ఐఓఎస్ గోప్యత, భద్రత ప్రమాణాలకు విరుద్ధంగా ఉండటం వలన ప్రపంచంలో ఎక్కడా తాము ఇలాంటి ఆదేశాలను పాటించమని ఆ సంస్థ ప్రభుత్వానికి చెప్పనుంది. భద్రతాపరమైన లోపాలు తలెత్తే అవకాశం ఉన్నందున తాము ఈ ఆదేశాన్ని అమలు చేయలేమని యాపిల్ ఖచ్చితంగా చెబుతోంది. గోప్యతపై కఠిన నియంత్రణలు పాటించే యాపిల్… తన యాప్ స్టోర్, ప్రొప్రైటరీ ఐఓఎస్ సాఫ్ట్‌వేర్‌పై ఇతరుల జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేస్తోంది.
పార్లమెంటులో రచ్చ…
ఈ యాప్ ఆదేశంపై పార్లమెంట్ లోపల వెలుపల తీవ్ర రాజకీయ రచ్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ ప్రత్యర్థులు ఈ యాప్‌ను గూఢచర్యం చేసే సాధనంగా అభివర్ణించారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా ‘బిగ్ బ్రదర్ మమ్మల్ని చూడలేడు’ అంటూ ఈ నిబంధనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో కేంద్ర ఈ యాప్ పై వెనక్కు తగ్గింది. వినియోగదారులు దాన్ని ఎప్పుడైనా సులభంగా డిలీట్ చేసుకోవచ్చని వివరణ ఇచ్చింది.
ఓపెన్ సోర్స్ వర్సెస్ క్లోజ్డ్ సోర్స్…
యాపిల్ తన ఐఓఎస్‌ను కట్టుదిట్టంగా నియంత్రిస్తుంది. కానీ గూగుల్ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ కాబట్టి శాంసంగ్, షియోమీ వంటి తయారీదారులు సాఫ్ట్‌వేర్‌ను మార్చుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నారు. అందుకే ఇతర కంపెనీలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై సమీక్షిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ యాప్ ద్వారా చట్టబద్ధమైన ఫోన్లన్నింటిపైనా నిఘా పెట్టేందుకు ప్రయత్నించడం, పౌరుల వ్యక్తిగత జీవితాలపై అధికార దౌర్జన్యం అని రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గినట్లు కనిపించినప్పటికీ వీటిని ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.