- రాత్రీ పగలు కలిసి ఉండటంపై విమర్శలు
- ఇలాంటి కల్చర్ ఇండియాలో ఎక్కడ ఉంది?
- పైగా వాళ్లు అడల్ట్స్ కాబట్టి అంటూ కామెంట్స్
- ఇలాంటి చెత్త ఐడియాతో సినిమాకు హైప్
- నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది గర్ల్ ఫ్రెండ్‘
- ఈ సినిమా పిల్లలకు చూపించకపోవడమే బెస్ట్
సహనం వందే, హైదరాబాద్:
ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రం ఈరోజు నుంచి (డిసెంబర్ 5) నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి సినిమాలు కుటుంబ సభ్యులు కలిసి చూడాలా లేదా అన్నది ఇక్కడ చర్చనీయాంశం. ఈ సినిమాకు విపరీతమైన హైప్ ఇచ్చి గొప్ప కళాఖండంగా డప్పు కొట్టుకుంటున్నారు. ఇలాంటి సినిమాలు బోలెడు వచ్చాయి. ఇందులో అభ్యుదయ భావాలతో చూపించిన ప్రత్యేకతలు ఏమీ లేవని గుర్తుంచుకోవాలి. పైగా టీనేజ్ పిల్లల మనసుల్లో విష భావాలు నింపేలా ఈ చిత్రం ఉందన్న విమర్శలు ఉన్నాయి.
సినిమా కథ సంక్షిప్తంగా…
తల్లిలేని భూమ (రష్మిక) అనే అమ్మాయి కాలేజీలో విక్కీ అనే యువకుడి ప్రేమలో పడడం, ఆ తర్వాత అభద్రతా భావం పెరిగి బ్రేకప్ వరకు వెళ్లడం… ఇదంతా ఇప్పటికే తెలుగు తెరపై పదుల సంఖ్యలో చూసిన రొటీన్ ట్రాక్. దర్శకుడు రాహుల్ రవీంద్ర ఈ ప్రేమకథను ఎంచుకుని కూడా ఏమాత్రం కొత్తదనం చూపించలేకపోయారు. బ్రేకప్ తర్వాత అమ్మాయి పడే బాధ, వేధింపులు కొంచెం ఆసక్తి పెంచినా మొత్తం కథనం నీరసంగా సాగింది. పదునైన సన్నివేశాలు లేకపోవడంతో ప్రేక్షకులు అసలు ఆసక్తి కోల్పోతారు. కథలో కీలకమైన అంశాలను చూపించడానికి దర్శకుడు తీసుకున్న సినిమాటిక్ ఫ్రీడమ్ ప్రేక్షకులకు మింగుడుపడదు. ముఖ్యంగా బ్రేకప్ తర్వాత ఆమె ఎదుర్కొనే వేధింపులు, చివరికి ధైర్యంగా నిలబడటం వంటి పాత్రలో జీవించింది. కానీ వాటిని హుందాగా చిత్రీకరించడంలో దర్శకుడు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.
ఓయో రూముగా లేడీస్ హాస్టల్…
కాలేజీ లేడీస్ హాస్టల్‌లో ఓ అబ్బాయి రాత్రి మొత్తం అమ్మాయి గదిలో గడిపి రావడం ఎలా సాధ్యం? అంతేకాదు బాయ్స్ హాస్టల్ లో కూడా అమ్మాయి రాత్రంతా ఉండి వస్తుంది. కాలేజీ యాజమాన్యం, హాస్టల్ అధికారులు కళ్లు మూసుకుని ఉంటారా? అంతటితో ఆగకుండా అమ్మాయి గది తలుపుపై అసభ్యకరమైన రాతలు, పెయింటింగ్‌లు వేసినా ఎవరూ స్పందించకపోవడం హాస్యాస్పదం. వాటిని చూసి తండ్రి బాధపడరా? ఈ విషయంపై యాజమాన్యాన్ని తండ్రి ప్రశ్నిస్తే స్టూడెంట్స్ ఇద్దరు మేజర్లు కాబట్టి తాము పట్టించుకోమని సమాధానం చెప్పడం ఏం మాత్రం జీర్ణించుకోలేని డైలాగ్. దర్శకుడు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కాలేజీ లేడీస్ హాస్టల్ ను ఓయో రూముగా మార్చేయడం పరాకాష్ట.
ఎక్కడైనా ఇలాంటి హాస్టళ్లు ఉంటాయా?
ఇలాంటి లాజిక్ లేని సన్నివేశాలు పెట్టడం వల్ల సినిమా ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. ఇండియాలో ఏ కాలేజీ హాస్టల్లోనైనా ప్రేమికులు ఒకే గదిలో రాత్రిళ్ళు గడుపుతున్నారా? ఇలాంటి అసభ్యకర అసహ్యకరమైన సన్నివేశాలు పెట్టి దీనికి అభ్యుదయకరమైన సినిమాగా డప్పుకొట్టుకోవడం దారుణం. ఇక కాలేజీలో హీరో హీరోయిన్లు ఎప్పుడూ గట్టిగా హత్తుకొని రాసుకుపూసుకు తిరగడం కూడా ఎబ్బెట్టుగా ఉంది. బ్రేకప్ తర్వాత యువతులు ఎదుర్కొనే హింసపై హెచ్చరిక సందేశం బాగున్నా… తీసిన తీరు ఏమీ బాగోలేదు. ఇలాంటి సినిమాలు టీనేజీ పిల్లలకు ఏమాత్రం ఉపయోగపడకపోగా వారిలో లేనిపోని ఆలోచనలను కలిగిస్తుంది.
సినీ క్రిటిక్: వినోద్