- ‘తెలంగాణ ప్రజలవి దిష్టి కండ్లు’ అన్న పవన్
- ఈ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతల ఆగ్రహం
- సినిమాటోగ్రఫీ మంత్రి వెంకట్ రెడ్డి మండిపాటు
- రాష్ట్రం నుండి తరిమి కొడతామని వార్నింగ్స్
- పవర్ స్టార్ సినిమాలు ఆడనివ్వమని వ్యాఖ్య
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ ప్రజల గురించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. అంతేకాదు… ‘తెలంగాణ ప్రజల దిష్టి కాదు… ఆంధ్రా పాలకుల వల్లనే ఫ్లోరైడ్ విషం తాగారు’ అంటూ పవన్ వ్యాఖ్యలను బలంగా తిప్పికొట్టారు. ‘మంత్రి హోదాలో చెబుతున్నా… ఒక్క థియేటర్‌లో కూడా పవన్ సినిమా విడుదల కాద’ని ఆయన వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ మాట్లాడుతూ… ‘పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాల’ని డిమాండ్ చేశారు.

తెలంగాణ నుండి తరిమి కొడతాం…
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే కాదు ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా పవన్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ నుండి తరిమి కొడతామని ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే… పవన్ కళ్యాణ్‌ను గెలిపించడం వల్లనే గోదావరి జిల్లాలకు దిష్టి తగిలింది అంటూ ఆంధ్రా రాజకీయాల కోణంలోనే విమర్శలు గుప్పించారు.
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి… ‘తెలంగాణ ప్రజలవి దిష్టి కండ్లు’ అని వ్యాఖ్యానించిన పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీపై ప్రేమ ఉంటే ఇక్కడ ఆస్తులు అమ్ముకుని విజయవాడకు వెళ్లిపోవాలని, కొత్తగా ఇక్కడ ఆస్తులు ఎందుకు కొంటున్నారని ప్రశ్నించారు. తల దాచుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి హైదరాబాద్ కావాలి గానీ… తెలంగాణ ప్రజలది నరదిష్టి అంటారా అని అనిరుధ్ నిప్పులు చెరిగారు.
బీఆర్‌ఎస్ మౌనం…
ఈ వివాదంలో తెలంగాణ సాధించినట్టు చెప్పుకునే బీఆర్‌ఎస్ నాయకులు ఎవరూ నోరు మెదపకపోవడం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో ఏ చిన్న సమస్య వచ్చినా గంటల వ్యవధిలో స్పందించే బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్-జనసేన లొల్లిలో వేలు పెట్టకపోవడం వెనుక కారణాలు ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అధికార కాంగ్రెస్ నాయకులు మాత్రం పవన్ వ్యాఖ్యలను రెండు రాష్ట్రాల మధ్య విద్వేషం పెంచే చర్యగా అభివర్ణిస్తున్నారు. పవన్ తెలంగాణలో వనరులు వాడుకుని ఈ స్థాయికి ఎదిగాడని మంత్రి వాకిటి శ్రీహరి గుర్తుచేశారు. తలతిక్క మాటలు మానేసి మైలేజ్ కావాలంటే పనితనం చూపించు అని హితవు పలికారు.