- ఏఐలో వెనుకబడ్డ యాపిల్ కంపెనీ
- దాన్ని ‘సిరి’ చేసేందుకు సుబ్బుకు బాధ్యతలు
- అమెరికా కంపెనీలకు భారతీయులే దిక్కు
- గూగుల్… మైక్రోసాఫ్ట్… ఇప్పుడు యాపిల్
- ఈ దిగ్గజ కంపెనీలకు మనోళ్లే బాసులు
సహనం వందే, హైదరాబాద్:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో మేధావుల కోసం జరుగుతున్న టాలెంట్ వార్ తారస్థాయికి చేరింది. టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్‌లకు షాకిస్తూ… యాపిల్ ఒక కీలక అడుగు వేసింది. గూగుల్ జెమిని ఏఐ అసిస్టెంట్ ఇంజనీరింగ్ హెడ్‌గా పనిచేసి… తర్వాత మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అమర్ సుబ్రమణ్యాన్ని యాపిల్ ఏఐకి కొత్త వైస్ ప్రెసిడెంటుగా నియమించుకుంది. ఏఐ రేసులో వెనుకబడిన యాపిల్‌ను ముందుకు తీసుకెళ్లడమే సుబ్రహ్మణ్య ముందున్న అతిపెద్ద సవాల్.

మైక్రోసాఫ్ట్, గూగుల్ నుంచి ‘టాలెంట్’ వలస
సిలికాన్ వ్యాలీలో మేధావుల వలసలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చెప్పడానికి సుబ్రహ్మణ్యం నియామకమే నిదర్శనం. గతంలో మైక్రోసాఫ్ట్ సంస్థ గూగుల్ డీప్‌మైండ్ నుంచి ఇరవైకి పైగా పరిశోధకులను లాగేసుకోగా… ఇప్పుడు యాపిల్ ఏకంగా మైక్రోసాఫ్ట్ నుంచి సుబ్రహ్మణ్యను తమ వైపు తిప్పుకుంది. ఈ పోరాటం కేవలం పేరు ప్రఖ్యాతులు, పదుల కోట్ల జీతాల కోసం మాత్రమే కాదు. భవిష్యత్తును శాసించబోయే ఇంటెలిజెంట్ మెషీన్లను నిర్మించడానికి అవసరమైన అత్యున్నత మేధస్సు కోసం జరుగుతున్న యుద్ధం ఇది. ఇప్పుడు సిరి అప్‌గ్రేడ్, యాపిల్ ఇంటెలిజెన్స్ సూట్ వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న యాపిల్‌లో ఫౌండేషన్ మోడల్స్, మెషీన్ లెర్నింగ్ రీసెర్చ్, ఏఐ సేఫ్టీ టీమ్‌ల పర్యవేక్షణ బాధ్యతలు సుబ్రహ్మణ్యకు దక్కాయి.
గోప్యతకు భంగం లేకుండా యాపిల్ ఏఐ పదును…
యాపిల్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సాంకేతిక సవాలు గోప్యత (ప్రైవసీ). ఇతర సంస్థల మాదిరిగా భారీ యూజర్ డేటాను సేకరించి దానికి శిక్షణ ఇవ్వడానికి యాపిల్ సుముఖంగా లేదు. ఈ సమస్యకు సుబ్రహ్మణ్య దగ్గర ఉన్న సెమీ-సూపర్‌వైజ్డ్ లెర్నింగ్ అనే సాంకేతిక నైపుణ్యం గొప్ప పరిష్కారం కాబోతోంది. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ చేసిన ఆయన పరిమిత లేబుల్ డేటాతో ఏఐ సిస్టమ్‌లకు శిక్షణ ఇచ్చే విధానంలో స్పెషలిస్ట్. సింథటిక్, లైసెన్స్ పొందిన డేటాసెట్‌లతో శక్తివంతమైన ఏఐని నిర్మించడానికి ఇది సాయపడుతుంది. స్పీచ్ రికగ్నిషన్, సహజ భాషా ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పి)లో ఆయనకున్న అనుభవం ‘సిరి’ని పూర్తిగా ఆధునీకరించడంలో కీలకం కానుంది.
అమెరికా టెక్ లీడర్‌షిప్‌లో భారత మేధోశక్తి…
మైక్రోసాఫ్ట్‌కు సత్య నాదెళ్ల, గూగుల్‌కు సుందర్ పిచాయ్ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు యాపిల్ ఏఐ విభాగానికి సుబ్రహ్మణ్య రాకతో అమెరికా టెక్ ప్రపంచంలోని కీలక స్థానాల్లో భారతీయ సంతతి మేధోశక్తి హవా మరింత పెరిగింది. గూగుల్ జెమిని వంటి శక్తివంతమైన మల్టీమోడల్ ఏఐ ఇంజనీరింగ్‌కు నాయకత్వం వహించిన సుబ్రహ్మణ్యకు ఈ రంగంలో తిరుగులేని అనుభవం ఉంది. జెమినితో యాపిల్ చేసుకున్న బిలియన్ డాలర్ల లైసెన్సింగ్ ఒప్పందానికి తోడు ఇప్పుడు సుబ్రహ్మణ్య తన అనుభవాన్ని జోడించి యాపిల్‌ను ఏఐ రేసులో అగ్రస్థానానికి తీసుకెళ్తారో లేదో చూడాలి. యాపిల్ భవితవ్యం ఇప్పుడు పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉందనడంలో సందేహం లేదు.