- సీఎం మొదలు ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా
- శని, ఆదివారాల్లో ఏపీలో ఉండని నేతలు
- మాజీ సీఎం జగన్ బెంగళూరులో మకాం
- అమరావతిని పట్టించుకోని పెద్దలు
సహనం వందే, అమరావతి:
ఆంధ్రప్రదేశ్ అంటే వారికి పీక్ అవర్స్ లో పని చేసే ఒక తాత్కాలిక కార్యాలయం మాత్రమే! వీకెండ్ వచ్చిందంటే చాలు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, అత్యున్నత అధికారులు అనేకమంది హుటాహుటిన హైదరాబాద్‌కి పరిగెడుతున్నారు! ఏపీ రాజకీయాలు, పాలన ఇప్పుడు వారాంతపు షటిల్ సర్వీస్‌ల చుట్టే తిరుగుతోంది. రాజధాని ప్రాంతంలో వారాంతంలో బోసిపోయి ఉంటుంది.

ప్రత్యేక విమానంలోనే పయనం…
వారాంతంలో నేతలు హైదరాబాదుకు వెళ్లడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాలను… చార్టెడ్ ఫ్లైట్లను తమ సొంత ప్రయాణాలకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… ఈ ముగ్గురూ కొద్ది నెలల్లోనే వందలసార్లు హైదరాబాద్ వెళ్లి వచ్చారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పవన్ 104, లోకేశ్ 83, చంద్రబాబు 80 సార్లు హైదరాబాద్ వెళ్ళినట్టు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రయాణాలకు ప్రజాధనం ఎంత ఖర్చు అవుతోంది? పేద రాష్ట్రం అని చెబుతూనే నాయకులు విలాసాలకు కోట్ల రూపాయలు తగలేయడం ఏపీ ప్రజలకు అడుగడుగునా అవమానం!
కుటుంబంతో వీకెండ్ ఎంజాయ్…
నిజానికి ఈ వీకెండ్ వలసలకు ప్రధాన కారణం కుటుంబ బంధాలే. పాలకులు, అధికారులు తమ కుటుంబాలను ఇంకా హైదరాబాద్‌లోనే అంటిపెట్టుకుని ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారి కుటుంబాలే రాజధాని ప్రాంతానికి వచ్చి వెళ్లాలి కానీ పాలకులే పక్క రాష్ట్రానికి పోవడమేంటి? అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర మంత్రుల పరిస్థితి కూడా ఇంతే. అమరావతి ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడం, హైదరాబాద్‌లో అన్ని సౌకర్యాలు దొరుకుతున్నాయన్న నెపంతో పక్క రాష్ట్రాన్ని దర్జాగా వాడుకుంటున్నారు.
జగన్ బెంగళూరులో మకాం…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం బెంగళూరులో మకాం వేసి రాజధానిని ఖాళీ చేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన అవసరాన్ని బట్టి తాడేపల్లి వస్తుంటారు. వారంలో నాలుగు ఐదు రోజులు బెంగళూరులోనే ఉంటారనే విమర్శలు ఉన్నాయి. ఈ ముఖ్యనేతలు వారం మొత్తం రాజధాని ప్రాంతంలో అందుబాటులో ఉంటేనే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయి. అత్యవసర సమావేశాలు, కీలక నిర్ణయాలు వారమంతా సాగుతాయి. కానీ ఈ నాయకులంతా వ్యక్తిగత విలాసాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఏపీని గాలికొదిలేస్తున్నారు. ఇకనైనా కళ్లు తెరుస్తారా? లేక సహనాన్ని మరింత పరీక్షిస్తారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
