- గ్లామర్ బంద్… కంటెంట్ జిందాబాద్
- వాస్తవికత… కథనమే అసలైన బలం
- హీరో డమ్మీ… స్టోరీ, పాత్రలే అన్నీ
- మౌత్ టాక్ వల్లనే సూపర్ హిట్లు
సహనం వందే, హైదరాబాద్:
భాషతో సంబంధం లేకుండా ఒక సినిమాకు దేశమంతా ఫిదా అవుతోందంటే దాని వెనుక బలమైన కథ, అద్భుతమైన కథనం ఉన్నట్టే లెక్క. దశాబ్దాలుగా కేరళ సరిహద్దులకే పరిమితమైన మలయాళ సినిమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. హిందీ, తెలుగు, తమిళ ప్రేక్షకులతో సహా దేశంలోని అన్ని వర్గాలు కిష్కింధ కాండం స్క్రీన్‌ప్లే గురించి, ‘ఆవేశం’లోని ఇల్యూమినాటి పాటపై మాట్లాడుకుంటున్నారు. ఒక్క తెలుగు సూపర్‌స్టార్ లేకపోయినా మంజుమ్మెల్ బాయ్స్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రావడం దీనికి నిదర్శనం.


వాస్తవికత… కథనమే అసలైన బలం
మలయాళ సినిమా విజయం రాత్రికి రాత్రే వచ్చింది కాదని… దీని వెనుక దశాబ్దాల కష్టం ఉందని దర్శకుడు అరుణ్ చందు అంటున్నారు. 80ల మధ్యలో వచ్చిన సాంస్కృతిక, సృజనాత్మక మలుపు నుంచే ఈ ప్రయాణం మొదలైందని ఆయన తెలిపారు. దీంతో కథనం మరింత పదునుగా మారిందని, నటనలో నిజాయితీ పెరిగిందని వివరించారు. ఇక్కడ కథ ఎంత స్థానికంగా ఉంటే అది అంత ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తుందని చెబుతున్నారు. గ్లామర్ హంగులు, మూస ఫార్మాట్‌పై దృష్టి పెట్టకుండా కేవలం కథపైనే శ్రద్ధ పెట్టడం వారికి కలిసి వస్తోంది. ఈ వాస్తవికతే ప్రేక్షకులను కట్టిపడేస్తుందని అంటున్నారు.
నటులే కాదు… పాత్రలే హీరోలు
తెలుగు సినీ పరిశ్రమలో హీరో వర్షిప్ ఎక్కువగా కనిపిస్తే మలయాళ సినిమాలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఇక్కడి పాత్రలు సంపూర్ణంగా, నిజాయితీగా, సహజంగా ఉంటాయి. వారు తప్పులు చేస్తారు… టీ తాగుతారు… అలకబూనుతారు… అనుమానం వ్యక్తం చేస్తారు… మారుతారు… వీరు తిరుగులేని శక్తిమంతులుగా కాకుండా మన పక్కన ఉండే మనుషులుగా అనిపిస్తారు. ఎమోషనల్ పరంగా నిజాయితీగా చెప్పే కథలు ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అవుతాయని నటుడు అజు వర్గీస్ అన్నారు.
మౌత్ టాక్… సూపర్ హిట్
గత సంవత్సర కాలంలో మంజుమ్మెల్ బాయ్స్ స్నేహానికి ప్రతీకగా నిలిచింది. ఆడుజీవితం సినిమా మేకింగ్, నటన సరిహద్దులను చెరిపేసింది. ‘ఆవేశం’లో ఫహద్ ఫాసిల్ నటన సంచలనంగా మారింది. ఇక ప్రేమలు, కిష్కింధ కాండం సినిమాలతో ఈ పరిశ్రమ రొమాంటిక్ కామెడీ నుంచి థ్రిల్లర్ వరకు ఏ జోనర్‌నైనా బలంగా చేయగలదని నిరూపించింది. మలయాళ సినిమా ఎప్పుడూ పాన్-ఇండియా అని లక్ష్యంగా పెట్టుకోలేదు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే కథలను అందించింది. ప్రచారం కన్నా మౌత్-టాక్ (నోటి మాట) మలయాళ చిత్రాలకు అతిపెద్ద పంపిణీదారుగా మారింది. మలయాళ సినిమాలు హడావుడి చేయవు… అరుపులు ఉండవు. నిశబ్దానికి ప్రాధాన్యత ఇస్తాయి. ఈ సహజత్వమే మలయాళ సినిమాకు తిరుగులేని విజయాన్ని తెచ్చిపెడుతోంది.