కొత్త చట్టం… బానిసత్వం – కార్మికుల 8 గంటల పని పరిమితి ఎత్తివేత

New Labor Laws
  • బానిసత్వంలోకి నెట్టే నాలుగు కొత్త చట్టాలు
  • దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి అమలులోకి
  • ఇప్పటికే 12 గంటల పని పెంచిన రాష్ట్రాలు
  • సమ్మె చేయాలంటే 60 రోజుల ముందు నోటీస్
  • అమలులోకి ప్రమాదకరమైన కొత్త నిబంధన
  • ఇలాగైతే తక్షణమే స్పందించే అవకాశం లేనట్టే

సహనం వందే, న్యూఢిల్లీ:
యువతి యువకుల్లారా మీరు దేశాన్ని అభివృద్ధి చేయాలంటే బాగా పనిచేయాలి. అలా చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జోలికి వెళ్ళమాకండి. ఎందుకంటే మీకు కుటుంబంతో గడిపే సమయం ఉండదు. ఇప్పటివరకు రోజుకు 8 గంటలున్న పని విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 12 గంటల వరకు పెంచుకునేలా సవరణలు చేసింది. హైదరాబాదు లాంటి చోట్ల 12 గంటలు పని చేసిన తర్వాత ట్రాఫిక్ లో రెండు మూడు గంటలు పోతుంది. అంటే రోజుకు మీరు 15 గంటలు బానిసత్వం చేసిన తర్వాత ఇక మీకు కుటుంబం ఎందుకు? కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి కొత్తగా అమలులోకి తెచ్చిన నాలుగు కార్మిక చట్టాలపై దేశవ్యాప్తంగా గగ్గోలు మొదలైంది. ఇన్ఫోసిస్ అధిపతి నారాయణమూర్తి ఇప్పటికే వారానికి 72 గంటలు పని చేయమని చెప్పారు. అందుకు అనుగుణంగానే కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి.

ఎప్పుడైనా తీసేయొచ్చు… మూసేయొచ్చు
ఈ చట్టాలలో పారిశ్రామిక సంబంధాల కోడ్-2020 అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే 300 మంది వరకు కార్మికులున్న కంపెనీలు ఉద్యోగులను అడ్డగోలుగా తొలగించడానికి (లే-ఆఫ్) లేదా ఏకంగా సంస్థను మూసేయడానికి ఇకపై ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. గతంలో ఈ పరిమితి కేవలం 100 మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ సంఖ్యను ఏకంగా మూడు రెట్లు పెంచడం అంటే దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలన్నీ యజమానుల గుప్పిట్లో చిక్కుకుపోయినట్లే. ఎందుకంటే చాలావరకు పరిశ్రమలు ఈ పరిమితిలోపే ఉంటాయి. ఈ అసాధారణ వెసులుబాటుతో ఉద్యోగ భద్రత అనేది కార్మికుడికి ఒక కలగా మారనుంది.

సమ్మె చేయాలంటే 60 రోజులు ఆగాల్సిందే…
కార్మికుల పోరాటానికి ఉన్న అస్త్రాల్లో సమ్మె హక్కు అత్యంత పదునైనది. అయితే కొత్త పారిశ్రామిక సంబంధాల కోడ్ ఈ అస్త్రాన్ని మొద్దుబారేలా చేసింది. చట్టబద్ధంగా సమ్మె చేయాలంటే యూనియన్ తప్పనిసరిగా 60 రోజుల ముందు నోటీసు ఇవ్వాలనే కొత్త నిబంధనను తీసుకువచ్చారు. గతంలో ఇంత సుదీర్ఘ గడువు అవసరం లేదు. దీనికి తోడు ఏదైనా వివాదం లేబర్ ట్రైబ్యునల్ లేదా నేషనల్ ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్‌లో ఉంటే ఆ తీర్పు వెలువడిన తర్వాత కూడా మరో 60 రోజుల పాటు సమ్మె చేయడానికి వీల్లేదు. ఈ నిబంధనల వల్ల కార్మిక సంఘాలు తక్షణమే స్పందించి పోరాడగలిగే శక్తిని పూర్తిగా కోల్పోతాయి. యజమానుల అన్యాయాలకు నిరసనగా తక్షణం గొంతెత్తే అవకాశం లేకుండా పోయింది.

పర్మినెంట్ పోస్టులకు పాతర!
కొత్త చట్టంలో ‘ఫిక్స్‌డ్-టర్మ్ ఎంప్లాయ్‌మెంట్’ (ఎఫ్‌టీఈ) నిబంధనలను చట్టబద్ధం చేయడం కార్మికుడి జీవిత భద్రతకు పెను ప్రమాదంగా మారింది. నిర్ణీత కాలానికి కాంట్రాక్టుపై కార్మికులను నియమించుకోవడానికి కంపెనీలకు ఇది అధికారం ఇస్తుంది. ఈ ఉద్యోగులకు గ్రాట్యుటీ సహా ఇతర ప్రయోజనాలు దక్కుతాయని ప్రభుత్వం మాయమాటలు చెబుతున్నా దీనర్థం పర్మినెంట్ ఉద్యోగ నియామకాలకు శాశ్వతంగా తాళం వేయడం తప్ప మరొకటి కాదు. కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత ఎటువంటి కారణం చూపకుండా కార్మికులను సులభంగా తొలగించడానికి ఈ విధానం కంపెనీలకు ఉన్న అడ్డంకులను తొలగించింది. దీర్ఘకాలిక ఉద్యోగ భద్రతను పూర్తిగా లేకుండా చేసి కార్మికులను ఎప్పుడైనా తీసిపారేయడానికి వీలైన తాత్కాలిక సరుకుగా మార్చే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.

శ్రమ దోపిడీకి కొత్త రూపం: 12 గంటల పని
కార్మికుల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితాన్ని బలితీసుకునేలా కొన్ని రాష్ట్రాలు కొత్త కోడ్‌ల ముసుగులో పని దినాన్ని 8 గంటల నుంచి ఏకంగా 12 గంటలకు పెంచేలా సవరణలు తీసుకొచ్చాయి. చట్టంలో వారానికి 48 గంటల పని గంటలు అని ఉన్నప్పటికీ రోజువారీ పరిమితిని పెంచడం శ్రమ దోపిడీకి కొత్త మార్గాన్ని తెరిచినట్టైంది. కార్మికులు తమ కుటుంబాలతో గడిపే సమయాన్ని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే విరామాన్ని పూర్తిగా దూరం చేశారు. పని గంటలు పెరిగినా ఆ మేరకు ఆదాయం పెరగకపోవడం, జీతాలు మాత్రం పెరగకపోవడం ఈ శ్రమ దోపిడీకి పరాకాష్ట.

నిర్వచనాల్లో గందరగోళం: అమలులో ఆటంకం!
ముఖ్యమైన పదాలైన కార్మికుడు, వేతనాలు వంటి వాటికి కూడా ఈ నాలుగు కోడ్‌లలో స్పష్టమైన, స్థిరమైన నిర్వచనాలు లేవని నిపుణులు వేలెత్తి చూపుతున్నారు. ఒక్కో కోడ్‌లో ఒక్కో రకంగా నిర్వచనాలు ఉండడం వల్ల కోర్టుల్లో, అమలులో అడుగడుగునా గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా చాలా రాష్ట్రాలు తమ సొంత నిబంధనలను పూర్తి స్థాయిలో నోటిఫై చేయకపోవడం వల్ల దేశవ్యాప్తంగా ఈ సంస్కరణల అమలులో అసమానతలు ఏర్పడి మళ్లీ కార్మికులకు అన్యాయమే జరుగుతుందని కార్మిక వర్గం గగ్గోలు పెడుతోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *